Site icon NTV Telugu

Off The Record: పవన్ ట్రాప్ లో పడకుండా వైసీపీ నాయకుల వ్యూహాత్మక జాగ్రత్తలు?

Off The Record

Off The Record

Off The Record: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు, మాజీ సీఎం జగన్‌కు అస్సలు పడదు. ఛాన్స్‌ దొరక్కున్నా… దొరకబుచ్చుకుని మరీ… జగన్‌ను ఏకిపారేస్తుంటారు పవన్. అట్నుంచి కూడా అంతే. పవన్‌ కళ్యాణ్‌ను పూచికపుల్లతో సమానంగా తీసేస్తారు వైసీపీ లీడర్స్‌. జగన్ మీద పవన్ ఒక్క కామెంట్ చేస్తే చాలు….. మా నేతను అంత మాట అంటావా అంటూ రాష్ట్రం నలులమూల నుంచి విరుచుకుపడే వాళ్లు ఫ్యాన్‌ పార్టీ నాయకులు. వెంటనే ప్రెస్మీట్లు పెట్టే వారు. రెండు మూడు రోజుల పాటు ఆఎపిసోడ్‌ అలా నడుస్తూ ఉండేది. కానీ… ఈ మధ్య వైసీపీ దీన్ని పూర్తిగా ఎత్తేసింది. పద్ధతి పూర్తిగా మారిపోయింది. పవన్ ఏమన్నా సరే స్పందించడమే మానేసింది. ఆయన ప్లాన్స్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందట వైసీపీ. మొన్నటికి మొన్న జలజీవన్ పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం… వైసీపీ నేతలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అన్నారు. మళ్లీ గెలుస్తాం…. కేసులు పెడతాం… జైల్లో వేస్తామని జగన్ అంటున్నారని… అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేపోయారు… ఇప్పుడేం చేస్తారంటూ కాస్త ఘాటుగానే అన్నారాయన. పాత పద్ధతిలో అయితే…. ఈ కామెంట్స్‌కు వైసీపీ ధూంధాం చేసేది. మాటలు చాలా దూరం వెళ్ళేవి.

కానీ, ఈసారి ఎక్కడా రీ సౌండ్ రాలేదు. ఎందుకలా…? ఏం జరిగిందని ఆరా తీస్తే ఓ కొత్త ఈక్వేషన్ చెప్పారు ఒక మాజీ మంత్రి. తాము పవన్‌ ట్రాప్‌లో పడకుండా ఉండటానికే ఈ వ్యూహాత్మక మౌనం అన్నది ఆయన వెర్షన్‌. పవన్‌కు మద్దతుగా ఉన్న కాపుల్లో ఈ మధ్య అసంతృప్తి పెరిగిపోతోందట. మన వాడు ఏదో అవుతాడని అనుకుంటే…. ఏం కావడంలేదని, డిప్యూటీ సీఎంకే పరిమితం అయిపోయారని, అధికారాలు కూడా లేవనే అసంతృప్తి కాపుల్లో పెరుగుతోందట. ఆ విషయంలో పవన్ మీద ఆగ్రహం లేకున్నా… టీడీపీ వైపు నుంచి ఆయనకు తాము ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడంలేదన్న కసి పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దీన్ని పవన్ గుర్తించారని… అందుకే ఇప్పుడు జగన్‌ను, వైసీపీని తిట్టడం మొదలు పెట్టారని విశ్లేషించారు ఆ మంత్రి. కాపుల్లో టీడీపీ మీద అసంతృప్తి ఉంటే…. జగన్‌ను తిట్టడం ఎందుకని ప్రశ్నిస్తే….. అసలు లాజిక్‌ అంతా అక్కడే ఉందని అంటున్నారు. పవన్ అలా జగన్‌ను తిట్టగానే తామూ రెచ్చిపోయి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చే వారమని… గుర్తు చేశారు ఆ వైసీపీ మాజీ మంత్రి. కాస్త డోస్‌ పెంచి తాము తిడితే…. దానివల్ల కాపుల గురి తిరిగి జగన్ మీదకు, వైసీపీ మీదకు మళ్లుతోందని, సరిగ్గా… అలా డైవర్ట్‌ చేయడంలోనే పవన్ కల్యాణ్ సక్సెస్ అవుతున్నారని, ఫైనల్‌గా తాము కాపులకు శత్రువులుగా మిగులుతున్నామన్నామంటూ విశ్లేషించారా ఎక్స్‌ మినిస్టర్‌.

దీన్ని పూర్తిగా గమనించి, ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే…. పవన్ ఏమన్నా సరే… తమ వైపు నుంచి ఘాటు రియాక్షన్స్‌ ఏవీ ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చిందట వైసీపీ. ఏదైనా మీడియా ప్రత్యేకంగా రియాక్షన్ కావాలని అడిగితే కూడా… సాఫ్ట్ గా స్పందించాలని, నోటికి వచ్చినట్టు కామెంట్స్‌ చేయవద్దనే నిర్ణయం కూడా జరిగిందట. మొన్నటి ఎన్నికల్లో కూటమి కంటే కాపుల ఎఫెక్టే ఎక్కువగా దెబ్బకొట్టిందని వైసీపీ ఎప్పుడో అంచనా కొచ్చింది. చివరకు తీస్మాన్ ఖాన్ లు అనుకునే కాపు మాజీ మంత్రులు సైతం ఘోరంగా ఓడిపోయారు. టీడీపీకి పవన్ ఇంధనంగా మారారని…. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా అది రిపీట్ కాకుండా చూడాలనే ప్లాన్ లో భాగంగానే స్ట్రాటజీ ఛేంజ్ చేసిందట వైసీపీ.

Exit mobile version