సకుటుంబ సపరివార సమేతంగా…… ఈ మాట పెళ్లిళ్లు, పేరంటాలకు బాగా వర్తిస్తుందిగానీ… పాలిటిక్స్‌లో మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారట ఆ సీనియర్ పొలిటీషియన్. ఆయన కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు జడ్పీటీసీలుగా నామినేషన్ వేశారు. ఎవరా కీలక నేత? ఏ పరిస్థితుల్లో అంత మందిని రంగంలోకి దింపాల్సి వచ్చింది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో….. అందులోనూ వైసీపీ వ్యవహారాల్లో బొత్స సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయనది పొలిటికల్ ఫ్యామిలీ ప్యాక్ అంటూ చమత్కరించే వాళ్ళు కూడా తక్కువేం కాదు. ఆయన మేనల్లుడు చిన్న శ్రీను గతంలో జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మామకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ జిల్లా వైసీపీ మీద తనదైన ముద్ర వేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. బొత్స బిజీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చే అనేక రాజకీయ వ్యవహారాలు చిన్న శ్రీను ద్వారా ముందుకు సాగేవని కూడా చెబుతారు. ఈ క్రమంలోనే జిల్లాలో చిన్న శ్రీను తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని అంటారు.
కానీ… ఇటీవల ఊహించని పరిణామాలు జరిగాయి. మామా అల్లుళ్ళ మధ్య తేడాలతో చిన్న శ్రీను వైసీపీకి బైబై చెప్పేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. బొత్స ఫ్యామిలీ నుంచి, అందునా చిన్న శ్రీను లాంటి నాయకుడు ఇలా జంప్ అవడం ఒక రకంగా షాకేనన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. అదే సమయంలో బొత్స కుటుంబ రాజకీయ పరిణామాలపై సైతం చర్చ మొదలైంది. ఒకప్పుడు ఒకే వ్యవస్థలో కలిసి… ఒకే మాటగా పనిచేసిన మామా అల్లుళ్ళు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉండటంతో జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. తాజాగా బొత్స కుటుంబం నుంచి ఐదుగురు జడ్పీటీసీలుగా నామినేషన్ వేయడాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చిన్నశ్రీను వెళ్ళిపోయినా… నో ప్రాబ్లమ్. జిల్లా మీద నా పట్టు నాదేనని చెప్పడానికే సత్తిబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చంటూ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు, చిన్న శ్రీను కూడా… తన కుమార్తెతో నామినేషన్ వేయించడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక చిన్న శ్రీను పార్టీ మార్పు తర్వాత బొత్స రాజకీయంగా జిల్లాలో తన పట్టు చెక్కు చెదరకుండా నిలుపుకోవడంపై దృష్టి సారించారన్న చర్చకు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. కుటుంబ సభ్యులను వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల నుంచి బరిలోకి దించారాయన. చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి జెడ్పీటీసీ స్థానానికి కోడలు పూజితతో పాటు గుర్ల జెడ్పీటీసీ స్థానానికి చెల్లెలు వెంకటలక్ష్మిని బరిలో దింపారట సత్యనారాయణ. అలాగే గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానానికి కుమార్తె అనూష, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ జెడ్పీటీసీ స్థానానికి తమ్ముడు లక్ష్మణరావు కుమారుడు చైతన్యను బరిలో దింపారు. ఈ నామినేషన్లతో మూడు నియోజకవర్గాల పరిధిలో బొత్స కుటుంబం రాజకీయంగా చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తోందన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు వరకు అభ్యర్థుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత పడడం బొత్స రాజకీయ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. చివరి రోజున ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ల వ్యవహారంలో చురుగ్గా పాల్గొన్నారు. అదే మాదిరిగా చిన్న శ్రీను కూడా తన కుమార్తె సిరిసహస్రతో నామినేషన్ దాఖలు చేయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే… సిరిసహస్ర రెండు చోట్ల నామినేషన్లు వేయడం వెనుక వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే… ఆమె ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకుంటున్నారు. కొత్తవలస జెడ్పీటీసీ ఇతర అభ్యర్థులతో బేరసారాలు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైంది. మొత్తం మీద స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత విజయనగరం పొలిటికల్ స్క్రీన్‌పై బొత్స ఫ్యామిలీ సీన్ డిఫరెంట్‌గా కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.

