Off The Record: ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌ని షేక్ చేస్తున్న అంశం తిరుమల లడ్డు. శ్రీవారి మహాప్రసాదం కల్తీ విషయంలో అధికార, ప్రతిపక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ…. మేం తప్పు చేయలేదని, తప్పుగా మాట్లాడలేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు, ప్రభుత్వం తిరుమల లడ్డు అంశం మీదే ప్రత్యేక దృష్టి పెట్టాయి. నిజా నిజాల్ని తేల్చేందుకు మంత్రులతో ఒక కమిటీ, పార్టీ ప్రతినిధులతో మరో కమిటీ ఏర్పాటవబోతున్నాయి. ఇంతటి కీలకమైన సందర్భంలో యాక్టివ్‌గా వ్యవహరించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఎందుకు కామ్‌గా ఉన్నారు? ఆయన నోరు తెరవకపోవడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. టీటీడీ ఇండిపెండెంట్ బాడీ అయినా… కొన్ని విషయాల్లో ఎంతోకొంత దేవాదాయ శాఖ ప్రమేయం ఉంటుంది. అలాంటి శాఖకు మంత్రిగా ఉండటమే కాకుండా, పార్టీ పరంగా సీనియర్ అయిన ఆనం కామ్‌గా ఉండటం వెనక కారణాలేమై ఉంటాయా అని ఆరా తీస్తున్నారు పలువురు.
ఈ లడ్డూ వివాదానికి సంబంధించి తన అభిప్రాయాన్ని నేరుగానే చెప్పేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందని సిట్ నివేదిక వచ్చిన దగ్గర్నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు సీఎం. ముందు కేబినెట్, ఆ తర్వాత డిప్యూటీ సీఎంతో దాని తర్వాత బీజేపీ చీఫ్.. ఇతర మంత్రులు… ఇలా వరసగా సమావేశాలు పెట్టారు ముఖ్యమంత్రి. కానీ… ఏ సందర్భంలోనూ… ఆనం నోరు మెదపకుండా సైలెంట్ అయిపోయారు. తన శాఖకు సంబంధం ఉన్న వ్యవహారమైనా.. ఆయన ఎందుకలా ఉన్నారో అంతు చిక్కడం లేదని అంటున్నాయి రాజకీయవర్గాలు. అంతా సీఎం చంద్రబాబు, కొంతమంది ఇతర మంత్రులే చూసుకుంటున్నారు… ఇక నేనెందుకని భావిస్తున్నారా? లేక అత్యంత వివాదాస్పదమైన ఈ ఎపిసోడ్‌లో తలదూర్చి ఏదో ఒకచి మాట్లాడి విమర్శల పాలవడం ఎందుకని అనుకుంటున్నారా అంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
కానీ… కీలకమైన సబ్జెక్ట్ మాట్లాడాల్సిన టైంలో… సీనియర్ అయిన ఆనం రామనారాయణరెడ్డి అలా మౌనంగా ఉండటం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు ఎక్కువ మంది. టీడీపీ నాయకులు కొందరైతే… ఇంకాస్త వెనక్కి వెళ్ళి ఆయన ఎప్పుడు మాట్లాడారుగనుక అంటూ…నిట్టూరుస్తున్నారు. గతంలో వివిధ దేవాలయాల్లో వరుస ఘటనలు, తొక్కిసలాటల్లాంటివి జరిగినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నారని, స్పందించిన సందర్భాల్లో కూడా తూతూ మంత్రంగా మాట్లాడి సరిపెట్టారంటూ గుర్తు చేస్తున్నారు. ఓవరాల్‌గా అసలే విషయం మీద ఆయన పెద్దగా దృష్టి పెట్టడంలేదని విశ్లేశించే వాళ్లు సైతం ఉన్నారు. అయితే… మిగతా సందర్భాల సంగతి ఎలా ఉన్నా….ప్రస్తుతం అత్యంత కీలకమైన తిరుమల లడ్డు విషయంలో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే ఎలాగన్నది ఎక్కువ మంది తెలుగుదేశం నాయకుల ప్రశ్న. వైసీపీపై అనేక విమర్శలు చేస్తూ ఉన్న మంత్రి సరిగ్గా సమయం వచ్చినప్పుడు, అందులోనూ. తన శాఖకు సంబంధం ఉన్న వ్యవహారంలో మౌనంగా ఉండటం ఏంటన్నది టీడీపీ కేడర్ క్వశ్చన్.
