ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ లీడర్స్ చేతులెత్తేశారా? స్థానిక సమరానికి ప్రత్యర్థులు కత్తులు నూరుతుంటే… వాళ్ళ మాత్రం అస్త్ర సన్యాసం చేశారా? యుద్ధానికి మేం సిద్ధమని సైనికులు అంటుంటే… నడపాల్సిన దళపతులు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? వాళ్ళకు ఎక్కడ లేడా కొడుతోంది? ఏ జిల్లాలో ఉంది అంత దారుణమైన పరిస్థితి?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీని.. మాజీ ఎమ్మెల్యేలు గాలికొదిలేశారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆ విషయమై కేడర్ తీవ్ర ఆందోళనలో ఉందట. ఓ వైపు స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ సిద్ధమవుతుంటే… బీఆర్‌ఎస్‌లో మాత్రం అంతా సైలెంట్‌గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నది కేడర్ అభియోగం. పోటీకి ద్వితీయ శ్రేణి నేతలు రెడీ అవుతుంటే… వాళ్ళలో భరోసా నింపే ప్రయత్నం ఏ మాత్రం చేయకపోవడాన్ని చూస్తుంటే… స్థానిక ఎన్నికల విషయంలో వీళ్లంతా చేతులెత్తేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. పార్టీ అధికారం కోల్పోయాక.. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారు. నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. వాళ్ళు కనీసం ముఖ్య కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండటం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది కేడర్‌లో. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కోసం అధికార పార్టీ నేతలు నియోజకవర్గాల్లో దూకుడు పెంచితే.. మేం మాత్రం ఏం చేయాలో అర్ధంగాక దిక్కులు చూస్తున్నామని అంటున్నాయట గులాబీ శ్రేణులు.మాజీ ఎమ్మెల్యేలు తమ వైపు కన్నెత్తి చూడకపోవడంతో… అసలు బరిలో దిగాలా.. వద్దా అనే అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి ప్రశాంత్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నా….ఇటీవలి పరిణామాలతో అంతా గందరగోళంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె జిల్లా పర్యటనకు వస్తే.. ముఖ్య నేతలు, మాజీలు ముఖం చాటేస్తున్న పరిస్థితి. దీంతో జిల్లా పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వర్గాలుగా చీలిపోతున్నట్టు చెబుతున్నారు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చుట్టపుచూపులా వచ్చి వెళ్తుండటంతో పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైందట. బాన్సువాడలో బీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి గెలినప్పటికీ.. ఆయన హస్తం పార్టీలో చేరడంతో అక్కడ ఇన్ఛార్జ్ సైతం లేకుండా పోయారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించినా ఆయన చుట్టపు చూపులా వెళ్లొస్తున్నారట. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారే నియోజకవర్గానికి వచ్చారు. ఎక్కువ శాతం దుబాయ్‌లోనే ఉంటున్నారట ఆయన. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గానికి రావడం లేదంటూ క్యాడర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు సమాచారం. జుక్కల్, కామారెడ్డిలో పరిస్దితి మరీ దారుణంగా ఉందంటున్నారు. బాల్కొండలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం పెద్ద దిక్కుగా మారారు. అటు ఎమ్మెల్సీ కవిత జాగృతి బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండటంతో జిల్లాపై ఫోకస్ తగ్గిందనే టాక్ నడుస్తోంది. ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కార్య క్షేత్రంలో దిగక.. పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్త చేయకపోవడంతో.. ఒక రకమైన నైరాశ్యం పెరుగుతోందన్నది పార్టీ వర్గాల మాట.
మేమున్నామనే భరోసా ఇచ్చే వారు కరువయ్యారని గులాబీ క్యాడర్.. దిగాలు చెందుతోందట. తమకు అనుకూల పరిస్దితులు ఉన్నాయని చెప్పుకొస్తున్న గులాబీ పార్టీ పెద్దలు.. ఆ దిశలో కార్యచరణ లేకపోవడంతో పల్లెల్లో అయోమయ పరిస్థితి ఉందని అంటున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ కవిత వర్గం-మాజీ ఎమ్మెల్యేల వర్గంగా పార్టీ క్యాడర్ చీలిపోవడంతో..ఈసారి కవిత వర్గానికి టికెట్లు వస్తాయా లేదా అన్న చర్చ సైతం జరుగుతోంది. అలాగే… స్థానిక ఎన్నికల్లో కవిత ప్రచారం చేయకపోతే టికెట్లు వచ్చిన వాళ్ల గెలుపు అంత తేలిగ్గా ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యేల వర్గీయులు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. దీంతో అసలు పోటీ చేయాలా వద్దా అనే సందిగ్దంలో పడ్డారట. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లను మార్చండంటూ.. క్యాడర్ రోడ్డెక్కే పరిస్దితి రాకముందే.. గులాబీ పెద్దలు లోకల్ వార్ పై ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది.
