Site icon NTV Telugu

Off The Record: విజయసాయి రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ కోసం తహతహలాడుతున్నారా..?

Vijay Sai Reddy Political C

Vijay Sai Reddy Political C

Off The Record: తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. అందునా….. రాజకీయ రుచులు మరిగిన వారు అస్సలు ఆగలేరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్తుతం ఈ యాంగిల్‌లోనే హాటు ఘాటు చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయి… తన పొలిటికల్‌ రీ ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పేశారని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ నిబద్ధతలేని వారే ఉన్నారని, అంతా ఒక కోటరీగా ఏర్పడి ఆయన్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారి సాయిరెడ్డి. జగన్ మంచి వాడేగానీ…. అలాంటి వాళ్ల మాటలు వినకూడ‌దనడం చర్చనీయాంశం అయ్యాయి. వైసీసీని వీడాక విజయసాయి ప‌దే ప‌దే జ‌గ‌న్ కోట‌రీ అంటూ కామెంట్‌ చేయడం వెనక బ‌ల‌మైన కార‌ణాలు ఉండిఉండ‌వ‌చ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రస్తుత జీవితం పూర్తిగా రైతుగానే అని చెబుతూనే… పొలిటికల్‌ కామెంట్స్‌ చేయడం వెనక పెద్ద ప్లానింగే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. తాను తలచుకుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టగలనని, కానీ…. ప్రస్తుతానికైతే… అలాంటి ఆలోచన ఏదీ లేదని అన్నారాయన. గతంలో బీజేపీ నేతలకు దగ్గరగా ఉండటంతో ఆయన కాషాయం కప్పుకుంటారని ప్రచారం జరిగినా అటువైపు వెళ్ళలేదు.

ఇక ఇటీవల విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహణ తీరుపై సీఎం చంద్రబాబుకు కూడా పలు సూచనలు చేశారు సాయిరెడ్డి. దీంతో… బాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు భావించారు. అయితే ఆయన మాత్రం తాను ఆ రెండు పార్టీల లోకి వెళ్తున్నట్టు ఎక్కడా చెప్పలేదని.. మీడియాలోనే వచ్చింది తప్ప తన ప్రమేయం లేదని వివరించారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్ కోట‌రీ అంటూ పాయింట్‌ చేస్తున్న విజయసాయి ఈసారి కూడా అదే త‌ర‌హాలో వ్యాఖ్యలు చేయ‌టం.. అక్కడితో ఆగకుండా తనకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రెండు దశాబ్దాల స్నేహం ఉందని.. తాను ఎప్పుడూ పవన్‌ని విమర్శించలేదంటూ మాట్లాడ‌టం నోట్ చేసుకోవాల్సిన పాయింట్సేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్‌. ఎవరు ఏమనుకున్నా.. ప్రస్తుతానికి తాను ఒక రైతుగా మాత్రమే ఉన్నానని ఓవైపు చెబుతూనే అదే సమయంలో అవసరమైతే పార్టీ పెడతానని అనడం మాత్రం రాజకీయ సంచలనానికి కారణమైంది. ఆయన స్టేట్‌మెంట్‌ గురించి అటు వైసీపీలో కూడా చర్చ మొదలైంది. విషయం లేకున్నా… తన రాజకీయ అవసరాల కోసం ఏవేవో లీకులు ఇచ్చి ఎవర్నో టార్గెట్ చేయడం ఆయనకు అలవాటేనని మాట్లాడుకుంటున్నారట ఫ్యాన్‌ లీడర్స్‌. పార్టీలో తనకు రీ ఎంట్రీ ఉండబోదని అర్ధమయ్యాకే సాయిరెడ్డి నాలుక అలా మడతలు పడుతుండవచ్చన్నది వైసీపీ వర్గాల వాయిస్‌. పార్టీ నుంచి బయటికి వెళ్ళాక మాట్లాడ్డానికి ఏదో ఒక కార‌ణం కావాలి కాబ‌ట్టి కోట‌రీ క‌ధ‌లు అల్లుతున్నారన్నది వైసీపీ ముఖ్యుల ఇన్నర్‌ వాయిస్‌గా తెలుస్తోంది.

మ‌రోవైపు స‌డన్‌గా పవన్ కల్యాణ్‌తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందని చెప్పటం ఆయనను తానెప్పుడూ విమర్శించలేదని.. వ్యక్తిగ‌తంగా పవన్ తనకు మిత్రుడనటం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చనీయాంశం అయింది. దీంతో… సాయిరెడ్డి రాజ‌కీయాల విష‌యంలో మ‌న‌సు మార్చుకున్నారా.. పొలిటిక‌ల్‌గా ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నారా అనే అంశం హాట్ టాపిక్ అయింది. విషయం ఏదైనా… వ్యూహాత్మకంగా మాట్లాడే సాయిరెడ్డి ఎవరూ అడక్కుండానే… ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో తన వైఖరిని చెప్పడం కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశమేనంటున్నారు పొలిటిక‌ల్ పండిట్స్.. గతంలో… వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు పవన్‌ మీద ట్విట్టర్ వేదికగా అనేక తీవ్ర విమర్శలు చేసిన సాయిరెడ్డి… ఇప్పుడు మ‌న‌సు మార్చుకుని మంచివాడ‌న‌టం యాధృచ్చికం కాక‌పోయి ఉండ‌వ‌చ్చని అంటున్నారు. వ్యవ‌సాయం పేరుతో వెళ్లిపోయిన వ్యక్తి ఇప్పుడు జ‌గ‌న్ కోట‌రీ అంటూ మాట్లాడ‌టం.. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ త‌న‌కు మంచి మిత్రుడు అని చెప్పటం సాధారణంగా కనిపించడం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ప‌వ‌న్ సైడ్ నుంచి పాజిటివ్ కార్నర్ కోసం ఆయ‌న అలా మాట్లాడారా.. లేక ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా అని లెక్కలేస్తున్నారు కొందరు. ఒకవేళ విజయసాయి పొలిటికల్‌ రీ ఎంట్రీ ఖాయమైతే… ఏ పార్టీలో చేరతారు.. ఆయన వ్యాఖ్యలకు జ‌న‌సేన రియాక్షన్స్ ఏ విధంగా ఉండ‌బోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా త‌న స్టాండ్ తాను తీసుకునేందుకే సాయిరెడ్డి మ‌రోసారి వైసీపీపై అస్త్రాలు సంధించారా..? లేక అంతకు మించిన వ్యూహం ఉందా అన్నది తేలాలంటే కాస్త ఆగాల్సిందేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version