NTV Telugu Site icon

Off The Record: టచ్ చేయొద్దంటున్న గోపీనాథ్

Touich

Touich

జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చినా ఎందుకు ఆ ఎమ్మెల్యే భాద్యతలు స్వీకరించలేదు? | Ntv Off The Record

అసలే అధికారపార్టీ. పార్టీలో చిన్న హోదా ఉన్నా ఎంతో గొప్పగా చెప్పుకొంటారు నాయకులు. అలాంటిది జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కొందరు ఇంకా బాధ్యతలే చేపట్టలేదట. నియామకమై ఏడాదైనా టచ్‌ మీ నాట్‌గానే ఉన్నారట. ఆ జాబితాలో ఉన్న ఎమ్మెల్యే గురించే ప్రస్తుతం హాట్ హాట్‌ చర్చ సాగుతోంది. ఆయన ఎందుకు పార్టీ పగ్గాలు చేపట్టలేదు?

పార్టీ జిల్లా అధ్యక్షులది కీలక పాత్రగా చెప్పిన అధిష్ఠానం
గత ఏడాది 2022 జనవరి 26న తెలంగాణలోని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు సీఎం కేసిఆర్. జిల్లా అధ్యక్షుల్లో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపిలతో పాటు ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు కేంద్రంపై పోరాట కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లా అధ్యక్షులను నియమించారు. మొదట్లో గులాబీ పార్టీకి జిల్లా అధ్యక్షుల వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ తర్వాత దానిని ఆపేశారు. అసెంబ్లీ నియెజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని గులాబీ బాస్‌ స్పష్టంగా చెప్పడంతో జిల్లా అధ్యక్ష పోస్టుల గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో జిల్లా అధ్యక్షుల వ్యవస్థను పునరుద్ధరించారు. జిల్లా అధ్యక్షులను నియమించినా ఇప్పటికీ కొందరు బాధ్యతలు తీసుకోలేదు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో .. వారెందుకు బాధ్యతలు చేపట్టలేదన్నది పార్టీ శ్రేణుల ప్రశ్న.

హైదరాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు గోపీనాథ్‌
తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్తగా పార్టీ కార్యలయాల నిర్మాణం మొదలుపెట్టింది బీఆర్ఎస్. పలు జిల్లాల్లో ఆఫీసు భవనాల నిర్మాణం పూర్తయింది. జిల్లాల పర్యటనలో సీఎం కేసిఆర్ పార్టీ కార్యలయాలను ప్రారంభిస్తున్నారు. అదే సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు కొందరు నేతలు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడైన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. దానిపై గులాబీ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే పార్టీ సూచనతోనే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టలేదని తెలుస్తోంది.

గోపీ సారథ్యంపై కొందరు అభ్యంతరం?
హైదరబాద్ జిల్లా గులాబీ పార్టీ అధ్యక్షుడి నియమాకంలో ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాకు చెందిన పలువురు నాయకుల అభ్యంతరం వల్లే గోపీ బాధ్యతలు తీసుకోలేదన్నది కొందరి వాదన. అలా అభ్యంతరాలు చెప్పింది ఎవరు? జిల్లాలో గోపీతో పొసగని నాయకులు ఎవరెవరు ఉన్నారు? అని ఆరా తీస్తున్నారట నేతలు. అలాగే ఈ పదవి ఆశిస్తున్న నాయకులు ఇంకెవరైనా ఉన్నారా అనేది ఆసక్తిగా మారుతోంది. అసలు అధిష్ఠానం మదిలో ఏముంది? గోపీకంటే బెటర్‌ ఆప్షన్‌ ఏదైనా ఆలోచిస్తున్నారా లేక మరికొంతకాలం ఇలాగే నాన్చుతారా అనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి విషయంలో పార్టీ ఏం చేస్తుందన్నది కేడర్‌కు అంతుచిక్కడం లేదట.