NTV Telugu Site icon

Off The Record: ఆ ఎమ్మెల్యేకు ఎందుకంత వ్యతిరేకత?

Maxresdefault (1)

Maxresdefault (1)

ఆ ఎమ్మెల్యేకు ఎందుకంత వ్యతిరేకత పెరిగింది..? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది..! | OTR | Ntv

గ్రామ వాలంటీర్లకు ఉన్నపాటి విలువ కూడా ఆ ఎమ్మెల్యేకి లేదా? వాలంటీర్లు వెళితే నవ్వుతూ మాట్లాడుతున్న జనం… ఈసారి మీకు ఓటేయబోమని ఎమ్మెల్యే ముఖం మీదే ఎందుకు చెబుతున్నారు? చేపల పులుసేసి అన్నం పెడతాం గానీ… ఓట్లు మాత్రం అడగొద్దని అనిపించుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? సొంత పార్టీలో కూడా ఎందుకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది?

ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాలను పోషిస్తున్నారా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైఖరితో విసిగిపోయి మేం పార్టీలో ఇమడలేకపోతున్నామని అంటున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు. ఎమ్మెల్యే తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారట. జగనన్నే మా భవిష్యత్‌ అంటూ గృహసారథులు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్తుంటే… ప్రజలు ఆదరిస్తున్నారని, అదే ఎమ్మెల్యే చిట్టిబాబు గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ఊరూరా తిరుగుతుంటే వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నాయకులే విశ్లేషిస్తున్నారట. పైగా మాకు ఏం చేశారంటూ ఎమ్మెల్యేని నిలదీస్తున్నారట. ఎమ్మెల్యేగా వస్తే… చేపల పులుసేసి భోజనం పెడతాం. తిని వెళ్లండి. అంతేగానీ.. మా ఓట్లు మాత్రం అడక్కండని ముఖం మీదే చెప్పేస్తున్నారట. దీనంతటికీ కారణం నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాలను కొండేటి చిట్టిబాబు పెంచి పోషించడమేనన్నది లోకల్‌ టాక్‌. ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని పార్టీ కేడరే చెప్పుకుంటోందట.

రాజీనామాలకు సిద్ధమవుతున్న గ్రామస్థాయి నాయకులు
చిట్టిబాబు వైఖరికి నిరసనగా.. పలు గ్రామాల్లో పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఒక్కొక్కరుగా వైసిపికి దూరం అవుతున్నారట. అయినవిల్లి మండల బీసీ నాయకుల్లో రకరకాల అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయట. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాజీనామాకు సిద్దమయ్యారట పలువురు బీసీ నాయకులు. కె.జగన్నాధపురం సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి, ఆమె భర్త శ్రీనివాస్, ఇదే గ్రామానికి చెందిన ఎంపిటీసి జిలగం హేమలత… ఇలా పలువురు గ్రామ స్థాయి నాయకులు కూడా రాజీనామాలకు సిద్ధమయ్యారట. కె.జగన్నాధపురం నుండి ముక్తేశ్వరం వరకు వున్న రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడం ప్రధాన సమస్య అయింది. నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చెయ్యాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నది వారి ఆవేదన అట. జగన్నాధపురంలో ఏడున్నర మీటర్లు ఉన్న మూడు బిట్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మూడేళ్ళు గడుస్తున్నా.. నేటికీ నిర్మాణం మొదలవకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానిక వైసీపీ నాయకులు. ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమేనని, ఇలాంటివి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్నాయని చెబుతున్నారు కార్యకర్తలు.

బుజ్జగింపులు ఫలిస్తాయా?
రాజీనామాల సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టిబాబు అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారట. దాంతో తాత్కాలికంగా ఉపసంహరించుకున్నా..వారిలో అసంతృప్తి తగ్గలేదట. నాయకులను అయితే బుజ్జగించి దారిలోకి తెచ్చుకున్నా… ప్రజల మనస్సులను ఎలా గెలుచుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. వై నాట్‌ 175 అంటున్న వైసీపీ నాయకత్వం అందులో పి.గన్నవరం కూడా ఉండాలంటే… ముందు ఎమ్మెల్యేని సెట్‌ చేయాలన్నది లోకల్ టాక్‌.