ఆంధ్రప్రదేశ్ మంత్రులు భయపడుతున్నారా? జగన్ పేరెత్తాలంటే జంకుతున్నారా? అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఆయన ఏ రేంజ్‌లో టార్గెట్ చేసినా… దీటైన కౌంటర్ వేయడానికి మంత్రులు వెనకాడుతున్నారా? ప్రతిపక్షాన్ని గట్టిగా టార్గెట్ చేయమని ముఖ్యమంత్రి ఓ వైపు ముల్లుగర్రతో పొడుస్తున్నా… ఎక్కువ మంది మినిస్టర్స్‌లో చలనం ఉండటం లేదా? ఎందుకలా జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలలైంది. తొలి ఏడాది ఎలా గడిచిపోయినా…. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ జనంలో తిరగడం మొదలుపెట్టాక… పరిణామాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. ఒకరకంగా అది సర్కార్‌కు వార్నింగ్ సైరన్‌లా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జగన్ టూర్స్‌కు జనం పెద్ద సంఖ్యలో వస్తుండటం, విమర్శలు, ఆరోపణల విషయంలో ఆయన ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఉండటం ఒక ఎత్తయితే…. అధికార పార్టీ వైపు నుంచి ఆ స్థాయి కౌంటర్స్ పడటం లేదన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. మొదట్లో కాస్త తగ్గినట్టు అనిపించినా… ఇప్పుడు మెల్లిగా వైసీపీ వాయిస్ పెరుగుతోంది. పార్టీ పాత గొంతుకలన్నీ తిరిగి వినిపిస్తున్నాయి. అదే సమయంలో చేతిలో పవర్ ఉండి కూడా మనోళ్లు సరిగా మాట్లాడటం లేదన్న అసహనం టీడీపీ ద్వితీయ శ్రేణి, కేడర్‌లో కనిపిస్తోందట. ప్రత్యేకించి జగన్ మాటలు చూస్తుంటే… ఆయన డైరెక్ట్‌గా ప్రభుత్వాన్నికి వార్నింగ్ ఇస్తున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. తాజాగా దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సైతం చంద్రబాబు ఇంకో మూడేళ్ళే అధికారంలో ఉంటారు, మళ్ళీ పవర్‌లోకి వచ్చేది మేమే. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ గట్టిగా మాట్లాడారు జగన్. ఇక్కడే ఇటు మంత్రులు, అటు టీడీపీ సీవియర్స్ రియాక్షన్‌పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. నేరుగా సీఎం చంద్రబాబు పేరుపెట్టి తిట్టినా, మరో రకమైన వార్నింగ్ ఇచ్చినా మంత్రులు ఎవ్వరూ ఎందుకు మాట్లాడ్డంలేదు, భయపడుతున్నారా అంటూ టీడీపీ కేడర్ తమలో తాము చర్చించుకుంటోందట. అంటే… వైసీపీ వాళ్ళు చెబుతున్నట్టు నిజంగానే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు పవర్‌లోకి వస్తారా? ఒకవేళ వస్తే… మనల్ని టార్గెట్ చేస్తారా? ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ… ఎవరికి కిక్కురుమనకుండా ఉంటున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయట పార్టీ వర్గాల్లో. ఒకరిద్దరు స్పందించినా… మాటల్లో వాడి ఉండటం లేదని, ఏదో బలవంతంగా మాట్లాడించినట్టు ఫీలవుతూ… తూతూ మంత్రపు స్పందనలతో సరిపుచ్చుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా…జగన్ పై విమర్శలు చేయడానికి మంత్రులు ఎందుకు జంకుతున్నారన్న చర్చ గట్టిగానే జరుగుతోందట వివిధ వర్గాల్లో. అందుకు ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతూ… విశ్లేషణల మీద విశ్లేషణలు చేసేస్తున్నారు.
ప్రస్తుతం మంత్రులు కొంతమంది వాళ్ళ సొంత పనుల్లో బిజీగా ఉంటూ… పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను లైట్ తీసుకుంటున్నారన్నది ఒక వెర్షన్. ఇంకొందరు అయితే…. అనవసరంగా జగన్ మీద విమర్శలు చేయడం ఎందుకు… రేపు ఏదన్నా తేడా జరిగితే… మనకే తలనొప్పులు… ఇప్పుడు గమ్ముగా చూసీచూడనట్టు పోతేపోలా.. అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…. ఇప్పుడు మంత్రులుగా ఉన్న నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ లాంటివాళ్ళు… ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ మీద విరుచుకుపడేవాళ్ళు. కానీ… ప్రస్తుతం వీళ్ళు ఎవరూ ఆ స్థాయిలో రియాక్ట్ అవడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అస్సలు మాట్లాడకపోతే… మరీ బాగోదన్నట్టుగా… అప్పుడప్పుడూ చిన్న చిన్న సౌండ్స్ చేయడం తప్ప… మంత్రులు ఎవ్వరూ ప్రతిపక్షం మీద అటాకింగ్ మోడ్‌లోకి రావడం లేదన్న చర్చ టీడీపీ పెద్దల్లో సైతం జరుగుతోందట. పేర్లు చెప్పకున్నా… కొన్ని సందర్భాల్లో సీఎం చంద్రబాబు ఈ విషయంలో బయటపడుతూనే ఉన్నారు. రాజకీయ విమర్శలు చేయడంతో బాగా వెనకబడుతున్నారని అంటూనే ఉన్నారాయన. వైసీపీ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నా….ఒక్క మంత్రి కూడా ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అవడంలేదన్న అంతర్మథనం టీడీపీ అధిష్టానంలో మొదలైనట్టు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశాలు, ఇతర మీటింగ్స్‌లో సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇదే విషయమై కాస్త లోతుల్లోకి వెళితే….మంత్రులు చాలా మంది ప్రస్తుతం సేఫ్ జోన్ చూసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఏదన్నా ఉంటే… పార్టీ పెద్దలు వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మనం ఓ… తెగ పూసేసుకోవడం ఎందుకని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే… ఏదో…. ఉన్నామా, పని చేస్తున్నామా, మరీ అవసరమైనప్పుడు ఏదో… అలా అలా కుయ్ కుయ్‌మని సౌండ్ చేస్తున్నామా అన్నట్టుగానే ఉంటున్నారట. మామూలుగా అయితే…. మంత్రులకు ఒక స్ట్రేచర్ ఉంటుంది కాబట్టి… జగన్ వ్యాఖ్యల మీద వాళ్ళు రియాక్ట్ అయితే… రీచ్ ఎక్కువగా ఉంటుంది. అందునా సీనియర్స్, కాస్త వాగ్ధాటి ఉన్నవాళ్ళు అయితే… పార్టీ కేడర్‌లో కూడా ఊపు వస్తుందన్నది టీడీపీ పెద్దల అభిప్రాయం. కానీ… అలాంటి వాళ్ళు ఎవరూ పెద్దగా నోరు తెరవకుండా సేఫ్ జోన్ చూసుకుంటుండటంతో… ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో జగన్ అంటే భయం ఏర్పడిందా? అందుకే మాట పెగలట్లేదా అన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
