Off The Record: తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పాత్ర చాలా కీలకం. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. అప్పట్లో పార్టీ అధినేత ఏ పిలుపు ఇచ్చినా…విజయవంతం చేయడంలో ముందుండేవారాయన. అయితే… ఆయన మరణం తర్వాత ఆ స్థాయిలో మమ్మల్ని లీడ్ చేసే నాయకుడు ఎవరంటూ ఎదురు చూస్తున్నారు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు. సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. పూర్తిగా బాధ్యతలను తీసుకునే స్థాయికి అప్పుడే రాకపోవచ్చన్నది ఓ అంచనా. నియోజకవర్గ పార్టీ బాధ్యతల్ని తాను చూసుకోగలనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నా… అధిష్టానం మాత్రం స్వప్న మీద అప్పుడే భారం మోపొద్దన్న ఆలోచనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే… తాత్కాలికంగానైనా… ఒక నాయకుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారన్నది బీఆర్ఎస్ ఇంటర్నల్ టాక్.
రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యత, భారం స్వప్న మీద వేయకుండా… మరో నేతకు అప్పగించాలనుకుంటున్నారట. వరంగల్ జిల్లాలోని ఒక నాయకుడికి నర్సంపేట బాధ్యతల్ని తాత్కాలికంగా అప్పజెప్పాలన్నది పెద్దల ఆలోచన. అయితే… ఈ విషయంలో తెలిసిన పార్టీ నాయకులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ పూసుకుంటే ఎక్కడ నర్సంపేట బాధ్యతలు తమ మీద పడతాయోనని చాలా మంది ఆ టాపిక్ వస్తేనే… ఏమీ తెలియని అమాయకుల్లా తప్పుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా ఎందుకయ్యా అంటే… ఎవరి లెక్కలు వారికి ఉన్నాయట. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం నడుస్తోంది. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. దీంతో… ఇప్పుడు నర్సంపేట బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటే.. ఎక్కడ ఆర్థిక భారం మోయాల్సి వస్తుందోనన్న భయమ చాలా మందికి ఉందని అంటున్నారు. పోనీ… దాన్ని కూడా భరించి కొనసాగితే… రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, టిక్కెట్ గ్యారంటీ లేదు. ప్రస్తుతం ఇవ్వబోతున్న బాధ్యతలు తాత్కాలికమేనని ముందే చెబుతున్నారు. అందుకే… ఏమీ లేని చోట ఎగిరెగిరి దంచడం ఎందుకన్నది ఎక్కువ మంది జిల్లా బీఆర్‌ఎస్ లీడర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే నర్సంపేట ప్రస్తావన రాగానే… అదేదో సినిమాలో సీన్‌లాగా…. సెల్‌ఫోన్ చెవిలో పెట్టుకుని హలో హలో అనుకుంటూ పక్కకు వెళ్ళిపోతున్నారట. కానీ… బీఆర్‌ఎస్ అధిష్టానం మాత్రం నర్సంపేట బాధ్యతల్ని గట్టి నాయకుడికి అప్పగించాలన్న పట్టుదలతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నియోజకవర్గం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నందున… ఆ లిమిట్స్‌లో ఉన్న నేతలంతా చమ నెత్తిన ఎక్కడ పడుతుందోనని టెన్షన్‌గా ఉన్నట్టు సమాచారం. మహబూబాబాద్ జనరల్ అయితే… అక్కడ పట్టు సాధించాలన్న ఆలోచనతో ఉన్న నేతలకు నర్సంపేట భయం పట్టుకుందని అంటున్నారు. అలాగే… ఈ జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల్లో కూడా నర్సంపేట భయం ఉందట. అటు హన్మకొండ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలకు సైతం నర్సంపేట ఇన్చార్జ్ టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం పిలిచి ఎక్కడ ఆ బాధ్యతలు తీసుకోమని చెబుతుందోనన్నది వాళ్ళందరి భయం అట. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సొంత నియోజకవర్గ బాధ్యతలతో పాటు నర్సంపేటను కూడా ఎక్కడ మోస్తాం అంటూ… సన్నితుల దగ్గర కొందరు నేతలు వాపోతున్నారట. మొత్తం మీద ఆ రకంగా ఓరుగల్లు కారులో నర్సంపేట సెగలు పుడుతున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నకు రాజకీయ అనుభవం ఉందిగానీ… ఆమె ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల్లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోందట అధిష్టానం. అందుకే… తాత్కాలికంగా క్యాడర్‌కి కొంత భరోసా ఇచ్చేలా ఓ బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తోందంటున్నారు. కానీ… ఈ తాత్కాలికంగా దగ్గరే చాలామందికి మింగుడుపడ్డంలేదన్నది ఇన్‌సైడ్ టాక్. అందుకే… నర్సంపేట ప్రస్తావన వస్తే చాలు… ముఖం చాటేసే వాళ్ళే పెరిగిపోతున్నారని చెప్పుకుంటున్నారు గులాబీ కార్యకర్తలు.

