Site icon NTV Telugu

Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

Otr T Bjp

Otr T Bjp

Off The Record: తెలంగాణ బీజేపీ వ్యవహారాల మీద పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఫోకస్‌ పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారట. మరీ ముఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కనీసమైన పనితీరు కూడా చూపలేకపోయిన జిల్లాల అధ్యక్షుల మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట పార్టీ పెద్దలు. అందుకే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న జిల్లా అధ్యక్షులపై స్టేట్‌ ప్రెసిడెంట్‌ రామచందర్ రావు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ బాగా సీరియస్‌ అయినట్టు సమాచారం. దాన్ని ఒట్టి సీరియస్‌ అనడంకంటే…. పొట్టుపొట్టున తిట్టిపెట్టారని చెప్పడం కరెక్ట్‌ అని పార్టీ వర్గాలే అంటున్నాయి. తాజాగా S I R పై బీజేపీ వర్క్ షాప్ జరిగింది. దాని తర్వాత జిల్లాల అధ్యక్షులతో భేటీ అయ్యారు ఇన్ఛార్జ్‌. ఆ సందర్భంగా సంస్థాగత అంశాలతోపాటు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగిందట. అప్పుడే కొందరు జిల్లా అధ్యక్షుల తీరును రాష్ట్ర అధ్యక్షుడు తీవ్రంగా తప్పుపట్టినట్టు తెలిసింది. ఇక సంస్థాగత ప్రధాన కార్యదర్శి అయితే ఊగిపోయినట్టు తెలిసింది.

నాకు భాష రాదంటూ ఏవేవో కామెంట్స్ చేస్తున్నారట. ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారో నాకు మొత్తం తెలుసునంటూ గట్టిగానే ఇచ్చుకున్నట్టు సమాచారం. ఓ జిల్లా అధ్యక్షుడు మధ్యలో జోక్యం చేసుకుని ఏదో చెప్పబోగా… నువ్వు RSS కార్యాలయం చుట్టూ తిరిగితే, వాళ్ళని కలిస్తే పార్టీ పని చేసినట్టా…? నీ జిల్లా పరిధిలో ఒక్క మున్సిపాలిటిలోని ఒక్క వార్డ్‌లోనైనా పార్టీని గెలిపించావా? ఏం చేస్తున్నావ్‌…? నేతల్ని ఎందుకని కలుపుకుని పోవడం లేదంటూ
సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఇలా అయితే నడవదని కూడా మిగతా వాళ్ళ ముందే క్లారిటీగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మండల అధ్యక్షుల నియామకం జరక్కుండా ఒక సీనియర్ నేత అడ్డుకుంటున్నారని మరో జిల్లా ప్రెసిడెంట్‌ చెబితే ఆయనకి కూడా గట్టిగానే ఇచ్చేశారట తివారీ. నెలలో కనీసం 15 రోజులు కూడా పార్టీకోసం టైమ్ ఇవ్వని వాళ్ళు కూడా సీనియర్సేనా… వాళ్లతో సంబంధం లేకుండా ముందు కమిటీలు వేయండని సీరియస్‌గా చెప్పారట. ఇంకో జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జితో దురుసుగా ప్రవర్తించారట. మీటింగ్‌లో ఆయన్ను లేపి మేం పంపించిన రాష్ర్ట ప్రతినిధిని అగౌరవపరుస్తావా? ఏమనుకుంటున్నారు? ఇలా అయితే కుదరదని సీరియస్‌ అయినట్టు సమాచారం.

సీనియర్ నేతలను ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదు? పార్టీ మీద ఎందుకు ఫోకస్ చేయడం లేదు, పార్టీ లేదని అంటున్నావటకదా అంటూ మరో జిల్లా అధ్యక్షుడిని జాడించేసినట్టు తెలిసింది. అసలు మున్సిపల్‌ ఎన్నికల కోసం పంపిన డబ్బు ఎటుపోయింది, ముందు లెక్కలు చెప్పు అంటూ సీరియస్‌ అయ్యారట సంస్థాగత ప్రధాన కార్యదర్శి. ఇంకో జిల్లా అధ్యక్షుడినైతే… ఇంతకు ముందు ఒక మున్సిపల్ ఛైర్మన్‌ను గెలుచుకున్నావు. ఇప్పుడు పట్టుమని పది వార్డ్‌లు కూడా గెలవలేదు. ఇదేనా నీ ప్రొఫెషనలిజం అని మందలించినట్టు తెలిసింది. వోవరాల్‌గా చాలా మంది జిల్లా అధ్యక్షుల పని తీరు బాగా లేదని, ఇక మీకు అవకాశం ఇచ్చేది లేదని, 10 మందికి పైగా జిల్లా అధ్యక్షులను పీకేస్తామని సీరియస్‌ అయినట్టు సమాచారం. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఫుల్‌ రిపోర్ట్ ఉందని, మారు మారక పోతే మేం మార్చక తప్పదని హెచ్చరించారట రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దీన్ని బట్టి చూస్తుంటే… ఇక మీదట బీజేపీ అధిష్టానం సీరియస్‌గానే ఉంటుందని అర్ధమవుతోందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version