ఓరుగల్లు తూర్పు వార్ ముదిరిందా? పొలిటికల్ పోరులో పోలీస్ అఫీసర్స్ బలవబోతున్నారా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఎత్తుకు పై ఎత్తుల రాజకీయంలో ఎవరు ఇరుక్కోబోతున్నారు? వేరు కుంపట్లు లోకల్ కాంగ్రెస్‌ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి? మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న వేరు కుంపట్లు ఇప్పుడు గట్టిగా రాజుకుంటున్నాయి. కొండా అనుచరుడు నల్లగొండ రమేశ్ తాజాగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గూటికి చేరడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మంత్రి సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సారయ్య మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది.
కొద్దినెలల కిత్రం పోచమ్మమైదాన్ సెంటర్లో డబ్బాల తొలగింపు వివాదంలో కొండా మురళి బాహాటంగానే సారయ్యను సవాల్ చేశారు. అప్పటి నుంచి మొదలైన మధ్య విభేదాలు..అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి కొండా దంపతులు, బస్వరాజ్ సారయ్య మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. ఒకే పార్టీలో ఉన్నా ఎప్పుడూ కీచులాటలే. మరో వైపు నియోజకవర్గంలో కొండా దంపతులకు పోలీసులు విచ్చలవిడిగా సహకరిస్తున్నారంటూ సారయ్య తప్పు పడుతున్నారు. లోకల్ పోలీసులు వాళ్ళ డ్యూటీ చేయకుండా కొండా మురళి చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్సీ. మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, మట్టెవాడ పోలీస్ స్టేషన్లలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆ మధ్య ఎమ్మెల్సీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
అలాగే… రాజకీయ వత్తిళ్ళతో అమాయక ప్రజలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సారయ్య. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు అక్రమ కేసులు నిజమేనని తేలడంతో ఒక ఏసీపీ, ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. ఇక ఓ పాత కేసులో పోలీసులు సరిగా దర్యాప్తు జరపడంలేదంటూ.. సారయ్య తాజాగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఖిల్లా వరంగల్‌లో తొమ్మిది నెలల క్రితం జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసులు స్పందిస్తున్న తీరును తప్పుపడుతున్నారు ఎమ్మెల్సీ. దుగ్గిరాల లక్ష్మణ్ కుటుంబానికి చెందిన సుమారు 300 గొర్రెలు సజీవ దహనమై తొమ్మిది నెలలు గడిచినా పోలీసులు నిందితులను పట్టుకోలేదన్నది సారయ్య ఫిర్యాదు. దానికి సంబంధించి కేసైతే పెట్టారుగానీ.. ఎలాంటి పురోగతి లేదని, వరంగల్ పోలీసులు మురళికి అనుకూలంగా వ్యవహరించడమే అందుకు కారణం అన్నది ఎమ్మెల్సీ డౌట్. అలాగే… గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు గుండేటి సురేంద్ర కుమార్, మరుపల్ల రవి, సురేష్ కుమార్ జోషి మీద కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ డీజీపీ దృష్టికి తీసుకెళ్ళారట సారయ్య.
ఈ క్రమంలో కొందరు లోకల్ పోలీసు అధికారుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైందట. మరోవైపు ఇన్నాళ్లు కొండా దంపతులకు ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉన్న నల్లగొండ రమేష్ ఇప్పుడు ఎమ్మెల్సీ వర్గంలో చేరడంతో… సమీకరణలు మారవచ్చంటున్నారు. అలాగే… వరంగల్ డీసీసీ కొత్త అధ్యక్షుడు అయూబ్ కూడా బస్వరాజు వర్గంలో చేరడంతో… ఓరుగల్లు తూర్పు యుద్ధం ముదిరిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, తప్పుడు పనులు చేసే అధికారులకు శిక్ష తప్పదని ఎమ్మెల్సీ సారయ్య హెచ్చరిస్తుండటం హీట్ పెంచుతోంది. తన పాత వినతులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కూడా వెంటనే వెల్లడించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు ఎమ్మెల్సీ. ఈ రాజకీయ ఆధిపత్య పోరు మళ్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరికి చుట్టుకుంటుంది? ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.
