Off The Record: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ రాజకీయం మొత్తం దొమ్మేరు దివాణం చుట్టూనే తిరుగుతోందట. దొమ్మేరు జమిందార్ వంశానికి చెందిన పెండ్యాల అచ్చిబాబు ఇక్కడ కింగ్ మేకర్ అవతారం ఎత్తి ఎమ్మెల్యే సహా అందర్నీ వేళ్ళ మీద ఆడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ఇదే తరహా పెత్తనం నడిచినా… ఈ మధ్య కాలంలో మాత్రం వ్యవహారం శృతిమించిపోయిందని అంటున్నారు. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో పేరుకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అయినా… పెత్తనం మొత్తం పెండ్యాల అచ్చిబాబుదేనని చెప్పుకుంటున్నారు. అదీకూడా… ఎంతలా అంటే… ఓ కార్యక్రమం జరుగుతుంటే…. ఎమ్మెల్యేకు కనీసం ఓ కుర్చీ వేయాలని అధికారిక ప్రోటోకాల్‌నైనా పాటించాలన్న స్పృహ లేకుండా పోవడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చిబాబు ఎమ్మెల్యేని తన ఇంట్లో పాలేరని అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యమా? లేక జమీందారీ రాచరికం అనుకుంటున్నారా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు చాలామంది.
అసలు విషయం ఏంటంటే… కొవ్వూరు మండలం పశివేదలలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిన పెండ్యాల అచ్చిబాబు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. కానీ…. వేదిక మీద జమిందార్ అచ్చిబాబు పక్కన ఎమ్మెల్యేకి సీటు ఇవ్వలేదు. పైగా ఆయన నిలబడి ఉండటం కనిపించింది. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో… దళిత ఎమ్మెల్యేని దారుణంగా అవమానించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులైనా కూడా… దళితులంటే ఈ జమీందార్‌కి అంత చిన్న చూపా అంటూ సోషల్ మీధుల్లో దుమ్మెత్తి పోస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కొందరు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారట. చివరికి ఆహ్వాన పత్రికలో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పేరును ముందు పెట్టలేదంటే… కొవ్వూరు టీడీపీలో నూటికినూరు శాతం బానిస రాజకీయం కాకుండా ఇంకేం నడుస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయి పలు వర్గాల నుంచి. ఇంకొందరైతే… అసలు కొవ్వూరు ఎమ్మెల్యే ఎవరు? ఒక నియోజకవర్గానికి ఎంతమంది ఉంటారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. 2004 వరకు జనరల్ స్థానంగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీ రిజర్వుడు అయింది.
జనరల్‌లో ఉన్నప్పుడు దొమ్మేరు జమిందార్ వంశం నుంచే పోటీ చేసేవారు. ఇక 2009లో రిజర్వ్ అయ్యాక టీడీపీ తరపున ఎమ్మేల్యేగా టి .వి. రామారావు, 2014లో అదే పార్టీ నుంచి కేఎస్ జవహర్ గెలిచారు. మంత్రిగా పనిచేసిన జవహర్ దొమ్మేరు దివాణం పెత్తనాన్ని వ్యతిరేకించారు. అందుకే ఆయన ఇక్కడ వన్‌టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయారన్నది లోకల్ టాక్. టీవీ రామారావు అయితే… ఏకంగా పార్టీ వదిలి వెళ్లిపోయారు. జవహర్ 2019, 2024 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తిరిగి పోటీ చేయాలనుకున్నా… దివాణం జమీందారులే టికెట్ రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళతో విభేదించే నేతలకు కొవ్వూరులో రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పుకుంటారు. అందుకు జవహర్, రామారావునే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జమీందార్లకు ఒంగి, ఒంగి దండాలు పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… జవహర్‌కు టిడిపి అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు ఉండడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిలో ఉన్నారు. ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. కొవ్వూరులో జమీందారీతనాన్ని వ్యతిరేకించిన కేఎస్ జవహరే ఇప్పుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా ఉండటం యాదృచ్చికం. అలాగే ఎస్సీ ఎమ్మెల్యేని చిన్న చూపు చూస్తున్నారంటూ ఆయనకు ఫిర్యాదు వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో… జవహర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చిందని రియాక్ట్ అవుతారా? లేక వత్తిళ్ళకు తలొగ్గి కంప్లయింట్‌ని లైట్ తీసుకుంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. మొత్తంగా ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యేకి మించి అన్నట్టుగా నడుస్తున్న వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
