ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం వెదుకుతోందట కాంగ్రెస్ పార్టీ. ఒకప్పటి కంచుకోటలో ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదట. ఏ అసెంబ్లీ నియోజకవర్గం అది? ఎందుకంత దారుణమైన పరిస్థితి వచ్చింది?
నర్సాపూర్‌లో విలవిల్లాడుతున్న కాంగ్రెస్
మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. బలమైన కేడర్ కూడా ఉండేది. ఆ పార్టీ తరపున సునీతా లక్ష్మారెడ్డి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీన్ రివర్స్ అయింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారామె. దీంతో హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు సునీతా లక్ష్మారెడ్డి.
నర్సాపూర్‌లో ఎమ్మెల్యే స్థాయి నేత దొరకని కాంగ్రెస్
సునీత బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు కరవైంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక్కరూ దొరకలేదట ఆ పార్టీకి. ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారట కానీ… ఇంకా సరైన అభ్యర్థి కనిపించలేదట. ఎన్నికల టైం సంవత్సరాలు గడిచి… నెలల్లోకి వచ్చింది. అయినా… కేడర్ మొత్తాన్ని దారిలో పెట్టి నేనున్నానని భరోసా కల్పించగలిగే నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్‌కు దొరకలేదట. దీంతో చివరి నిమిషంలో ఎవరో ఒకర్ని తీసుకువచ్చి మా మీద రుద్ది… వాళ్ళ కోసం పనిచేయమంటారేమోనని ఆందోళన చెందుతున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. ఇక నర్సాపూర్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న నైరాశ్యంలో ఉన్నారట.
నర్సాపూర్ మీద పక్క నియోజకవర్గాల నేతల కన్ను?
నర్సాపూర్ కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులకు కొదవలేదు. కానీ…ఎమ్మెల్యే స్థాయి ఉన్నవారు మాత్రం లేరట. అందుకే…పక్క నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు ఈ మధ్య రాకపోకలు పెంచారట. వాళ్ళ కదలికలు ఇక్కడి కేడర్‌కు రుచించడం లేదట. అందుకే తమలో ఒకర్ని ముందుకు తెచ్చే యోచనలో ఉన్నారట నర్సాపూర్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు. త్వరలోనే ఒకర్ని అధిష్టానానికి చూపించి స్టాంప్ వేయించుకోవాలనుకుంటున్నారట. ఇతనే మీ నాయకుడు అని అగ్ర నాయకత్వం ఒక మాట చెప్పేస్తే.. తమ పని తాము చేసుకోవాలనుకుంటున్నారట నాయకులు. కాదు.. కూడదని పక్క నియోజకవర్గాలకు చెందిన వారిని ఇంపోర్ట్ చేస్తే.. మాత్రం సహాయ నిరాకరణ ఆలోచన కూడా ఉందట.
వాస్తవానికి నర్సాపూర్‌లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కంచుకోటల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికీ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నా…వాళ్ళని ముందుకు నడిపే నాయకుడు లేకపోవడమే అసలు విషాదం. ఉయ్ వాంట్ లీడర్ అంటోందట ఇక్కడి కాంగ్రెస్ కేడర్.
