OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?

Balu Naik

Balu Naik

తెలంగాణ ఉప సభాపతి పదవి ఎట్టకేలకు భర్తీ అవబోతోందా? రేండున్నరేళ్ళ నుంచి ఖాళీగా ఉన్న పోస్ట్‌కు ఎట్టకేలకు ఎన్నిక నిర్వహించబోతున్నారా? ఇన్నాళ్లు ఆ పదవి కోసం అనుకుంటున్న నేత పూర్తిగా పక్కకు వెళ్ళినట్టేనా? మాట విననందుకు ఏఐసీసీ ఆయన్ని తప్పించి మరో సీనియర్‌కు ఛాన్స్‌ ఇవ్వబోతోందా? ఎవరా కొత్త సీనియర్‌? ఇక పాత నాయకుడి పని అంతేనా? తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. అందుకోసం చాలా రోజుల క్రితమే అభ్యర్ధిని ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. కానీ… ఎంపికైన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మాత్రం నాకు మంత్రి పదవే కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు. కాంగ్రెస్‌ పాలిటిక్స్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. పార్టీ అధికారికంగా ప్రకటన చేశాక పదవి తీసుకోకుండా ఆగింది లేదు. ఒకవేళ ఆపితే గీపితే… అధిష్టానం ఆపాల్సిందేగానీ….. నాయకులు మాత్రం నాకు ఇది వద్దని పేచీ పెట్టింది లేదు. ఈ క్రమంలో… రామచంద్రు నాయక్‌ వైఖరి ఏఐసీసీకి చిరాకు తెప్పించిందట. దీంతో ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టండి..ఏ పదవి ఇవ్వకండని కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆగ్రహంతో ఉన్న అధిష్టానం అదే ఊపులో కొత్త అభ్యర్ధి వేట మొదలు పెట్టింది. ఆ బాధ్యతను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అప్పగించారు ఢిల్లీ పెద్దలు.

అలాగే.. కొత్త అభ్యర్థిని కూడా లంబాడా సామాజికవర్గం నుంచే ఎంపిక చేయమని సూచించారట. దీంతో… ఫైనల్‌గా దేవరకొండ MLA బాలు నాయక్ అభ్యర్థిత్వం ఖరారైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, PCC చీఫ్ మహేష్ గౌడ్ బాలు నాయక్‌తో మాట్లాడారు. ఈయన కూడా మంత్రి పదవి మీదే బాగా ఆశలు పెట్టుకుని ఉండటంతో… అగ్ర నేతలిద్దరూ పరిస్థితిని వివరించి ఒప్పించారట. డిప్యూటీ స్పీకర్ ఎంపికపై హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది కాబట్టి… కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనన్నది పార్టీలో నడుస్తున్న లేటెస్ట్‌ టాక్‌. దీన్ని సవివరంగా దేవరకొండ ఎమ్మెల్యేకు చెప్పి… ఒప్పించినట్టు తెలుస్తోంది. అయినా… ఆయన పూర్తిగా కన్విన్స్‌ అవకపోవడంతో… మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ జరిగినా… మీ పేరు పరిశీలనలో ఉంటుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ రకంగా మొత్తం మీద డిప్యూటీ స్పీకర్‌ పదవి భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఎన్నిక జరగనుంది. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఉప సభాపతి ఎన్నిక నిర్వహించే ఆవకాశం ఉంది.