NTV Telugu Site icon

Off The Record: మీటింగ్స్‌కు నేతల డుమ్మా..! బీజేపీ సభ్యత్వాల టార్గెట్‌ సాధ్యమేనా..?

Bjp

Bjp

Off The Record: తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని సభ్యత్వాలు ఎందుకు చేయించలేమన్న చర్చ సైతం జరిగింది పార్టీలో. ఆ క్రమంలోనే 50 లక్షల టార్గెట్‌ తెర మీదికి వచ్చింది. కానీ… టైం గడుస్తున్నా… ఇప్పటి వరకు కేవలం 15 లక్షల దాకా అయి ఉంటాయని పార్టీ నేతలే చెబుతున్నారు. అంటే… వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే…. తక్కువ సమయంలో ఇంకో 35 లక్షల మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… ఇటీవలే దీనిపై రివ్యూ చేశారు. టార్గెట్‌ పూర్తి చేయడానికి 15 రోజుల డెడ్‌లైన్‌ పెట్టారు. కానీ… అంత సీన్‌ లేదని, 15 రోజుల్లో 35 లక్షల సభ్యత్వాలన్నది కల్లేనని తెలంగాణ బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 77 లక్షల ఓట్లు పడ్డాయి. ఆ స్థాయిలో సభ్యత్వం చేయించాలని భావించారు పార్టీ అగ్ర నేతలు.

Read Also: IND vs BAN: గ్వాలియర్ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా.. (వీడియో)

అంటే కమలం గుర్తు మీద ఓటేసిన ప్రతి ఒక్కర్నీ పార్టీ సభ్యుడిగానో, సభ్యురాలిగానో చేర్పించాలన్నది వాళ్ళ ఆశ. కానీ… ఆశలకు , వాస్తవాలకు పొంతన కుదరడం లేదని ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోందట పార్టీ వర్గాలకు. అటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సభ్యత్వం చేయించడమన్నది సవాల్‌గా మారిందని అంటున్నారు. మిగతా చోట్ల ఎలా ఉన్నా…పార్టీ గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలోనైనా భారీగా సభ్యత్వాలు చేయించాల్సి ఉంది. అలా జరగని పక్షంలో నైతికంగా ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రభావం పడుతుంది. పార్టీ పెద్దల దగ్గర అది పరువు ప్రతిష్టల సమస్యగా కూడా మారుతుంది. అందుకే సభ్యత్వం కోసం రెగ్యులర్ గా రివ్యూలు చేస్తున్నా.. పెద్దగా వర్కౌట్‌ కానట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి నేతలతో రెగ్యులర్‌గా టచ్ లో ఉంటూ పై నుంచి ఎప్పటికప్పుడు ఫాలోఅప్‌ చేస్తూ… ఆపసోపాలు పడుతున్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్‌. ఎంపీ, ఎమ్మెల్యేలకు పెట్టిన వ్యక్తిగత టార్గెట్స్‌ చూసి…ఇదెక్కడి గొడవరా దేవుడా… అంటూ సణుక్కుంటున్నారట కొందరు.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టుల హతం..

ఇక రాష్ట్ర స్థాయి, ఆపైన పదవులు ఉన్న నాయకులు తక్కువలో తక్కువ ఐదు వందల సభ్యత్వాలు చేయించాలట. క్రియాశీలక సభ్యుడు కావాలంటే వంద మందిని పార్టీలో చేర్పించాలి. చివరికి ఆ టార్గెట్స్‌ పూర్తి చేసేందుకు కూడా నాయకులు నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆయా వ్యక్తుల రెఫరల్ కోడ్ తో సభ్యులుగా చేరితే …. ఎవరెన్ని సభ్యత్వాలు చేయించారన్నది ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. ఈ క్రమంలో పార్టీ మీటింగ్స్‌ జరిగినప్పుడల్లా ఎవరెన్ని చేయించారో ఫోన్‌లో చూపించాలని అడుగుతున్నారట. ఈ క్రమంలో సభ్యత్వాలు చేయించలేని నాయకులు ఇజ్జత్ పోతుందని మీటింగ్‌లకు సైతం ముఖం చాటేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సభ్యత్వాల గోల మా నెత్తి మీదికొచ్చిందని ఫీలైపోతున్న నాయకులే ఎక్కువగా ఉన్నారట తెలంగాణ బీజేపీలో..

Show comments