Site icon NTV Telugu

Off The Record: వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్‌లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారా..? ఫోకస్ పెట్టలేదా..?

Otr Atp Ysrcp

Otr Atp Ysrcp

Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి సీన్‌ రివర్స్‌ అవుతోందనే టాక్‌ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత అన్ని జిల్లాల్లోని నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఇంఛార్జ్‌లు అందరూ కాస్త యాక్టివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాలకు అసలు ఇంఛార్జ్‌లు ఎక్కుడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం. హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జిగా గత ఎన్నికల ముందు శాంతమ్మను నియమించింది పార్టీ హైకమాండ్‌. ఆమెకు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. వాస్తవంగా శాంతమ్మ మన రాష్ట్రమే కాదనేది స్థానికుల మాట. అది వేరే విషయం అనుకోండి. కర్ణాటక ప్రాంతంలో ఒకప్పుడు ఆమె ఎంపీగా పనిచేశారు. అయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటూ గత ఎన్నికల్లో ఆమెకు హిందూపురం టికెట్ ఇచ్చారని అప్పట్లో పొలిటికల్‌ సర్కిల్స్‌లో ప్రచారం నడిచింది. ఎన్నికల ముందు కాస్త యాక్టివ్‌గానే కనిపించారట శాంతమ్మ. అందరు నాయకులతో కలిసి ఆమె ప్రచారం కూడా చేశారనే పేరుండేది. ఐతే…ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించకుండా పోయారు. వాస్తవంగా ఒకటి రెండుసార్లు మాత్రమే జిల్లాలో కనిపించారట. అది కూడా ఏ కొద్ది మందికో. ఆ తర్వాత నుంచి ఆమె ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి వైసీపీలో ఉందట.

Read Also: CM Chandrababu Ayodhya Visit: రేపు అయోధ్యకు సీఎం చంద్రబాబు

ఇక అనంతపురం పార్లమెంటు విషయానికొస్తే..2019 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా తలారి రంగయ్య గెలిచారు. 2024 ఎన్నికల్లో తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీకి పంపించింది పార్టీ హైకమాండ్‌. పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహించే మాజీమంత్రి శంకర్ నారాయణపై అక్కడ వ్యతిరేకత ఉందనేది స్థానికంగా ఉండే పార్టీ నేతల మాట. అయినప్పటికీ ఆయనను అనంతపురం ఎంపీగా బరిలోకి దింపారు. పార్లమెంట్ ఇంఛార్జిగా కూడా అవకాశం ఇచ్చారు. వాస్తవంగా వైసిపి ఆవిర్భావం నుంచి శంకర్ నారాయణ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఏకంగా 12ఏళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూసినా…2019 ఎన్నికల్లో గెలిచిన ఆయనను మంత్రి పదవి కూడా వరించింది. మంత్రి అయిన తర్వాత శంకర్ నారాయణ చేసుకున్న కొన్ని స్వీయ తప్పిదాల వల్లే నష్టం జరిగిందని సమాచారం. అందుకే జగన్ రెండో క్యాబినెట్లో శంకర్ నారాయణకు పదవి పోయిందని తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఆయన్ను ఏకంగా నియోజకవర్గం నుంచి తప్పించి..అనంతపురం పార్లమెంటుకు పంపింది వైసీపీ హైకమాండ్‌.

ఇది తనకు ఏమాత్రం ఇష్టం లేదని శంకర్ నారాయణ సన్నిహితుల వద్ద చెప్పుకునేవారట. ఆఖరుకు అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. శంకర్ నారాయణ భారీ ఓటమి చవిచూడాల్సి పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత శంకర్ నారాయణ తిరిగి పెనుకొండ వెళ్లాలని చూశారనే టాక్‌ నడిచింది. కానీ అప్పటికే అక్కడ ఉషశ్రీచరణ్ పాతుకుపోయారు. దీంతో శంకర్ నారాయణ అటు పార్లమెంట్ బాధ్యతలు ఇష్టం లేక.. ఇటు పెనుకొండను వదులుకోలేక పొలిటికల్‌గా సైలెంట్‌ అయ్యారట. 18నెలలుగా అనంతపురం పార్లమెంటుకు ఇంఛార్జి ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులుగా పార్లమెంట్ ఇంఛార్జిలు లేకుండానే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ అధిష్ఠానం మాత్రం ఇప్పటివరకు అసలు పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్టే లేదన్న చర్చా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇటు టీడీపీ మాత్రం ఆల్రెడీ పార్లమెంట్ అధ్యక్షులను ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీలు కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత హైకమాండ్‌పై ఉందనే చర్చ జరుగుతోంది.

Exit mobile version