OTR : లోకేష్ ప్రకటనతో యాక్టివ్ అయిన మాజీ ఎమ్మెల్యే..?

Mek

Mek

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేష్‌ప్రకటనతో ఆ మాజీ ఎమ్మెల్యే అలర్ట్‌ అయ్యారా? తన రెండో భార్యకు పొలిటికల్‌ రూట్‌ క్లియర్‌ చేసే దిశగా అడుగులేస్తున్నారా? ఇక సైలెంట్‌గా ఉంటే కుదరదంటూ స్వరం సవరించుకున్నారా? వైసీపీలో ఉన్న సోదరుల మీద ఆరోపణలు అందుకేనా? ఎవరా ఎక్స్‌ ఎమ్మెల్యే? భార్య కోసం ఎలాంటి ప్లానింగ్‌ చేస్తున్నారు? శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన ఉదయగిరి కోటకు ఎంత ఘనమైన చరిత్ర ఉందో.. ఇక్కడి రాజకీయాలకు కూడా అంతే పాపులారిటీ ఉంటుంది. మాస్ రాజకీయాలకు కేరాఫ్‌గా చెప్పే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచారు. 2023లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైసీపీ అధిష్టానం. తర్వాత టీడీపీ కండువా కప్పుకొని.. ఉదయగిరిలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారాయన. గత ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకర్ల సురేష్‌కు సపోర్ట్ చేశారు. ఆయన తెలుగుదేశంలో చేరేటప్పుడే…. తన రెండో భార్య శాంతికుమారికి ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారట.

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకు గ్రంధాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చింది. ఇక భార్యాభర్తలిద్దరూ నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ…. అనుచర గణాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఛాన్స్‌ దొరికినప్పుడల్లా వైసీపీలో ఉన్న తన అన్న రాజమోహన్ రెడ్డితో పాటు.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కూడా టార్గెట్‌ చేస్తున్నారు చంద్రశేఖర్‌రెడ్డి. ఈ క్రమంలోనే తనకు ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశారని తాజాగా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మరోవైపు నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలిచిన అనుభవంతో… చాలామంది ద్వితీయ స్థాయి నాయకుల్ని పేరుపెట్టి పిలిచే చనువు ఉంది ఆయనకు. అయితే… క్రాస్‌ ఓటింగ్‌ ఆరోపణల తర్వాత వైసీపీని అభిమానించే ఓవర్గం ఆయనకు దూరమైంది..

×
×
Ad

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని కూడా దగ్గరికి తీసుకునే పనిలో ఉన్నారట ఆయన. ప్రస్తుతం ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్‌గా చంద్రశేఖర్‌రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తమ్ముణ్ణి నమ్మితే నట్టేట ముంచేస్తాడని, తనతో కలిసి రావాలంటూ పాత అనుచరులందరికి టచ్ లోకి వెళ్తున్నారట మాజీ ఎమ్మెల్యే. సొంత కుటుంబ సభ్యుడిని తననే మోసం చేసిన వాళ్ళు మిమల్ని చెయ్యకుండా ఉంటారా అంటూ వైసీపీలో సైలెంట్ గా ఉండే వారిని దువ్వుతున్నారట. అయితే… ఇక్కడే చాలామందికి కొత్త డౌట్స్‌ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివిటీ ఎందుకు పెంచారన్నది వాళ్ళ అనుమానం. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందన్నదానితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ పరంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ఇటీవల మహానాడు వేదిక నుంచి ప్రకటించారు లోకేష్‌. ఈ క్రమంలో… మహిళా రిజర్వేషన్ కోటాలో…. ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా ఉన్న తన భార్య శాంతిశ్రీకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలన్న ఆలోచన చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

 

ఉదయగిరి నియోజకవర్గంలో ఆమెను ప్రమోట్‌ చేయడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా… వైసీపీలో ఉండే కీలక నేతలందరూ తనను టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి మహిళా కోటాలో వస్తే… ఎట్టి పరిస్థితుల్లో తన చేయిదాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే. అందులో భాగంగానే తన భార్య కోసం గట్టిగా గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీలో ఉన్న అన్న రాజమోహన్ రెడ్డితో పాటు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యవహారశైలి మీద కూడా ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం యాక్టివ్‌ అయితే భవిష్యత్‌ మనదే అన్న ధీమాతో అడుగులేస్తున్నారట మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.