Site icon NTV Telugu

Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

Otr Srikakulam Diarrhea

Otr Srikakulam Diarrhea

Off The Record: శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల ప్రబలిన అతిసారకు ఇద్దరు చనిపోయారు. 200 మంది వరకు ఆసుపత్రిపాలయ్యారు. అదంతా ఒక ఎత్తయితే… ఆ పేరు చెప్పి తీసుకున్న చర్యలు, ఆ తర్వాతి పరిణామాలు బాగా పొలిటికల్‌ కంపు కొడుతున్నాయట. దీనికి కొత్తగా కులం కోణం కూడా యాడ్‌ అవడంతో… కూటమి ప్రభుత్వ పెద్దలు ఇరుకున పడ్డట్టు తెలుస్తోంది. అసలు సమస్యకంటే కొసరు సమస్య పెద్దదై మనల్ని ఇబ్బంది పెట్టేలా ఉందంటూ జిల్లా టీడీపీ నాయకులు మేటర్‌ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. టౌన్‌లో డయేరియా కేసులు నమోదైన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. మంత్రులు, అధికారులు హుటా హుటిన వచ్చి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. కానీ.. ఆ సందర్భంగా తీసుకున్న ఒక సీరియస్‌ యాక్షన్‌ ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందట. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ కూర్మారావును సస్పెండ్ చేసింది ప్రభుత్వం. కానీ… తప్పు చేసింది ఎవరు? శిక్ష ఎవరికి అంటూ చర్చలు మొదలవడంతో సర్కార్‌ డిఫెన్స్‌లో పడ్డట్టు తెలుస్తోంది. కూర్మారావు కమిషనర్‌గా ఛార్జ్‌ తీసుకుని అప్పటికి కేవలం 14 రోజులు. అంత షార్ట్‌టైంలో ఆయన ఏం చేయగలరు? బాధ్యుడని చెబుతూ సస్పెండ్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ డిఫరెంట్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి శ్రీకాకుళంలో. పైగా మంత్రి అచ్చెన్నాయుడు ఏరికోరి ఆయన్ని కమిషనర్‌గా రప్పించుకున్నారట.

అదేదో ఒక రోజులో వచ్చిన సమస్య కాదని, అలాంటిదానికి సంబంధం లేని కమిషనర్‌ని బలిపశువును చేశారంటూ జరుగుతున్న చర్చలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటున్నాయి. అసలు శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌ పోస్ట్‌ అంటేనే… అయ్య బాబోయ్‌ మా వల్ల కాదంటూ అంతా తప్పుకుంటున్న టైంలో… కనీసం ఏ వార్డ్‌ ఎక్కడుందో అవగాహన తెచ్చుకునేలోపే కొత్త కమిషనర్‌ కూర్మారావును సస్పెండ్ చేయడం వెనక డయేరియాకు మించిన కారణాలున్నాయా అంటూ ఆరాలు కూడా మొదలైపోయాయి. ప్రాథమికంగా అయితే… ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌ అని, అసలు ఎక్కడా ఆ టాపిక్కే లేకుండా 14 రోజుల క్రితం వచ్చిన, ఏమీ తెలియని కమిషనర్‌ని ఎలా బలిచేస్తారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి.స్వయంగా కలెక్టర్ ఈ ప్రాంతాల్లో పర్యటించి శానిటేషన్ చేయిస్తుంటే.. ఇన్ని రోజులూ మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ఏం చేశారన్న ప్రశ్న రాకపోవడం విచిత్రమేనని అంటున్నారు పరిశీలకులు. కూర్మారావు శ్రీకాకుళం డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు రెండు సార్లు జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డ్‌ వచ్చింది, అలాంటి ఆఫీసర్‌ను సంబంధంలేని వ్యవహారానికి బలి చేశారంటూ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్ని కంగారు పెడుతున్న అసలు మేటర్‌ వేరే ఉందట. సస్పెండ్‌ అయిన కమిషనర్‌ కూర్మారావుది జిల్లాలో బలమైన కాళింగ సామాజికవర్గం. ఈ ఎపిసోడ్‌తో ఆ ఈక్వేషన్స్‌ ఎక్కడ దెబ్బతింటాయోనని స్థానిక అధికార పార్టీ నాయకులు కంగారు పడుతున్నట్టు సమాచారం.

భయంకరమైన అవినీతి ఆరోపణలతోనో, పని ఎగ్గొట్టారనో సస్పెండ్‌ చేస్తే అది వేరే సంగతిగానీ…. కేవలం ఛార్జ్‌ తీసుకున్న 14 రోజుల్లో, అదీ… సంబంధంలేని వ్యవహారంతో ఎలా సస్పెండ్‌ చేస్తారంటూ ఆ సామాజికవర్గంలో కొత్త చర్చ మొదలైందట. ఇది ఇంకా ముదిరితే పరిణామాలు ఎలా ఉంటాయోనన్నది జిల్లా టీడీపీ పెద్దల భయం. అందుకే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళి ప్యాచప్‌ చేసేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన డిస్కషన్‌ కూడా జరుగుతోంది. అచ్చెన్న సిఫారసుతోనే కూర్మారావు కమిషనర్‌గా వచ్చారని, అలాంటిది ఆయన నోటీస్‌లో లేకుండా సస్పెండ్‌ చేశారా అన్నది చాలామంది డౌటనుమానం. దీంతో ఈ వ్యవహారం ఎక్కడ మొదలై ఎటు పోతుందోనన్న ఆందోళనలో ఉన్న తెలుగుదేశం లీడర్స్‌ వీలైనంత త్వరగా శుభం కార్డ్‌ వేయాలనుకుంటున్నట్టు సమాచారం. కులం కోణంలో సోషల్‌ మీడియాలో మొదలైన చర్చలకు వీలైనంత త్వరగా ఫుల్‌స్టాప్‌ పెట్టకుంటే డ్యామేజ్‌ తప్పదని గ్రహించిన అధికార పార్టీ ముఖ్య నాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోబోతున్నారట.

Exit mobile version