Site icon NTV Telugu

Off The Record: అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే..

Anantapur

Anantapur

Off The Record: తీవ్ర వివాదంగా మారిన అనంతపురం అర్బన్ నియోజకవర్గ వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ పెడుతోందట. ఇక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. ఇదే సమయంలో… తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ దూషించారంటూ వైరల్‌ అయిన ఆడియో కలకలం రేపింది. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే… తెలుగు యువత నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో సంభాషణ తీవ్ర దుమారం రేపింది. ఒక రకంగా అది టీడీపీని డిఫెన్స్‌లోకి నెట్టిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. ఆ మాటలు విని ఓ రేంజ్‌లో ఫైరైపోయారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. ఇక అంతకంటే ముందు నుంచే అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుబాటి , మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కి చేరింది. శాసనసభ్యుడితో పాటు ఆయన అనుచర వర్గం మీద కూడా భూ ఆక్రమణలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, చికెన్, మద్యం షాపుల్లో వసూళ్లు అంటూ ఆరోపణలు చేశారు ప్రత్యర్థులు. దీనికి తోడు అనంతపురం సాయినగర్‌లో మైనార్టీకి కుటుంబానికి చెందిన ఆప్టికల్ దుకాణం స్థల వివాదం ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంది. షాప్‌ మీద దాడి చేయడం, డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

Read Also: Off The Record: టీడీపీ నేతలే కూన రవి కుమార్ కుర్చీ కింద మంటలు పెడుతున్నారా..?

అయితే వీటన్నిటితో… తనకు సంబంధం లేదని, గిట్టని వారే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా సమావేశంలో చెప్పారు ఎమ్మెల్యే దగ్గుపాటి. ఆ వివాదాలు అలా కొనసాగుతున్న టైంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ని దూషించినట్టు చెబుతున్న ఆడియో బయటికొచ్చింది. తాను అసలా మాటలు అనలేదని, అదంతా ఫేక్‌, మార్ఫింగ్‌ అని దగ్గుపాటి చెప్పినా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. దీంతో అనంతపురం వ్యవహారాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్‌ అయ్యారట. క్రమశిక్షణను ఉల్లంఘించి, వర్గ పోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని గట్టి హెచ్చరించినట్టు సమాచారం. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని క్లారిటీగా చెప్పేశారట సీఎం. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పిలిపించి అన్ని అంశాల గురించి ఆరా తీసినట్టు సమాచారం. దాంతో…దగ్గుపాటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో చౌదరి చాలా డీటెయిల్ట్‌గా చెప్పారట. అంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా పల్లాకు తమ బాధలు వివరించినట్టు సమాచారం.

Read Also: Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?

ఇప్పుడు బయటకొచ్చిన ఆడియోలకు, తనకు సంబంధం లేదని, పార్టీ కోసం సీటును త్యాగం చేశానని.. భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన లేనప్పుడు గ్రూపు రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకేంటని ప్రభాకర్ చౌదరి అన్నట్టు తెలిసింది. పార్టీకి నష్టం చేసే మనస్తత్వం తనది కాదని చెప్పేశారట ఆయన. అంతా విన్న పల్లా.. మొత్తం సంఘటనలపై చాలా ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రవర్తిస్తుంటే పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారట ఆయన. నష్టం చేసేది ఎమ్మెల్యేలైనా సరే యాక్షన్ ఉంటుందన్నారు. ఇక ఎమ్మెల్యే దగ్గుపాటి వివరణ తర్వాతనైనా ఈ వివాదం చల్లారుతుందా లేదా లేదన్నది ఆసక్తికరంగా మారింది… పార్టీలో గ్రూప్ తగాదాలకు బ్రేక్ వేసేందుకు అధిష్టానం వైపు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version