Off The Record: నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయానుభం…. రెండు సార్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా, జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉంది కొట్టు సత్యనారాయణకు. అలాంటి నేతను ఉన్న పళంగా పక్కన పెట్టింది YCP అధిష్టానం.మంత్రి ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఘోరమైన ఓటమి, నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతున్నా పట్టింపులేనితనం లాంటి కారణాలతో మాజీ మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు పార్టీ పెద్దలు. ఆదేశాలను సరిగా పాటించకపోవడం, కార్యక్రమాలను సరిగా నిర్వహించకపోవడం లాంటి వాటి ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. ఊహించని ఈ పరిణామం కారణంగా తీవ్ర సంతృప్తితో రగిలిపోతున్నారట కొట్టు. మాట మాత్రం చెప్పకుండా ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫ్రస్ట్రేషన్‌తోనే….కొత్త ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాంతో కలసి పని చేసేందుకు ఏ మాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. కొత్త కోఆర్డినేటర్‌గా బాధ్యతలు తీసుకోగానే కార్యకర్తలతో సమావేశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు రఘురాం. ఆయనే స్వయంగా పలుమార్లు కొట్టు సత్యనారాయణను కలిసే ప్రయత్నించినా అట్నుంచి సానుకూల సమాధానం రాలేదని చెప్పుకుంటున్నారు. ఫోన్లో సైతం అందుబాటులోకి రాకపోవడంతో కొత్త కోఆర్డినేటర్ తనదైన శైలిలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారట.
తాజాగా నిర్వహించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసిపి ఆత్మీయ సమావేశానికి భారీగా కార్యకర్తలు నాయకులు తరలిరావడంతో జోష్ పెరిగిందని అంటున్నారు. ఈ మీటింగ్‌కు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరైనా.. మాజీ మంత్రి మాత్రం డుమ్మా కొట్టడంపై పార్టీ వర్గాలే పెదవివిరుస్తున్నాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పరిణితితో వ్యవహరించాల్సింది పోయి… ఇలా చేయడం ఏంటంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ ఒకే నాయకత్వం కింద పని చేయడం సాధ్యం కాదని.. పార్టీ అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే నాయకత్వం కోసం మార్పులు సహజమనే విషయాన్ని ఆయన అర్ధం చేసుకోకపోతే ఎలాగని ప్రశ్నిస్తోంది ద్వితీయ శ్రేణి. సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని అస్త్రంగా మల్చుకుంటున్నారట కొట్టు సత్యనారాయణను వ్యతిరేకిస్తున్నవారు. కింది స్థాయి నాయకులతో కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు ఆదేశించినా…. ఆయన అందుకు సహకరించకపోవడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒంటెత్తు పోకడలతో ఇంతకాలం కలిసి వచ్చిన రాజకీయాలు చేసిన మాజీ మంత్రి…. ఇకపై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు వైసీపీ నాయకులు. అయితే కొట్టు అనుచరుల వెర్షన్ మరోరకంగా ఉంది.
ఇల్లు అలకగానే పండగ కాదు, భవిష్యత్తులో మళ్లీ మాకే అవకాశం దక్కొచ్చు అంటూ డ్యామేజ్ ని కవర్ చేసుకునే పనిలో పడ్డారట. కొత్త కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు వెళ్ళొద్దంటూ పార్టీ నాయకులు పలువురికి చెబుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో…గూడెం వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అయితే పార్టీ అధినేత నిర్దేశాల ప్రకారం కొత్త కో ఆర్డినేటర్ వెనుక నడిచేందుకు ఎక్కువ శాతం కార్యకర్తలు, నాయకులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో… పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే… కొట్టు మూసుకోవడం ఖాయమన్న సెటైర్స్ సైతం పడుతున్నాయి. ప్రస్తుతానికైతే…. కొత్త ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ పెద్దల అభిప్రాయం మారకపోవచ్చన్నది తాడేపల్లిగూడెం వైసిపి నేతల మనోగతం. మాజీ మంత్రి భవిష్యత్తు రాజకీయాలు ఎలా కొనసాగిస్తారన్నది చూడాలి మరి.
