అందరికీ ఫ్లవర్ బొకేలతో న్యూ ఇయర్ ఎదురొస్తే…. ఆ నేతకు మాత్రం పక్కలో బల్లేలు వెల్కమ్ చెప్పాయా? కొత్త ఏడాదిలో మన ఖర్మ ఇలా తగలడిందేంట్రా బాబూ… ఎంట్రీలోనే అంత షాకిచ్చింది అంటూ… సదరు సీనియర్ సన్నిహితుల దగ్గర వాపోతున్నారా? మరో నేత మౌనం బద్దలు కొడుతూ చేసిన సౌండ్ ఆయన చెవుల్లో రీ సౌండ్ ఇస్తోందా? ఎవరా నాయకుడు? ఏంటా న్యూఇయర్ సౌండింగ్ స్టోరీ? 2026 ఎంట్రీలోనే… మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలిందట. అనంతపురం అర్బన్ వైసీపీలో అసలే ఉన్నవాళ్ళతో వేగలేక ఛస్తుంటే… ఇప్పుడు ఇంకో నేత ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. అది కూడా అందరూ పూలబొకేలు ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెబుతున్న టైంలోనే వినిపించిన సౌండ్‌కు ఉలిక్కి పడ్డారట అనంత. అర్బన్ నియోజకవర్గ వైసీపీలో ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయి. జిల్లా పార్టీలో సీనియర్ నాయకుడైన అనంత వెంకట్రామిరెడ్డి గతంలో ఉన్న ఎంపీ స్థానాన్ని వదిలి ఎప్పుడైతే అర్బన్ నియోజకవర్గానికి రావాలనుకున్నారో.. అప్పటి నుంచే ఆయనకు శత్రువులు తయారయ్యారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన వెంకట్రామిరెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు.
ఇక 2019లోఅసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో అర్బన్ సీటు కోసం చాలామందే ప్రయత్నించినా వెంకట్రామిరెడ్డికే ఛాన్స్ దక్కింది. తిరిగి 2024లో కూడా సేమ్ సీన్. కానీ… ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో మిగిలిన నేతలంతా ఆయనకు దూరం జరిగి పార్టీలో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి ఇటీవల అనంతపై నేరుగా అటాక్ ప్రారంభించారు. ఇలా ఇంటి పోరుతో అనంత వెంకట్రామిరెడ్డి సతమతమవుతుంటే.. ఇప్పుడు తాజాగా ఇంకో బల్లెం గుచ్చుకుంది. అది కూడా న్యూ ఇయర్ రోజే వచ్చి తగిలింది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఇంటి దగ్గరికి భారీగా జనం వచ్చారు. అదే ఊపులో గురునాథ్‌రెడ్డి చేసిన ప్రకటన అనంతపురం రాజకీయాల్లో అలజడి రేపింది. ప్రత్యేకించి అనంత వెంకట్రామిరెడ్డికి నిద్ర లేకుండా చేస్తోందట. వచ్చే ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం నుంచి తాను కచ్చితంగా పోటీ చేస్తానన్నారు గురునాథ్‌రెడ్డి. కొత్త సంవత్సరంలో సరికొత్త రాజకీయ నిర్ణయం తీసుకున్నానని కూడా చెప్పారాయన.
పదేళ్లు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా మౌనంగా ఉన్నామని, ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో మా కుటుంబ పాత్ర ఉంటుందని చెప్పారు. ఇదే ఇప్పుడు సంచలనం అవుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బీఎన్ఆర్ ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. బి.నారాయణ రెడ్డి ఇక్కడ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన సోదరుడు గురునాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా చేశారు. బీఎన్ఆర్ ఫ్యామిలీకి, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున గురునాథ్ రెడ్డి గెలిచారు. వైయస్ మరణం తర్వాత జగన్ వెంట వచ్చిన వారిలో గురునాథ్ రెడ్డి కీలకంగా ఉన్నారు. వైసీపీలో జాయిన్ అయిన గురునాథ్ రెడ్డి… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో పోటీచేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత రాజకీయంగా స్తబ్ధుగా మారారు. మిస్సమ్మ బంగ్లా స్థల వివాదం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారాయన. కానీ కొన్ని రోజులకే తిరిగి వైసీపీ గూటికి వెళ్ళారు. పార్టీ మారడంతో పాటు ఆ కుటుంబం యాక్టివ్ గా లేకపోవడంతో జగన్ 2019లో టికెట్ ఇవ్వలేదు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా తాము మళ్లీ వస్తున్నామని చెప్పడంతో అనంత అర్బన్ వైసీపీలో అలజడి మొదలైంది. ఇలా వరుసగా అనంత వెంకట్రామిరెడ్డికి ఇబ్బందులు వస్తున్నాయని,వాటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
