NTV Telugu Site icon

Off The Record: వైసీపీలో పరిణామాలతో టీడీపీలో కలవరం..! నాటి సీన్‌ రిపీట్‌ అవుతుందా..?

Nellore Tdp

Nellore Tdp

Off The Record: నెల్లూరు జిల్లా వైసీపీలో రేగిన అలజడి ప్రతి జిల్లాలోనూ ఉందనేది టీడీపీకి ఉన్న సమచారం. ఆ విషయం తెలిసినప్పటి నుంచి టీడీపీ నాయకులు.. కేడర్‌లో కలవరం మొదలైంది. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..ఆనం రామనారాయణరెడ్డి కండువా మార్చే సూచనలు ఉన్నాయి. ఇదే జిల్లాలో మరో కీలక నేత కూడా టీడీపీలోకి జంప్‌ చేయడానికి సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి అధికారపార్టీలో సంక్షోభం వస్తే సంతోషించాల్సిన టీడీపీ కేడర్‌.. ఎందుకు ఆందోళన చెందుతుందనేదే ప్రశ్న. దీనికి టీడీపీ నేతలు అనేక కారణాలు వెల్లడిస్తున్నారు.

2014 ఎన్నికలు ముగిశాక వైసీపీ నుంచి భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. 23 మంది ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకొన్నారు. ఇలా చేరిన ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రి పదవులు దక్కాయి. ఇది చాలదన్నట్టు.. పార్టీలో కూడా వారికి కీలక పదవులు ఇచ్చారు. దాంతో నిఖార్సైన టీడీపీ కేడర్‌ బాగా ఇబ్బందులు పడింది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వస్తే.. మళ్లీ ప్రత్యర్థులకు పెద్దపీట వేయడం ఏంటని తెలుగు తమ్ముళ్లు ఆనాడు అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఆ వైఖరి కూడా ఓ కారణమని అభిప్రాయ పడ్డారు. మళ్లీ అలాంటి సీన్‌ టీడీపీలో గేరప్‌ అవుతుందనే అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. మళ్లీ పక్క పార్టీల వారు వస్తామనడం.. వారికి టిక్కెట్లివ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండటంతో టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వైసీపీ ఎవరినైతే వదిలించుకుంటుందో.. అలాంటి వారిని టీడీపీలో చేర్చుకుంటే పార్టీకి భారంగా మారతారని పసుపు పార్టీలో కొందరు అభిప్రాయ పడుతున్నారట. వలస నాయకులు టీడీపీకి ఏ మాత్రం అక్కరకు రారని చెబుతున్నారు. అలాగే గతంలో టీడీపీని వీడిన వారు తిరిగి వస్తామన్నా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారట. వైసీపీలో అన్ని అనుభవించి.. ఇప్పుడు అక్కడ ఇమడలేక వస్తామంటున్న వారి విషయంలో టీడీపీ అధిష్ఠానం ఒకటికి రెండుసార్లు ఆలోచించాలనేది వారి వాదన. కాదు కూడదని అనుకుంటే.. వారు కాకుండా.. వారి వారసులను టీడీపీలో చేర్చుకోవాలని సూచిస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగి.. నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారితో ఎలా కలిసి పనిచేస్తామని నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ఆచితూచి సరైన నిర్ణయం తీసుకోకపోతే గత ఎన్నికల ఫలితాలే రిపీటయ్యే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని టీడీపీ అధిష్ఠానం చెబుతున్నా.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అలా కనిపించడం లేదనే భావన కేడర్‌లో ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికల్లో తాము టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నట్టు వాళ్లకు వాళ్లే ప్రకటించేసుకుంటే.. ఇక పార్టీకి.. పార్టీ అధినాయకత్వానికి విలువేం ఉంటుందని తమ్ముళ్లు నిలదీస్తున్నారట.