Site icon NTV Telugu

Off The Record : అరవ శ్రీధర్ కు జనసేన క్లీన్ చిట్ ఇచ్చేసిందా..?

Arava Sridhar

Arava Sridhar

రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు జనసేన క్లీన్‌చిట్‌ ఇచ్చిందా? ఆ వ్యవహారాన్ని కేవలం ఆయన వ్యక్తిగత అంశంగా పరిగణిస్తోందా? పైకి ప్రకటించకున్నా….కామ్‌గా నీ పని నువ్వు చేసుకోమని హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందా? ఆ విషయంలో నియమించిన పార్టీ కమిటీ ఏమైంది? ఏమని నివేదిక ఇచ్చింది? అసలీ క్లీన్‌చిట్‌ కహానీ ఏంటి? జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణల ఎపిసోడ్‌ ముందు ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు అంతే సైలెంట్ అయిపోయింది. బాధితురాలు హర్ష వీణ ఎమ్మెల్యే మీద రోజుకో వీడియో విడుదల చేస్తూ ఇవిగో నా దగ్గరున్న సాక్ష్యాలంటూ చూపించారు. విషయం బయటకు రాగానే పార్టీ అధిష్టానం రియాక్ట్ అయింది. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జనవరి 28న త్రిసభ్య కమిటీని నియమించింది. శ్రీధర్ ఏడురోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది. కమిటీ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఈ క్రమంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు అవర శ్రీధర్‌.

స్థానిక నేతలను కూడా విచారించింది పార్టీ కమిటీ. అయితే బాధితురాలు హర్ష వీణ నేరుగా హాజరుకాలేదని, లేఖ, పెన్‌డ్రైవ్ రూపంలో వివరాలు పంపినట్టు కమిటీ పేర్కొంది. దీనిపై హర్ష వీణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ… తనను ఎవరూ విచారణకు పిలవలేదని, తానే కమిటీ సభ్యుల్ని కలిసి వివరాలు సమర్పించానని ప్రకటించారు. అలాగే…. ఒకసారి కమిటీని కలిసే అవకాశం ఇవ్వమని కూడా కోరారామె. ఆ విషయాన్ని పట్టించుకోకుండా … లోతుగా విచారణ జరుపుతున్నామని. మరికొంత సమయం కావాలని చెబుతూ వచ్చింది కమిటీ. ఇదిలా ఉండగా… ఈ వ్యవహారాలతో సంబంధం లేకుండా…నాపని నాదేనన్నట్టుగా రైల్వే కోడూరులో వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అరవ శ్రీధర్‌. ఆ విషయంలో ఆయన పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తున్నారన్న చర్చ సైతం జరిగింది. అయితే తాజాగా పవన్‌కళ్యాణ్‌ అధ్యక్షతన జరిగిన జనసేన ఎల్పీ సమావేశంలో అరవ శ్రీధర్ ప్రత్యక్షమవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

కమిటీ నివేదిక వచ్చేదాకా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఏకంగా పవన్‌ సమక్షంలోనే… శ్రీధర్‌ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడాన్ని ఎలా చూడాలి? అంటే… పార్టీ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చేసిందా అంటూ రకరకాల కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. అటు వారం రోజుల కిందట రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై బాధితురాలు హర్షవీణ గట్టిగా స్పందించారు. పార్టీ వ్యవహారాల్లో ఆయన యాక్టివ్‌గా తిరుగుతున్నారంటే అయనకు జనసేన క్లీన్ చిట్ ఇచ్చిందా? ఒకవేళ ఇచ్చి ఉంటే అధికారికంగా నాకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ క్లీన్ చిట్ ఇవ్వకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండని నిలదీశారామె. తనకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. అటు కమిటీ ఏర్పాటై రెండు నెలలవుతున్నా… విచారణ కొనసాగుతోందన్న మాట తప్ప ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కమిటీ నివేదిక సమర్పించిందా..? అది హైకమాండ్‌కు అందిందా అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆరోపణలను వ్యక్తిగత కోణంలోనే చూస్తూ…. పార్టీ పరంగా అరవ శ్రీధర్‌ను సేవ్ చేసినట్టేనా అన్న డౌట్స్‌ వస్తున్నాయి చాలామందికి. రైల్వే కోడూరులో వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడ సభ్యత్వ నమోదు ప్రోగ్రామ్‌లో చురుగ్గా వ్యవహరించడం, దానికి మించి సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జె ఎల్పీ సమావేశానికి అటెండ్‌ అవడం లాంటివి చర్చనీయాంశం అయ్యాయి. మైసూరువారి పల్లె జనసేన కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తుంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు పార్టీ అనధికారికంగా క్లీన్ చిట్ ఇచ్చేసినట్టేనా అంటూ జనసేన వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

Exit mobile version