Site icon NTV Telugu

Off The Record : కూటమి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా భూమన?

Bhumana

Bhumana

మీకో దండం సామీ…. ఆయన్ని కెలకొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ….. టీడీపీ పెద్ద లీడర్స్‌తో మొరపెట్టుకుంటున్నారట ఆ నియోజకవర్గ నాయకులు. మీరు వస్తారు, ఏదో మాట్లాడి వెళ్తారు, తర్వాత ఆయన అటాక్‌ని కౌంటర్‌ చేసుకోలేక మాకు తల ప్రాణం తోకకు వస్తోంది. ఏదన్నా చేయగలిగితే చేయండి, లేదంటే నోరు మూసుకోండి అని ఘాటుగానే అంటున్నారట. అధికార పార్టీకి అంత కొరకరాని కొయ్యలా మారిన ఆ లీడర్‌ ఎవరు? ఎక్కడుందా పరిస్థితి? వైసీపీ అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు భూమన కరుణాకర్‌రెడ్డి. అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, ఆ తర్వాత జగన్‌తో కూడా కొనసాగుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో రెండోసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన కరుణాకర్‌రెడ్డికి… రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి కూడా దక్కింది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీచేసి కుమారుడు ఓడిపోయాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నా… ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారిపోతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ఆయన అలా అవుతున్నారనేదానికంటే…. మావాళ్ళే కెలికి ఆ రకంగా తయారుచేస్తున్నారంటూ తిరుపతి టీడీపీ నాయకుల్లో అసహనం పెరుగుతోందట. అమరావతి నుంచి ఎవరో ఒకరొచ్చి మీడియా సమావేశం పెట్టడం, ఏవేవో మాట్లాడేయడం, వాటిని సీరియస్‌గా తీసుకుని ఆయన ప్రతి సవాళ్ళు విసరడం లాంటి వాటితో… వాతావరణం పూర్తిగా మారిపోతోందని అంటున్నారు. ఆరోపణలు చేసి కరుణాకర్‌రెడ్డిని బలహీనపరుద్దామని మా వాళ్ళు అనుకుంటుంటే.. అవే ఆయన బలం పెంచుతున్నాయన్నది లోకల్‌ తమ్ముళ్ళ ఆవేదన. అదే సమయంలో నిజానిజాల సంగతి పక్కన పెడితే భూమన కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అపచారాలంటూ చేస్తున్న రివర్స్‌ అటాక్‌కు సమాధానం చెప్పలేక మేం సతమతం అవుతున్నారమంటూ తిరుపతి తెలుగుదేశం నాయకులు ఫీలవుతున్నట్టు సమాచారం. టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో మూగజీవాలు మరణిస్తున్నాయని, శ్రీమహా విష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. అంతకుముందు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి టీటీడీ మాజీ ఛైర్మన్‌గా కరుణాకరరెడ్డి డిఫెన్స్‌లో పడిపోయినట్టు మొదట్లో చర్చ జరిగినా… మెల్లిగా రివర్స్‌ అటాక్‌తో ఇప్పుడాయన ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో… నెలకో, రెండు నెలలకో అమరావతి నుంచి టీడీపీ రాష్ట్ర నాయకులు ఎవరో ఒకరు వచ్చి ప్రెస్‌మీట్స్‌ పెట్టి భూమన టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. ఇంకేముంది, అంతా అయిపోయింది. రేపో మాపో ఆయన అరెస్ట్‌ అంటూ… భారీ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోవడం రొటీన్‌గా మారిపోయిందని అంటున్నారు. ఈ వైఖరే ఇప్పుడు స్థానికంగా కూటమి కార్యకర్తల్లో తీవ్ర నిరాశను పెంచుతోందట. ప్రతిసారి వాళ్ళు రావడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడ్డం తర్వాత చడీ చప్పుడు లేకపోవడం చూస్తుంటే…. తమ పరిస్థితి నాన్నా పులి కథలా మారిపోతోందని అంటున్నారు తిరుపతి కూటమి నాయకులు. అమరావతి నాయకులొచ్చి చేయలేని పనుల్ని ప్రెస్‌మీట్‌లో చెప్పడం… ఆ దెబ్బకు కరుణాకర్‌రెడ్డి అలర్ట్‌ అయిపోయి ఛాలెంజ్‌లు విసరడం… తీరా వాటిని కాచుకోలేక మేం సతమతం అవడం ఎందుకన్నది లోకల్‌ లీడర్స్‌ క్వశ్చన్‌. నిజంగానే ఏదన్నా చేయగలిగితే చేయాలి. లేదంటే గమ్మున నోరు మూసుకుని ఉండాలి. అంతే తప్ప…. నెలకోసారి వచ్చి ఏవేవో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ నిష్టూరంగా మాట్లాడుతున్నారు తిరుపతి టీడీపీ నేతలు. దీనివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నది వాళ్ల అభిప్రాయం. గతంలో తిరుపతి టీడీఆర్‌ బాండ్ల స్కాం తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంలో భూమన రివర్స్ అటాక్ చేయడం, దానికి సంబంధించి అప్పట్లో వైసీపీతో అత్యంత సన్నిహితంగా మెలిగారని చెప్పుకున్న ఐఎఎస్‌ శ్రీలక్షిపైనే ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందట. తర్వాత భూమన స్వర్ణముఖి నదిని ఆక్రమించుకున్నారంటూ టీడీపీ నేత పట్టాభి హడావిడి చేశారు.

తీరా చూస్తే… ఇప్పుడసలు అది ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి‌. ఇక తాజాగా తిరుమల పరకామణి గోల్‌మాల్‌లో సైతం టీటీడీ మాజీ ఛైర్మనే దొంగ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు టీడీపీ లీడర్స్‌. కానీ….కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణకు ఇలా వెళ్లి అలా బయటకు రావడంతో కూటమి నేతలు షాకయ్యారట. పైగా బయటికివచ్చి ఆయన చేసిన వెటకారంతో టీడీపీ నేతల నోట మాట రాలేదని చెప్పుకుంటున్నారు. పసిఫిక్‌ మహా సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? నైలు నదిలో ఉన్న మొసళ్ల సంఖ్య ఎంత? 1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది? నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని? అని అడిగితే ఏం సమాధానం చెప్పగలనో… అదే ఆన్సర్‌ లోపల సీఐడీ అధికారులకు చెప్పానంటూ సెటైరిక్‌గా మాట్లాడి, దర్యాప్తును కామెడీ చేసి వెళ్లిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట కూటమి నాయకులు. ఇలా… తిరుమల కేంద్రంగా కరుణాకర్ రెడ్డి తమను ఓ ఆట ఆడేసుకుంటున్నా..
మా పెద్దోళ్ళు ఏమీ చేయలేకపోతున్నారన్న అసహనం తిరుపతి టీడీపీ లీడర్స్‌లో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏమీ చేయలేనప్పుడు అసలు ఆయన్ని కెలకడం, రివర్స్‌ అటాక్‌ చేయించుకోవడం ఎందుకు? మొత్తానికే గమ్మున ఉంటే ఏ గొడలా ఉండదు కదా… పార్టీ రాష్ట్ర నాయకులొచ్చి మాట్లాడ్డం చూస్తుంటే…. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉందని కోపంగా అంటున్నారు లోకల్‌ లీడర్స్‌.

 

Exit mobile version