OTR: బీఆర్ఎస్‌లో కోల్డ్ వార్? ఒకే రోజు రెండు సమావేశాలతో కొత్త చర్చ!

Brs

Brs

క్యూర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా?మూడు మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని విపక్ష పార్టీ టార్గెట్‌గా పెట్టుకుందా?ఒకే రోజున ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశం కావటానికి కారణం ఏంటి?పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండాలని ప్రయత్నించే సమయంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయా?అసలు…బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది?

తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపాలిటీలో ఎలాగైనా గెలవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటోందని తెలుస్తోంది. అందుకోసం నేతలందరూ ఒక తాటి మీదికి రావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకమైన సూచనలు కూడా చేశారట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ, సైబరాబాద్ మునిసిపాలిటీ, మల్కాజ్‌గిరి మున్సిపాలిటీల పరిధిలో రెండు జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పరిధిలోకి వచ్చే ఇక్కడ త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీ యాక్టివిటీస్‌ పెంచేందుకు అధిష్టానం నుంచి ప్రత్యేకమైన గైడెన్స్ వచ్చాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఐతే…ఇక్కడే అసలు పరీక్ష మొదలైంది. యాక్టివిటీ పెంచాలని అధిష్టానం నుంచి సూచనలు రాగానే నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారట. ఎవరికి వాళ్లుగా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారని సమాచారం. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలోని క్యూర్ పరిధిలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకోసం కాలేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అందరూ ఎమ్మెల్యేలు కలిసి వెళ్లారు. ఈ సమావేశానికి హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళలేదు. నేతలు అక్కడికి వెళ్ళిన రోజే హైదరాబాద్ ఎమ్మెల్యేలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఒకవైపు హైదరాబాద్‌కు తాగునీళ్ల కోసం పోరాటం చేస్తామంటూ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి ఒక టీం వెళితే..తెలంగాణ భవన్‌లో మరో సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు రెండు ప్రోగ్రామ్స్ ఒకేరోజు చేసుకోవాల్సిన అవసరం ఏంటని పార్టీ నేతల మధ్య చర్చ నడుస్తోందట. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మేడిగడ్డ వద్దకు…హైదరాబాద్ జిల్లాలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో ఉండటం రాజకీయంగా చర్చకు దారి తీసింది. అయితే ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా ఏదో జరుగుతోందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం.

క్యూర్ పరిధిలోనే త్వరలో రెండు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా జరగబోతున్న ఇలాంటి సమయంలో ఇలా గ్రూపు రాజకీయాలు మైంటైన్ చేస్తున్నారా ఏంటి అని పార్టీలో చర్చ మొదలైంది. ఒకవేళ గ్రూప్ రాజకీయాలు ఉంటే అధిష్టానం వెంటనే కల్పించుకొని వారి మధ్య కుదిరించాలని గులాబీ నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇది ఇంతటితోనే ఆగిపోతుందా భవిష్యత్తులో కూడా రెండు టీములుగా రంగారెడ్డి జిల్లా నేతలు వర్సెస్ హైదరాబాద్ జిల్లా నేతలుగా జరుగుతుందా చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.