NTV Telugu Site icon

Off The Record: అసలు మంచు మనోజ్‌ మనసులో ఏముంది..? అందు కోసమే ఈ డ్రామాలా?

Manchu Manoj

Manchu Manoj

Off The Record: ఆస్తులు కోసం కాదు, ఆత్మగౌరవం కోసమేనంటూ.. మంచు మనోజ్ చేస్తున్న హడావిడి అటు సినీ పరిశ్రమ, ఇటు సొంత జిల్లా చిత్తూరులో హాట్‌ హాట్‌గా మారిపోతోంది. మొదట్లో ఇదేదో… వాళ్ళ ఇంటి వ్యవహారం, తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల రచ్చేలే అనుకున్నారు అంతా. కానీ… రాను రాను ఇదేదో అతిలా మారుతోందని, ఇరు వర్గాలు తెగేదాకా లాగుతుండటం, రచ్చ చేసుకుంటూ…మీడియా అటెన్షన్‌ కోసం పాకులాడుతుండటం లాంటివి ఎబ్బెట్టుగా మారుతున్నాయన్న టాక్‌ మొదలైంది. మరీ ముఖ్యంగా మనోజ్ ఎందుకు ఇలా చేస్తున్నరో, మాస్టర్ ప్లాన్ ఏంటో అర్ధం కావడం లేదన్నది పరిశీలకుల మాట. హైదరాబాద్‌లో మొదలైన మంచు మంటలు ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి. దాడులు, ప్రతిదాడులు, ప్రతిఘచించడాలు, పరస్పరం ఫిర్యాదులతో రక్తికడుతోంది మంచు ఫ్యామిలీ డ్రామా. చివరికి సంక్రాంతి సమయంలో పెద్దల్ని తల్చుకుంటూ చేసుకునే పూజల విషయంలో సైతం హై డ్రామా నడిచింది. ఆ టైంలో గేట్లు దూకడాలు, రాళ్ళ దాడులతో లాఠీ ఛార్జ్‌దాకా వెళ్ళింది వ్యవహారం.

ఇక కొత్తగా ఈనెల 13న మోహన్‌బాబు యూనివర్శిటీ ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌ను మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న మనోజ్.. అక్కడికి వెళ్ళి పరిశీలించడమేగాక.. చుట్టు ప్రక్కల షాపుల యజమానులతో మాట్లాడారు. అక్కడ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులను MBU సిబ్బంది దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో విద్యార్థి నుంచి 10 వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నది మనోజ్‌ ఆరోపణ. ఆ విషయమై పోలీస్‌ కంప్లయింట్‌ సైతం ఇప్పించారు. ఇక తాజాగా రాత్రి పదిన్నర సమయంలో భాకరాపేట లేక్ వ్యాలీ రిసార్ట్స్‌లో ఉన్న ఉన్న మనోజ్ దగ్గరకు వెళ్లిన ఎస్ఐ రాఘవేంద్ర ఇక్కడ ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించడంతో మనోజ్ ఫైర్ అయ్యారు. రాత్రి సమయంలో సైరన్ వేసుకుని వచ్చి ప్రశ్నిస్తూ… తమను ఇబ్బంది పెట్టడం ఏంటంటూ… నేరుగా పోలీస్‌ స్టేషన్‌ ముందే బైఠాయించడం కలకలం రేపింది. అయితే… తాను అరెస్ట్‌ చేయడానికి రాలేదని, ఎవరున్నారు? ఏం చేస్తున్నారన్న వివరాల కోసమే వచ్చానని ఎస్సై చెప్పినా వినకుండా…. మనోజ్‌ నానా హంగామా చేయడంపై విమర్శలు రేగుతున్నాయి. ఎందుకిలా… అంటే… ఆయన సన్నిహితులకు సైతం క్లారిటీ లేదంటున్నారు. కేవలం అన్న విష్ణు మీద ఉన్న ఉన్న కోపంతోనే ఇలా చేస్తుండవచ్చన్న చర్చ జరుగుతోంది చిత్తూరు పొలిటికల్‌ సర్కిల్స్‌లో. యూనివర్శిటీలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే‌… తండ్రి దగ్గర తనను శత్రువుగా క్రియేట్‌ చేశారని, అన్న విష్ణుదే అందులో కీ రోల్‌ అన్నది మనోజ్‌ వెర్షన్‌గా తెలుస్తోంది.

అలాగే… ఈ రచ్చంతా ఎందుకని తండ్రి అనుకునేలాగా ఏదో ఒకటి చేసి.. ఆయన పిలిస్తే వెళ్ళి మాట్లాడుకోవాలన్న ప్లాన్‌ కుడా ఉండి ఉండవచ్చంటున్నారు కొందరు. కానీ.. మోహన్ బాబు మాత్రం వరుసగా జరుగుతున్న పరిమాణాలపై ఎక్కడా స్పందించడం లేదు. తాజా గొడవ కూడా తండ్రి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకునే పనిలో భాగంగానే చేసి ఉండవచ్చంటున్నారు. లేకుంటే… రొటీన్‌ తనిఖీలకు వచ్చిన పోలీసుల్ని చూసి… తనను అరెస్టు చేయడానికి వచ్చారంటూ ఓవర్ యాక్షన్ ఎలా చేస్తాడంటూ గుసగుసలాడుకుంటున్నారట. రానురాను మంచు కుటుంబ వ్యవహారం ఇటు పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతోందని అంటున్నారు. ఇంటి గుట్టు వీధికేసుకుని, కేసులు, దాడులు అంటూ…. ఎప్పుడు ఎవరొచ్చి ఆందోళన చేస్తారో… తెలియని పరిస్థితుల్లో… పోలీసులు వీళ్ళ మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టాల్సి వస్తోందన్నది డిపార్ట్‌మెంట్‌ టాక్‌ అట. మనోజ్‌ ఒకటి చేస్తే… విష్ణు ఇంకోటి చేస్తున్నారని, బౌన్సర్స్‌తో హోటళ్ళ ధ్వంసం లాంటి ఘటనల కారణంగా శాంతి భద్రత సమస్యలు సైతం తలెత్తుతున్నాయంటూ…. పోలీసులు సైతం తల కొట్టుకుంటున్నారట. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చిందన్నట్టుగా మంచు ఫ్యామిలీ రచ్చ మాకు తలపోటుగా మారిందన్నది కొందరు స్థానిక పోలీసుల మాటగా తెలుస్తోంది. ఈ కుటుంబ కథా సమరానికి ఎప్పుడు ఎండ్‌ కార్డ్‌ పడుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.