ఏపీ సర్కార్‌ని సోషల్ మీడియా భయపెడుతోందా…? కట్టడి కోసం సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఒకప్పుడు అవే సామాజిక మాధ్యమాలను గట్టిగా ఉపయోగించుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడెందుకు మారింది? మార్పు అటు వైపా? లేక ఇటు వైపా? సోషల్ మీడియా కట్టడికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సినంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయా? లెట్స్ వాచ్. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్. ఇది రెండు వైపులా పదునున్న కత్తికాగా… ఎప్పుడూ రెండో వైపు గురించే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల దీనికి సంబధించిన రాజకీయ చర్చలు పెరిగిపోతున్నాయి. అందులోనూ…. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. యూ ట్యూబ్‌లో వచ్చిన కధనాలు, చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల ఆధారంగా ఉపా చట్టం కింద కేసులు పెట్టేదాకా వెళ్ళింది వ్యవహారం. ఏపీ అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్‌లో సోషల్ వార్ నడుస్తోంది. అది ఎంతలా అంటే…. మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఏకంగా ముఖ్యమంత్రే గైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక వ్యవస్థ ఉండాలంటూ…. క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించారంటేనే… పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా…సోషల్ మీడియాతో పాటు ఇన్‌ఫ్ల్యుయెన్సర్స్ విషయంలో చాలా అలర్ట్‌గా ఉంటారు సీఎం చంద్రబాబు. అక్కడి యాక్టివిటీస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది.
మీడియా ఫ్రెండ్లీ లీడర్స్ టాప్‌లిస్ట్‌లో చంద్రబాబు ఉంటారని కూడా చెప్పుకుంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నారు? మాటలు టాస్క్‌ఫోర్స్‌దాకా ఎందుకు వెళ్ళాయి? సామాజిక మాధ్యమాలు కూటమి ప్రభుత్వాన్ని అంతలా కంగారు పెడుతున్నాయా అంటూ చర్చలు మొదలయ్యాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న కథనాలు, ఎవరికి వారు చేస్తున్న విశ్లేషణలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, అలాంటి వాటిపై దృష్టి పెట్టకపోతే… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. అలాంటి వాటికి మొదట్లోనే చెక్ పెట్టకపోతే.. ఇదే తరహా దుష్ప్రచారం పెరిగిపోతుందని, వాస్తవాల కన్నా వేగంగా అసత్యాలు, అబద్ధాలు జనంలోకి వెళ్ళి వాటిని వాళ్ళు నమ్మే ప్రమాదం సైతం లేకపోలేదన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని.. విచ్చలవిడి వ్యాఖ్యానాలు చేస్తూ…. దుష్ప్రచారం చేస్తున్నారన్నది సీఎం అభిప్రాయం అట. దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే…. అసలు ఏది నిజం..ఏది అబద్ధమో తెలియని పరిస్థితి వస్తుందని ఆయన అభిప్రాయ పడుతున్నారన్నది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఆ ఆలోచనతోనే…టాస్క్ ఫోర్స్ ప్రస్తావన వచ్చి ఉండవచ్చంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు సంఘటనలు తీవ్ర ప్రభావం చూపించాయన్నది విస్తృతాభిప్రాయం. సాయికృష్ణ, రావణ్ వ్యవహారాలకు సంబంధించి సోషల్ మీడియానే తీవ్ర ప్రభావం చూపిందన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన అట. గుడ్ మూడ్‌లో ఉండాల్సిన సామాజిక మాధ్యమాలు…. ఈ రకంగా కట్టు తప్పి విచ్చలవిడిగా మారిపోతే… రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయంతోనే… కూటమి పెద్దలు ముందుగా అలర్ట్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముందు ముందు ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయో, పర్యవసానాలు ఎలా మారతాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.

