Off The Record: కాకినాడ కలెక్టరేట్‌లో అవినీతి ప్రకంపనలు

  • కాకినాడ కలెక్టరేట్‌లో అవినీతి ప్రకంపనలు..
  • ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌..
  • దాదాపు రూ.8కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు..
  • పదేళ్ళ నుంచి కదలకుండా తిష్ట వేసిన సీనియర్‌ అసిస్టెంట్‌..
  • ఆర్‌ఐగా కారుణ్య నియామకం, కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌..
  • జిల్లాలో డిప్యుటేషన్‌ మీద చాలా మంది అవినీతి అధికారులు..
  • మమ్మల్ని మార్చండని ప్రజాప్రతినిధుల దగ్గరికి పరుగులు..
  • 22ఏ రికార్డులు ట్యాంపర్‌ చేసిన శివ అండ్‌ గ్యాంగ్‌?..
  • ఎమ్మార్వో, ఆర్డీవోతో సంబంధం లేకుండా కలెక్టరేట్‌లో మార్పులు..
  • రికార్డ్‌ రూమ్‌ ఇన్ఛార్జ్‌గా కథ నడిపిన శివకుమార్‌..
  • కీలకశాఖ హెచ్‌వోడీతో కలిసి వైజాగ్‌లో హోటల్‌ నిర్మాణం..
Otr Kakinada Collectorate C

Otr Kakinada Collectorate C

Off The Record: కాకినాడ జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌లో ప్రస్తుతం ప్రకంపనలు రేగుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు ఇక్కడి నుంచి రెక్కలు కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోవాలని చేస్తున్న ప్రయత్నాల గురించి హాట్‌ హాట్‌ చర్చలు నడుస్తున్నాయి. అంతమాత్రాన ఆఫీస్‌లో వాళ్ళకేదో వేధింపులు ఉన్నాయనో, లేక పై అధికారులు సతాయిస్తున్నారనో కాదు. ఏళ్ల తరబడి తాము నిరాటంకంగా కొనసాగిస్తున్న అవినీతి బాగోతాల కథ క్లైమాక్స్‌కి చేరడంతో ఎవరికి వారు గుట్టు చప్పుడు కాకుండా సర్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శివకుమార్ పై ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌కు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు దాడులు నిర్వహించి దాదాపు 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. రికార్డ్ రూమ్ ఇంఛార్జ్‌ డ్యూటీలోఉన్నారాయన. 2016లో కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన శివకుమార్… 10 ఏళ్ల నుంచి కదలకుండా తిష్టవేశారు. భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడటంతో…ఇప్పుడు కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏసీబీ టెన్షన్ పట్టుకుందట. అందులోనూ…. డిప్యుటేషన్‌ బాపతు ఎక్కువ కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. శివకుమార్ కూడా… కాజులూరు మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు డిప్యుటేషన్ మీద కాకినాడ కలెక్టరేట్‌కు వచ్చారు. ఇలాంటి వాళ్ళు జిల్లాలో చాలామంది ఉన్నారట. కొందరైతే ఏకంగా సిపార్సు లేఖలు తెచ్చుకుని మరి డిప్యుటేషన్ మీద కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళలో ఎక్కువ మంది అవినీతి కథా నాయకులేనని, ఏ లాభం లేకుండా ఏళ్ళ తరబడి డిప్యుటేషన్‌ మీద ఎందుకు ఉంటారు, కొనసాగించమని పైరవీలు ఎందుకు చేస్తారన్నది సహజంగా వినిపిస్తున్న ప్రశ్న.

అయితే… ఏసీబీ దాడుల తర్వాత మారుతున్న పరిణామాలతో… ఇలాంటి ఉద్యోగులు కొందరు సెలవుపై వెళ్ళిపోయినట్టు తెలిసింది. మరికొందరు తమలెక్కలు ఎక్కడ బయట పడతాయోనని బిక్కు బిక్కుమంటున్నట్టు సమాచారం. అలాంటి వాళ్ళంతా తమకు టచ్ లో ఉండే ప్రజా ప్రతినిధుల దగ్గరికి పరుగులు పెడుతూ…మా స్థానాలు మార్చండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనని డ్యూటీకి వస్తున్న కొందరు కుదురుగా ఉండలేకపోతున్నారట. తమను మాతృ సంస్థలకు పంపేయాలని మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్‌ల డిప్యుటేషన్‌ను రద్దు చేశారు. వారికి పోస్టింగ్ ఎక్కడ వచ్చిందో అక్కడే పనిచేయాలని క్లారిటీ ఇచ్చారు. డిప్యుటేషన్‌ మీద అలా పాతుకుపోయిన వాళ్ళందర్నీ డివైడ్ చేసి వెనక్కి పంపేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారట. ఈ పరిస్థితుల్లో… ఇన్నేళ్ళు శివకుమార్‌తో అంటకాగిన కొందరు మాత్రం కుదురుగా ఉండలేకపోతున్నారట. అటు తిరిగి ఇటు తిరిగి ఇది తమ వైపు వస్తుందేమోనన్నది వాళ్ళ ఆందోళన. ఏసీబీ దర్యాప్తులో శివకుమార్‌ ఏవైనా పేర్లు చెప్తాడా? తర్వాత కేసు ప్రాసెస్ ఎలా ఉంటుందంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం.

×
×
Ad

కాకినాడ కలెక్టర్ ఈ మధ్యనే కొత్తగా రావడంతో… వోవరాల్‌గా సెట్ రైట్ చేసే పనిలో ఉన్నారన్నది ఉద్యోగుల మాట. జిల్లాలో విలువైన భూములకు సంబంధించి డాక్యుమెంట్స్ కొన్ని ట్యాంపర్‌ అయినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. 22ఏ నిషేధిత జాబితా నుంచి ల్యాండ్‌ సీలింగ్‌, భూదాన భూములను మినహాయించారు. ఒకవేళ అలా తొలగించాలంటే… పద్ధతి ప్రకారం ఎమ్మార్వో ఆఫీస్‌ నుంచి ఆర్డీవోకు, అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ఫైల్‌ రావాలి. కానీ.. ఇక్కడ ఏఅలా జరక్కుండా డైరెక్ట్‌గా కలెక్టరేట్‌లోనే రికార్డుల్ని తారుమారు చేశారట. అధికారులతో కలిసి రికార్డ్‌ రూమ్‌ ఇన్ఛార్జ్‌గా ఉన్న శివకుమార్‌, మరికొందరు ఉద్యోగులు ఈ వ్యవహారాలను నడిపినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు గతంలో కలెక్టరేట్లో కీలకంగా ఉన్న ఒక శాఖ హెచ్ ఓ డీ కుమారుడితో కలిసి శివ కుమార్ వైజాగ్ లో హోటల్ నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ హెచ్‌వోడీ ఇక్కడ లేకపోయినప్పటికీ… ఈ వ్యవహారాలను క్లోజ్‌గా వాచ్ చేస్తున్నారట. అలాగే కలెక్టర్‌ ఆఫీస్‌ ఆర్థిక వ్యవహారాల్లోనూ అవకతవకలు జరిగాయంటున్నారు ఉద్యోగులు. బోగస్ కంపెనీని సృష్టించి, దాని ద్వారా కావాల్సిన ఐటమ్స్ కొనుగోలు చేసి, ఆ పేరుతో బిల్లులు ఇచ్చి డబ్బులు నొక్కేసిన వాళ్ళు కొందరు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వాటిపై కూడా అంతర్గత విచారణ జరుగుతోందని అంటున్నారు. మొత్తానికి ఏసీబీ అటాక్‌తో కాకినాడ జిల్లాలో ఉద్యోగులు కుదురుగా ఉండలేకపోతున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌. శివ కుమార్ స్ట్రోక్‌తో ఆ గాలి తమ వైపు ఎక్కడ మళ్ళుతుందోనన్నది అందరి కంగారు.