Site icon NTV Telugu

Off The Record: పలకరింపులేనా.. అంతకు మించా?

Otr Magunta Srinivasulu Red

Otr Magunta Srinivasulu Red

Off The Record: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి సంబంధించి పెద్దగా వివాదాలేం లేవు. మూడు ద‌శాబ్దాల పొలిటికల్‌ లైఫ్‌లో ఆయన ఎవర్నీ గట్టిగా అన్నది లేదు, అనిపించుకున్నదీ లేదు. కానీ…. ఈ మధ్య కాలంలో మాత్రం చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే… తాజాగా చెన్నై లో ఓ వివాహ వేడుక‌లో మాజీ సీఎం జ‌గ‌న్‌తో కలివిడిగా మాట్లాడ్డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. జ‌గ‌న్‌తో ఏర్పడిన గ్యాప్ కార‌ణంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాగుంట… ఈ పెళ్ళి వేడుకలో జ‌గ‌న్‌ను ఆప్యాయంగా ప‌లక‌రించ‌డం సోష‌ల్ మీడియా సబ్జెక్ట్‌ అయిపోయింది. గ‌త వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిపై ఢిల్లీ లిక్కర్ కేసులో అభియోగాలు రావ‌టం, అదే కేసుకు సంబంధించి ఆయ‌న కొడుకు జైలుకు వెళ్ళి రావ‌టం మాగుంట పొలిటికల్‌ కెరీర్‌లో ఒక బ్లాక్ స్పాట్ అని చెప్పుకుంటారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఆయ‌న టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో తన కుమారుడు రాఘ‌వ‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాల‌ని శ‌త‌విధాలా ప్రయ‌త్నించినా సాధ్య పడలేదు. అందుకు ఢిల్లీ లిక్కర్‌ కేసే కారణం అంటారు. దీంతో ఫైనల్‌గా ఆయనే పోటీకి దిగాల్సి వచ్చింది.

Read Also: Wife Murder Attempt: డామిట్ .. భర్తను అడ్డంగా నరికేందుకు వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది..

కానీ… ఇటీవ‌లే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని త‌న కుమారుడే ఇక రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తార‌ని ప్రక‌టించారు శ్రీనివాసులురెడ్డి. అదంతా ఒక ఎత్తయితే… తాజాగా చెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుక‌కు హాజ‌రవడం, అక్కడే జ‌గ‌న్‌ను క‌లవ‌టం, ఇద్దరూ ఆప్యాయంగా ప‌లుక‌రించుకోవ‌టం పొలిటికల్‌ హాట్‌ అయింది. ఇది పలకరింపులకే పరిమితమా? లేక అంతకు మించా అన్న చర్చలు నడుస్తున్నాయి. పాత పరిచయం ఉన్న ఇద్దరు…. ఒక కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం మామూలేగానీ…. ఈ పలకరింపుల్లో మాత్రం ఇంకేదో ధ్వనిస్తోంది. లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తున్నాయంటూ సోషల్‌ మీడియాలో తెగ విశ్లేషించేస్తున్నారు. 2019లో వైసీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంటకు రెండు లక్షలకు పైగా భారీ మెజార్టీ దక్కింది. మొద‌ట్లో అంతా బాగానే ఉన్నా…. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు మాగుంట స్వయంగా వెళ్ళి అభినంద‌న‌లు చెప్పి వచ్చారు. ఆ పరిణామం వైసీపీ వ‌ర్గాల‌కు ఆగ్రహం తెప్పించింద‌న్న ప్రచారం న‌డిచింది. ఇక అప్పటి నుంచి అధిష్టానంతో గ్యాప్‌ పెరిగిందన్న వాదనలున్నాయి. ఇక మాగుంటకు వైసీపీ టికెట్ నిరాక‌రించ‌టం, 2024 ఎన్నిక‌లకు ముందు ఆయన టీడీపీలోకి వెళ్లి పోటీ చేసి గెల‌వ‌టం తదనంతర పరిణామాలు. జ‌గ‌న్‌తో గ్యాప్ రావ‌టానికి ఢిల్లీ లిక్కర్ కేసు ఓ కార‌ణం అయితే….. పార్టీకి సమాచారం ఇవ్వకుండా తెలంగాణా సీఎం రేవంత్‌ను కలవడం మరో కారణం అని చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ సోద‌రుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుక‌లో ఇద్దరూ కలవడం, ఆప్యాయంగా ప‌లక‌రించుకోవడం సోష‌ల్ మీడియాలో చ‌ర్చనీయాంశం అయింది. ఈ భేటీకి ప్రత్యేకంగా రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేకున్నా….తిరిగి జ‌గ‌న్‌తో టచ్‌లోకి వెళ్ళేందుకు ఓ సందర్భం దొరికిందంటూ సోషల్‌ మీడియా చర్చలు జరుగుతున్నాయి.

ఇక, ఆయ‌న కుమారుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డి వైసీపీలోకి వెళ్తార‌ంటూ ఇటీవల అదే సోష‌ల్ మీడియా కోడై కూసింది. ఇప్పుడిక పెళ్లిలో జగన్‌, శ్రీనివాసులరెడ్డి కలవడంతో ఊహాగానాలకు హద్దు లేకుండా పోతోంది. అయితే… దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా వాదించే వాళ్ళు సైతం ఉన్నారు. ఇటువంటి ప‌రిణామాల తర్వాతే గతంలో రాజకీయం కొత్త మలుపులు తిరిగిందని, ఈసారి కూడా అలాంటివి జరుగుతాయేమో ఎవరు చూడొచ్చారంటూ చర్చించుకుంటున్నారు. ఈ భేటీ తర్వాత సంథింగ్‌ సంధింగ్‌ అని సోషల్‌ మీడియా అంటుంటే…. మాగుంట సన్నిహితులు మాత్రం నథింగ్‌ నథింగ్‌ అంటున్నారు. మాగుంట అంద‌రితో బాగా ఉండే వ్యక్తి కావ‌టంతో వివాహ వేడుకలో మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశారు తప్ప….ఇందులో రాజ‌కీయాల‌కు తావులేద‌న్నది వాళ్ళ క్లారిటీ. అయితే… ఈ భేటీని, పలకరింపుల్ని టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో పొలిటికల్ ట్విస్ట్‌లు ఉంటాయా లేక కథ ఇక్కడితో ఆగుతుందా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Exit mobile version