NTV Telugu Site icon

Off The Record:కలెక్టర్ తీరుపై నేతల గరం గరం

High

High

ఒంగోలు రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ తీరుపై ప్రజాప్రతినిధులు మనస్తాపం | Ntv Off The Record

ఆ జిల్లాలో రిపబ్లిక్‌ డే వేడుకలు చర్చగా మారాయి. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. అధికారులు చేపట్టిన ఆవిష్కరణలను, ఇతర కార్యక్రమాలను నేతలు బహిష్కరించారు. అయితే తాజా సమస్యపై ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారట నాయకులు? ఇంతకీ ఆ సమస్య ఏంటి?

ఒంగోలు రిపబ్లిక్‌ డే వేడుకల్లో అధికారుల తీరుపై రగడ
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు వివాదాస్పదంగా మారాయి.. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పిలిచి.. వేదికపైకి ఆహ్వానించకపోవడాన్ని అవమానంగా వారు భావించారు. కలెక్టర్ ప్రసంగిస్తుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు నాయకులు. వేడుకలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాతలు హాజరయ్యారు. వారిని గ్యాలరీలోకి వెళ్లి కూర్చోవాలని అధికారులు సూచించారు. అయితే అతిథులుగా వచ్చే ప్రజాప్రతినిధులను వేదికపైకి ఆహ్వానించడం అనవాయితీగా వస్తోంది. దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించారని ఎంపీ, ఎమ్మెల్యేలు కయ్‌మంటున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలకు గ్యాలరీలో సీట్లు
వేదికపైకి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఎంపీ మాగుంట చెప్పినప్పటికీ అధికారులు స్పందించలేదట. దాంతో కాసేపు గ్యాలరీలోనే వాళ్లంతా కూర్చున్నారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ జెండా ఆవిష్కరించన తర్వాత స్వాతంత్య్ర సమరయోధుల సత్కారం సమయంలోనూ ప్రజాప్రతినిధులను పిలవలేదు. దాంతో కలెక్టర్ ప్రసంగిస్తుండగా అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. అధికారులు తీరుపై ఎంపీ మాగుంట బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా గణతంత్ర వేడుకలకు వస్తామని.. ఎప్పుడు ఇలాంటి అవమానం జరగలేదని ఆయన అన్నారు.

ఇతర కార్యక్రమాలను బహిష్కరించిన నేతలు
ప్రజాప్రతినిధులు మనస్తాపం చెందారన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు.. బుజ్జగించేందుకు ఒక సీనియర్‌ పోలీసు అధికారిని పంపినా ఎవరూ మెత్తబడలేదట. ఈ కార్యక్రమం తర్వాత ఒంగోలు మినీ స్టేడియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆఫీసర్లు పిలిచినా ప్రజాప్రతినిధులు వెళ్లలేదు. అలాగే కలెక్టర్‌ ఇచ్చిన తేనేటి విందును బహిష్కరించారు. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, టీజేఆర్ సుదాకర్‌బాబులు నగరంలోనే ఉన్నా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులు ఫోన్‌ చేసినా కాల్స్‌ లిఫ్ట్ చేయలేదట.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో నేతలు
రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు ఉదయం జరిగిన ఘటన సమచారం లేదట. కలెక్టర్ దినేష్ కుమార్ కొత్త కావటంతో ఇలా జరిగిందని అనుకున్నా.. మిగతా అధికారులకు ఏమైందని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారట. గత ఏడాది కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను గుర్తు చేశారట. తమను పిలిచి అవమానించటం సరైన పద్దతి కాదంటున్నారట నాయకులు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నారట ప్రజా ప్రతినిధులు. దీంతో కలెక్టర్, నేతల మధ్య ఈ సమస్య ఎక్కడా గ్యాప్‌ తీసుకొస్తుందో అని అధికారులు ఆందోళన చెందుతున్నారట.