NTV Telugu Site icon

Off The Record: ఏపీలో కూటమి నేతల వైరం..! ఎక్కడ మొదలైంది ?

Jc Vs Bjp

Jc Vs Bjp

Off The Record: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వృధాగా పోయే ఫ్లైయాష్.. రెండు పార్టీల మధ్య వైరానికి దారి తీసింది. ఆ రెండు కుటుంబాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవే. కాంట్రాక్ట్ పనుల విషయంలో ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఎంతవరకైనా వెళ్తాం.. తగ్గేదేలే అంటోంది జేసీ వర్గం. మా ప్రాంతంలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పొలిటికల్ హీట్ పెంచారు. సీఎం చంద్రబాబు హెచ్చరించినా ఇరువురు నేతలు తగ్గలేదు. చివరకు తన వళ్ల అల్ట్రాటెక్ యాజమాన్యం, అందులో పనిచేసే కార్మికులు, ఫ్యాక్టరీప్తె ఆధారపడి జీవిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారంటూ మీడియా ముఖంగా జెసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. ఆర్టీపీపీలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 5వేల టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది. ఇందులో 40% బూడిదను టెండర్ల ద్వారా వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. మిగిలిన 60 శాతం బరువైన బూడిదను…పైపులు ద్వారా చెరువులోకి తరలిస్తారు. చెరువులో నీటి ద్వారా వచ్చి చేరిన బూడిదకు.. ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సిమెంట్ ఉత్పత్తిలో పాండ్‌యాష్‌కు డిమాండ్ పెరగడంతో బూడిద గోల మొదలైంది. ఉచితంగా లభించే చెరువులోని బూడిద కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలు సొమ్ము చేసుకోవడం కామన్‌. ఆర్టీపీపీ నుంచి విడుదల అయ్యే బూడిదలో రెండు రకాలు. డైరెక్ట్ ట్యాంకర్లకు లోడ్ చేసేది గ్రేడ్ వన్. రెండోది చెరువులో వృధాగా పోయేది. ఈ చెరువులో వృధాగా పోయే బూడిద కోసమే జెసి ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య వార్ జరుగుతోంది. ఇద్దర్ని ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెచ్చరించాల్సి వచ్చింది.

మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన నూ ఇయర్‌ వేడుకలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. మహిళలకు మాత్రమే ప్రవేశం అంటూ జెసి పార్కులో వేడుకలు నిర్వహించడంతో రచ్చ షురూ అయింది. ఇటీవల తాడిపత్రి ప్రాంతంలో గంజాయి విక్రయాలు పెరిగాయి. బీజేపీ నేతలు సినీనటి మాధవీలత, యామినీశర్మ…ఈ ఈవెంట్‌లో పాల్గొనవద్దని…అక్కడ మహిళలకు సేఫ్ కాదని సూచించారు. గంజాయి బ్యాచ్ ఏదైనా దాడులు చేస్తే దానికి బాధ్యులు ఎవరని వారు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జేసీ స్పందించలేదు. కానీ ఆయన వర్గీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా బిజెపి మహిళలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాధవీలతపై ఫిర్యాదు చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండగానే…అనంతపురంలో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జెసి దివాకర్ ట్రావెల్స్ బస్సులను భారీగా సీజ్ చేశారు. దీంతో వాటన్నింటిని షెడ్డుకే పరిమితం చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న దివాకర్ ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇది మరో బస్సుకు వ్యాపించే లోపు అప్రమత్తమై.. మంటలు ఆర్పీ వేశారు.

బస్సు కాలిపోవడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇదంతా చేసింది బిజెపి నేతలేనంటూ కుండబద్దలు కొట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్లనో మరో దాని వల్లో ఇది జరగలేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో తమ బస్సులు మాత్రమే ఆపారని…ఇప్పుడు బిజెపి నేతలు కాల్చివేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జగనే మేలు కదరా అంటూ బీజేపీకి చురకలంటించారు. మాధవీలత, యామినీ శర్మ వ్యాఖ్యలకు…తన స్టైల్‌లో కౌంటర్ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్‌ సెటైర్లు వేశారు. మాధవీలత మహిళల జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారని…ఎవరు బట్టలు వేసుకోవాలో జేసీ చెప్తారా ? అంటూ ప్రశ్నించారు. జగన్‌పై ప్రేమ ఉంటే ఆయన దగ్గరికే వెళ్లవచ్చని సత్యకుమార్‌ కామెంట్స్‌ చేశారు. అటు జేసీ ప్రభాకర్‌రెడ్డి…ఇటు బీజేపీ నేతలు ఎవరు తగ్గకపోవడంతో…మున్ముందు ఈ పాలిటిక్స్‌ ఎన్ని మలుపులు తీసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది.

Show comments