ఆ పొలిటికల్ ఫ్యామిలీ పోగొట్టుకున్నచోటే వెదుకులాట మొదలుపెట్టిందా? పాల కేంద్రంలో రచ్చ రాజకీయం కూడా అందులో భాగమేనా? అక్కా తమ్ముళ్ళు డైరీమే సవాల్ అంటున్నది కూడా అందుకేనా? ఏదా రాజకీయ కుటుంబం? ఏంటా పాల పాలిటిక్స్? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పొలిటికల్‌గా ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. అదే సమయంలో ఈ సెగ్మెంట్ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది భూమా కుటుంబం. ప్రస్తుతం ఇక్కడ భూమా అఖిలప్రియ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంత వరకు బాగానే ఉన్నా… ఇప్పుడు నంద్యాల కేంద్రంగా కూడా పొలిటికల్ హీట్ పెరగడంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. నంద్యాలలోని విజయ మిల్క్ డైరీ ఛైర్మన్ పదవి విషయంలో అఖిల ప్రియ, ఆమె సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం డైరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి వున్నారు. అఖిల, ఎస్వీ సమీప బంధువులేగానీ… టీడీపీ, వైసీపీల్లో ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. సోదరుడు విఖ్యాత్ రెడ్డికి విజయ డైరీ చైర్మన్ పదవి దక్కేలా చేసేందుకు ఎమ్మెల్యే అఖిలప్రియ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.
ఛైర్మన్ పదవి దక్కాలంటే ముందు ఏదో ఒక పాల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలి. అందుకోసం భూమా విఖ్యాత్ రెడ్డి రెండు సొసైటీల నుంచి ప్రయత్నించినా చెక్ పెట్టారట ఎస్వీ జగన్. ఇక విజయ మిల్క్ డైరీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు ఎమ్మెల్యే. దాని మీద విచారణకు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త చర్చలు మొదలయ్యాయి. భూమా కుటుంబం చూపు నంద్యాల వైపు కూడా మళ్ళుతోందా అన్నది వాటి సారాంశం. ప్రస్తుతం ఆళ్ళగడ్డ మీద ఫుల్ గ్రిప్ ఉందని భావిస్తున్న భూమా ఫ్యామిలీ… వచ్చే ఎన్నికల నాటికి నంద్యాలలో కూడా పాగా వేయాలని భావిస్తోందట. విజయ డైరీ ఛైర్మన్ పదవి కోసం అంతలా పట్టుబట్టడం వెనకున్న రీజన్ అదేనంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి జయంతి కార్యక్రమం సందర్బంగా… కావాలనో, కాకతాళీయంగానో నంద్యాల ప్రస్తావన తీసుకువచ్చారు భూమా విఖ్యాత్ రెడ్డి. ఆళ్లగడ్డ, నంద్యాల కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారాయన.
గతంలో నంద్యాల కేంద్రంగా రాజకీయాలు నడిపారు భూమా నాగిరెడ్డి. అప్పట్లో నంద్యాల ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారాయన. నియోజకవర్గంలో తనకంటూ బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పటికీ వీరాభిమానులు ఉన్నా…. భూమా నాగిరెడ్డి చనిపోయాక నంద్యాలలో ఆ ఫ్యామిలీ పట్టు సడలిందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ క్రమంలోనే… తిరిగి నంద్యాలలో పట్టు బిగించాలన్న ప్లాన్‌లో ఉన్నారట అక్కా తమ్ముడు. తన సోదరుడు విఖ్యాత్ రెడ్డిని నంద్యాల ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీలో అధ్యక్షా అనిపించాలని, తండ్రి వారసత్వాన్ని అక్కడే అలాగే కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారట అఖిలప్రియ. విఖ్యాత్‌రెడ్డి గత ఎన్నికల్లోనే పోటీ చేయాలని ప్రయత్నించినా అప్పుడు వయసు సరిపోలేదని చెప్పుకున్నారు.
ఇక ఈసారి మాత్రం వేరే వాళ్ళకు ఛాన్స్ లేకుండా అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ ఆళ్లగడ్డలో ఒకరు, నంద్యాలలో మరొకరు పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విజయ డైరీలో ఆధిపత్య పోరు కూడా అందులో భాగమేనంటున్నారు పరిశీలకులు. నంద్యాల నాదే….ఆళ్లగడ్డ నాదేనంటూ గతంలో అఖిలప్రియ కామెంట్ చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. అలాగే ఆళ్లగడ్డలో వివాదాలకు దూరంగా ఉండాలని, గొడవలు పెట్టుకోవద్దని అనుచరులకు చెబుతున్నారట ఎమ్మెల్యే అఖిలప్రియ. గతంలో గొడవలకు కారణమైన కొందరు అనుచరులను కూడా దూరం పెడుతున్నట్టు తెలిసింది. పబ్లిక్‌లో విస్తృతంగా చర్చ జరిగే వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని గట్టిగా చెబుతున్నారట. మొత్తమ్మీద భూమా కుటుంబం మళ్ళీ నంద్యాల పై పొలిటికల్ బాణం ఎక్కుపెట్టిందన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ.
