చిత్రాలు…. చిత్ర విచిత్రాలు. అస్సలు ఊహించలేని కాంబినేషన్స్. బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీ కలిసి ఒక ఛైర్మన్ పీఠాన్ని పంచుకుంటాయి. మరోచోట కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పోతాయి. ఇంకోచోట అంతా కలిసి ఒక్క పార్టీని పక్కకు నెడతారు. ఎక్కడ జరిగాయి ఈ అనూహ్య పరిణామాలు? పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్న ఆ నేతలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ….. తెల్లారి లేస్తే… బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతుంది. ఇక బీఆర్ఎస్ అయితే.. కాంగ్రెస్,బీజేపీని తిట్టిపోస్తుంది. అటు కాషాయ దళం కూడా అంతే… మిగతా ఇద్దర్నీ టార్గెట్ చేస్తుంది. కానీ… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అలాంటి వాతావరణం కనిపించడంలేదు. రాజకీయ అవసరాలు ఎవరికి ఎవరు? చివరికి ఎవరెవరు అన్న అనుమానాల్ని రేపుతున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఉమ్మడి జిల్లాలో బారాకూన్ మాఫ్ అంటున్నారట అంతా. ఎంతటి రాజకీయ వైరం ఉన్నా ఫర్వాలేదుగానీ…. పదవి కోసం మాత్రం ఎంతదాకైనా పోవడానికి పార్టీలు సిద్ధమైనట్టు కనిపిస్తున్నాయంటున్నారు.
పైగా అధిష్టానం చెప్పలేని, సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలతో మున్సిపాలిటీల్లో జట్టుకట్టడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇటీవల ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ కోసం ఎన్నిక జరిగింది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చైర్మన్ పీఠం దక్కించుకున్నాయి. బీజేపీకి చెందిన కౌన్సిలర్ కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేతులెత్తారు. ఇక వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. ఈయన కోసం బీజేపీ బీ ఫాం మీద గెలిచిన సభ్యులు చేతులెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఒకరు చైర్మన్, మరొకరు వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. మూలాలు మర్చిపోయిన ఆరెండు పార్టీల నేతల కలిసిపోయి వాళ్ళ నిజస్వరూపాన్ని భయటపెట్టుకున్నారంటూ కాంగ్రెస్ చర్చకు పెట్టింది. ఇక సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మున్సిపాలిటీకి వస్తే…ఇక్కడ మరీ విచిత్రమైన పరిస్థితి.
కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు తెలపింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాహిన్ సుల్తానాకు బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు మద్దతిచ్చి ఛైర్‌పర్సన్‌ని చేశారు. పోనీ… వైస్ చైర్మన్ అయినా బీజేపీ గెలిచిందా అంటే అదీ లేదు. బీజేపీ బలపర్చిన అభ్యర్థికి ఆ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ మద్దలివ్వలేదు. చివరికి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఎక్స్అఫిషియో సభ్యుడిగా తన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే వేయడం సంచలనం అయింది. దీనిపై పార్టీ అధిష్టానం సైతం ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ,వైఎస్ చైర్మన్ ఎన్నికలో సైతం విచిత్రం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు ఇవ్వడంతో మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరింది. ఇది హస్తం పార్టీలో గ్రూప్ గొడవలకు దారితీసింది.
ఇక క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పదవులు పంచుకున్నాయి. బైంసాలో మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిని బీజేపీ సభ్యులు సపోర్ట్ చేయగా… మైనార్టీ సామాజికవర్గానికి చెందిన మహిళ పీఠం ఎక్కింది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటిలో సైతం కాంగ్రెస్ ,బీఆర్ఎస్ ,ఎంఐఎం కలిసి ఓ కౌన్సిలర్‌ని చైర్మన్ పీఠం ఎక్కించారు..ఇక్కడ బీజేపీని దెబ్బకొట్టడం కోసం అంతా ఏకమయ్యారు. ఇలా రాజకీయ పార్టీలు ఎవ్వరి అవరాలకు అనుగుణంగా వారు పక్కపార్టీలో కలిసిపోయి పీఠాలు దక్కించుకున్నాయి. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం వీళ్ళకు సిద్ధాంతాలు, నిబద్ధతతో పని లేదా? పదవి కోసం ఎంతకైనా దిగజారతారా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరీ విచిత్రంగా జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ కలిసి పదవి పంచుకోవడం ఏంటన్న ప్రశ్నలకు స్థానికంగా సమాధానం దొరకడం లేదు. ఈపొత్తుల యవ్వారం అన్ని పార్టీల అధిష్టానాలకు తెలిసే జరిగిందా లేక లోకల్ నిర్ణయాలేనా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు.
