Off The Record: నా వయసు….. నా అనుభవం….. ఎన్నెన్ని ఎత్తుపల్లాలు చూడలేదు…? ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్ని డీల్ చేయలేదు…? వాటన్నిటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసేసి….. వైసీపీని బలోపేతం చేసేందుకు బూస్ట్, బోర్న్‌విటాలా తాగిద్దామనుకుంటుంటే అసలా ఛాన్సే ఇవ్వడం లేదని తెగ ఫీలైపోతున్నారట ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫ్యాన్ కిందికి చేరి పొలిటికల్‌గా ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేశారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని శపధం చేసి… పంతం నెగ్గక చివరికి అన్న మాట ప్రకారం పేరు చివరన రెడ్డిని తగిలించుకున్నారీ కాపు సామాజికవర్గం ముఖ్య నాయకుడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రత్తిపాడు నియోజకవర్గం పార్టీ బాధ్యతల్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరికి అప్పగించారు వైసీపీ పెద్దలు. ప్రస్తుతం ఆ పోస్ట్‌లో కొనసాగుతున్నారు గిరి. కానీ… పద్మనాభం మాత్రం కుదురుగా ఉండలేకపోతున్నారట. పార్టీ నుంచి ఇంకేదో కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
అసలు పార్టీ నాయకత్వానికి తనను వాడుకోవడం తెలియడం లేదని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. వైసీపీ పీఏసీ సభ్యుడిగా ఉన్నప్పటికీ… అసలు అది జుజుబీ అని, తన స్థాయికి సరిపోదని కాస్త అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అనుభవం, విషయ పరిజ్ఞానం ఉన్న తనకు రీజినల్ కో ఆర్డినేటర్ పోస్ట్ లేదా ఒక జిల్లా బాధ్యతలు పూర్తిగా అప్పగించేస్తే జెట్ స్పీడ్‌లో గట్టిగానే దూసుకుపోతానని చెప్తున్నారట. అంతా తెలిసి కూడా… ఎందుకో, పార్టీ ఆ దిశగా ఆలోచించడం లేదని కాస్త నిష్టూరంగానే అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పరుగులు పెట్టించే వాళ్లను పక్కనపెడితే ప్రయోజనం ఏమంటుందంటూ స్పీడ్ అయిపోతున్నారట పద్మనాభరెడ్డి. నన్ను వాడుకోవడం తెలియడం లేదని కొందరు పార్టీ పెద్దల దగ్గరే ప్రస్తావించానని, అయినా రిజల్ట్ మాత్రం రాలేదని గుర్తు చేస్తున్నారీ మాజీ మంత్రి. ఈమధ్యనే ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను విడదీసి సామాజిక వర్గాల పరంగా లెక్కలు సరిచేసింది వైసీపీ అధిష్టానం. ఆ టైంలో అయినా నన్ను పరిగణనలోకి తీసుకుంటే మేటర్ వేరేలా ఉండేదంటూ తెగ బాధపడుతున్నట్టు సమాచారం. అదే సమయంలో ముద్రగడ ప్రతిపాదన మీద పార్టీ నాయకత్వంలో కూడా కాస్త డిఫరెంట్‌గా చర్చ జరుగుతోందట. సీనియర్ కాబట్టి… ఆయన అడుగుతున్నారని ఇవ్వొచ్చు సరే… అంతవరకు బాగానే ఉంటుందిగానీ… పోస్ట్‌లోకి వచ్చాక సార్… బాగా అడ్వాన్స్ అయితే… కంట్రోల్ చేయడం కష్టం. ఆయన చెబుతున్నట్టు నిజంగానే పరిస్థితులు రివర్స్‌లో వేరేలా ఉంటాయన్న చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.
ముద్రగడ మైండ్‌సెట్ ప్రకారం చూస్తే…. ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా ఈక్వేషన్స్ సరిచేయడం ఆయనకు అంత ఈజీ కాదన్నది వైసీపీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. పిఠాపురంలో గత ఎన్నికల్లో ఆయన చూపించిన లెక్కలతో… ఏదో జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేసేశామని, కానీ గ్రౌండ్ రియాల్టీ వేరే విధంగా ఉన్నట్టు ఫలితాల తర్వాత అర్థమయిందని అంటున్నారట పార్టీ ముఖ్యులు కొందరు. ఇప్పుడు కూడా ఒక ప్రాంతం, లేదా ఒక జిల్లా బాధ్యతలు ముద్రగడకు అప్పగించేస్తే పార్టీలో ఉన్న మిగతావాళ్లు కంఫర్ట్‌గా ఉండలేరన్నది అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రశాంతంగా జరిగేదేదో జరిగిపోతోంది. ఇలాంటప్పుడు కెలుక్కుని మరీ… కంపు చేసుకోవడం అవసరమా అన్నది వైసీపీ పెద్దోళ్ళ ప్రశ్న. అందుకే ముద్రగడ ప్రతిపాదనపై కూడా సున్నితంగా చెప్పకనే చెప్పేశారట. ప్రస్తుతానికి అలా కానివ్వండి, రేపు ఎన్నికల టైంకి అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుందామని అన్నట్టు సమాచారం. అప్‌డేట్ వెర్షన్‌లో ఓల్డ్ సాఫ్ట్‌వేర్ వేస్తే వర్కౌట్ కాదన్న వాస్తవాన్ని తాడేపల్లి పెద్దలు గ్రహించే పెద్దాయన్ని ఎంటర్‌టైన్ చేయడంలేదని చెప్పుకుంటున్నారు స్థానికంగా. మొత్తానికి……… మీకసలు వాడకం తెలియడం లేదయ్యా, వాడండి, నన్ను గట్టిగా వాడుకోండని ముద్రగడ చెబుతున్నా… అప్పుడే అంత బంపరాఫర్ వద్దులే పెద్దాయనా అని పార్టీ అధిష్టానం చెబుతోందన్నది తూర్పుగోదావరి టాక్.
