Site icon NTV Telugu

Off The Record : నామినేటెడ్ పోస్ట్ కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడ్డారా?

Balakrishna Pawan

Balakrishna Pawan

కూటమి ప్రభుత్వంలో ఓ నామినేటెడ్‌ పోస్ట్‌ కోసం పవన్‌కళ్యాణ్‌, బాలకృష్ణ పోటీ పడ్డారా? నా మనిషికి కావాలంటే… నా మనిషికి అంటూ… వత్తిడి పెంచారా? మాంఛి సినిమా కథను తలపించిన ఆ ఎపిసోడ్‌లో చివరికి బాలయ్యదే పైచేయి అయిందా? రెండు పెద్ద తలకాయలు అంతలా తలపడ్డ ఆ పోస్ట్‌ ఏది? డిప్యూటీ సీఎంను కాదని ఎమ్మెల్యే మనిషికి ఎలా ఫైనల్‌ అయింది? ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ముఖ్యమైన దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్స్‌ను నియమించింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, వాడపల్లితో పాటు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఛైర్మన్స్‌ నియామక ప్రకటన వెలువడింది. ఈ నియామకాల్లో కూటమిలోని మూడు పార్టీలకు ప్రాతినిధ్యం దక్కించి. మిగతా ఆలయాల సంగతి ఎలా ఉన్నా… కనకదుర్గమ్మ టెంపుల్‌ విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలోకి వచ్చింది. అమ్మవారి ఆలయ ఛైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈయన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడట. బాలయ్య సన్నిహితుడికి దుర్గగుడి ఛైర్మన్‌ పదవి ఇవ్వడం వరకైతే అదేమంత పెద్ద విషయం కాదు.

 

కానీ… ఈ విషయంలో తెర వెనక రసవత్తరమైన సన్నివేశాలే జరిగాయట. మాంఛి సస్పెన్స్‌ సినిమాలో లాంటి ట్విస్ట్‌ ఉన్నాయట ఈ ఎపిసోడ్‌లో. ఈ ఛైర్మన్‌ పోస్ట్‌ కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఢీ అంటే ఢీ అన్నట్టు చెప్పుకుంటున్నారు. అమ్మవారి ఆలయ ఛైర్మన్‌ పదవికి ఉండే డిమాండ్‌ దృష్ట్యా కూటమిలోని మూడు పార్టీలు పోటీ పడ్డాయి. అందుకే మిగతా ఆలయాలకు భిన్నంగా ఇది ప్రత్యేకంగా నిలిచింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ… తమ సన్నిహితుల పేర్లను సిఫారసు చేయడం, గట్టిగా పట్టుబట్టడం ఒక ఎత్తయితే… మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు బీజేపీ కూడా తమ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీరాం పేరును ప్రతిపాదించింది. ఫైనల్‌గా బాలకృష్ణ ప్రతిపాదించిన బొర్రా రాధాకృష్ణకే ఫైనల్‌ అయింది ఛైర్మన్‌ పోస్ట్‌. ఆ నిర్ణయం తీసుకోవడం వెనకున్న మలుపుల గురించే ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. బాలకృష్ణ తన మనిషి రాధాకృష్ణ పేరును ప్రతిపాదించారట.

అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ కూడా తన మనిషి, ఆడిటర్‌ సుబ్బారాయుడి పేరును తెర మీదికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఎవరంటే… ప్రస్తుతం పంచాయితీరాజ్‌ కమిషనర్‌గా పని చేస్తున్న కేరళ కేడర్‌ ఐఎఎస్‌ అధికారి కృష్ణతేజకు స్వయానా పిల్లనిచ్చిన మామ. కృష్ణతేజను ప్రత్యేక శ్రద్ధతో కేరళ నుంచి డిప్యుటేషన్ మీద ఏపీకి రప్పించుకున్నారు పవన్‌. అలా… ఆడిటర్‌ సుబ్బారాయుడి పేరు తెరమీదికి వచ్చింది. సరిగ్గా బాలయ్య, పవన్‌ ఎవరి పేరు విషయంలో వాళ్ళు పట్టుదలగా ఉన్న టైంలోనే… కథ కొత్త మలుపు తిరిగినట్టు ప్రచారం జరుగుతోంది. సుబ్బారాయుడి పేరు సిఫారసు చేయడాన్ని జనసేన నేతలు, ప్రత్యేకించి కాపు నాయకులు జీర్ణించుకోలేకపోయారట. ఆయన పార్టీలోచేరి మూడు నెలలే అవుతోంది. ఇంతలోనే అంత ప్రాముఖ్యం ఉన్న దుర్గగుడి ఛైర్మన్‌ పోస్ట్‌ ఇస్తే ఎలాగంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆడిటర్‌ది వైశ్య సామాజికవర్గం కావడం, ఇక్కడ కాపుల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో… డైలమాలో పడ్డారట పవన్‌. అదే సమయంలో బాలకృష్ణ కూడా పట్టుదలగా ఉన్నందున కూటమి పెద్దలు అటువైపే మొగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ఫైనల్‌గా బాలకృష్ణ సిఫార్సు చేసిన రాధాకృష్ణకే పోస్ట్‌ కన్ఫామ్‌ అవడంతో… మధ్యే మార్గంగా… పవన్‌కళ్యాణ్‌ కోసం ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్‌ నేమూరి శంకర్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా నియమించారట. అలా… ఇద్దర్నీ సంతృప్తి పరిచినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద వివాదం సామరస్యంగా పరిష్కారం అయినా… బాలకృష్ణ, పవన్‌ మధ్య హోరాహోరీగా సాగిన వ్యవహారం మాత్రం మాంఛి ఇంట్రస్టింగ్‌గా ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మరోవైపు శ్రీశైలం ఛైర్మన్‌ పదవిని బీజేపీకి కేటాయించడం ద్వారా పొత్తు ధర్మాన్ని పాటించినట్టయిందంటున్నారు.

Exit mobile version