ఆ నియోజకవర్గ కారు పార్టీలో కుదుపులు మొదలయ్యాయా…? ఎమ్మెల్యే తీరుపై సొంత నేతల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందా? మళ్ళీ ఆయనకి టిక్కెట్ ఇస్తే… సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? సొంత పార్టీ నాయకులకు ఆ శాసనసభ్యుడు ఎందుకు టార్గెట్ అయ్యారు? సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు చింతా ప్రభాకర్. 2014 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవగా…. పదేళ్ల తర్వాత తిరిగి చట్టసభలో అడుగుపెట్టారాయన. అయితే 2023 ఎన్నికలకు ముందు సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే టికెట్ కోసం పెద్దపోరే నడిచింది. ఆశావహులు ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ టికెట్ చింతాకు రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు జోక్యం చేసుకున్న పార్టీ ముఖ్యనేత హరీశ్ రావు అందరిని ఒకతాటిపైకి తెచ్చారు. ఆయన ఆదేశాలతో…అసమ్మతి నేతలంతా కలిసిపని చేసి గెలిపించారు. అయితే చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల వరకు అంతా బాగానే ఉన్నా తర్వాత మెల్లమెల్లగా వర్గపోరు బయటపడుతూ వచ్చింది. ఎమ్మెల్యే అయ్యాక ఆయన తమను పట్టించుకోవడం లేదని కొంతమంది బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. అధిష్టానం బుజ్జగించి ఎన్నికల టైంలో ఆయన్ని నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమించిది. అలాగే జిల్లా అధ్యక్షపదవి ఇస్తామని హమీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలైపోయాక పంచాయతీ ఎన్నికల్లో పట్నం మాణిక్యం సతీమణి బీఆర్ఎస్ నుంచి ఫసల్ వాదీ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. అయితే.. రెబల్ అభ్యర్థిని పెట్టి చింతా ప్రభాకర్ ఓడించారని ఆరోపిస్తున్నారు మాణిక్యం. ఎన్నికల్లో చింతా గెలుపు కోసం పని చేస్తే… ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదా అని పార్టీ పెద్దల్ని ప్రశ్నించారట. అలాగే నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా ఉన్న తనకి పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని..తన గ్రామానికి వస్తే కూడా కనీసం చెప్పడం లేదని అంటున్నారట మాణిక్యం. అందుకే ఇకపై చింతాతో సఖ్యతగా ఉండబోనని వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇక తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటానని తన అనుచరులతో చెబుతున్నట్టు తెలిసింది. ఇక సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శివరాజ్ పాటిల్ కూడా ఎమ్మెల్యే చింతా తీరుపై అసంతృప్తితో ఉన్నారట. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తే వారికి నచ్చజెప్పాల్సింది పోయి రెబల్ అభ్యర్థులకే చింతా మద్దతిచ్చారని…అందుకే సదాశివపేట మున్సిపాలిటీ చేజారిందని అంటున్నారాయన.
వచ్చే ఎన్నికల్లో పోటీ వస్తాననే ఎమ్మెల్యే ఇలా చేశారని చెప్పుకుంటున్నారట. ఎమ్మెల్యేపై అసమ్మతితో ఉన్న పట్నం మాణిక్యం, శివరాజ్ పాటిలే కాకుండా ఉదయం లేస్తే చింతా ప్రభాకర్ తో కలిసి తిరిగే నాయకుల్లో కూడా ఒకరిద్దరు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారు. అయితే… వీటన్నిటి మీద ఎమ్మెల్యే వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తాను ఎవర్నీ దూరం పెట్టలేదని, కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారాయన.
తలకిందులుగా తపస్సు చేసినా వాళ్లతో ఏమీ కాదని చెబుతున్నారట. తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని.. గోతికాడ నక్కల్లా ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి టికెట్ తనకేనని అంటున్నారాయన. ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే… నేను మంత్రి అవుతానని కూడా సన్నిహితుల దగ్గర ధీమా వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకుంటనున్నారు. ఆ ఐదేళ్ల తర్వాతే రాజకీయాల్లో రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తానని అంటున్నట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో కారు పార్టీకి కొంతవరకు బ్రేకులు పడ్డాయి. పంచాయతీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రాగా…మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలను అధికార పార్టీ గెల్చుకుంది.నేతల మధ్య సయోధ్య లేకపోవడమే అందుకు కారణమని క్యాడర్ గుసగుసలాడుతోంది. మొత్తంగా సంగారెడ్డి కారులో కుదుపులు మొదలయ్యాయన్నది అందరి అభిప్రాయం. సొంత పార్టీలో ప్రత్యర్థులుగా మారుతున్న కొంతమంది వల్ల ఇక మీదట చింతాకి చింతలు తప్పవన్న ప్రచారం పెరుగుతోంది. ఈ నియోజకవర్గంపై అధిష్టానం దృష్టి సారించి కలహాల కాపురానికి ఎండ్ కార్డ్ వేయాలంటోంది కేడర్.

