Site icon NTV Telugu

Off The Record: కొత్త పంధాలో ఉండవల్లి అరుణ్ కుమార్..? బీజేపీ మీదికి ఫోకస్ షిఫ్ట్..!

Off The Record Undavalli

Off The Record Undavalli

Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పంథా ఎంచుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. సాధారణంగా ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్‌ పట్టుకుంటే ఆ లోతుల్లోకి వెళ్ళి తవ్వకాలు జరిపి అవశేషాలను కూడా వెలికి తీస్తుంటారు. అవతలోళ్ళని గిల్లి గిచ్చి… ఓరి బాబోయ్‌…. వద్దు. నీకో దండం అనేలా చేస్తుంటారన్నది విస్తృతాభిప్రాయం. ఆ క్రమంలోనే ఇప్పుడు తన ఫోకస్‌ బీజేపీ మీదికి షిఫ్ట్‌ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. వ్యక్తిగా ఉండవల్లి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఢీ కొట్టడం అంత తేలికైన విషయమేం కాదు. అయినాసరే… సైసై చర్చకు సిద్ధమంటూ తొడగొట్టడం ఆసక్తి రేపుతోంది. దీని వెనక పబ్లిసిటీ యావ ఉందా? లేక వేరే ప్రయోజనాలు ఆశిస్తున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. రెండు నెలల క్రితం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఆ సందర్భాన్ని వాడుకుని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై తీవ్ర విమర్శలు చేశారాయన. తాజాగా డిసెంబర్ 6న బాబ్రీ ఉదంతాన్ని గుర్తు చేస్తూ…బీజేపీ హిందుత్వ విధానాలను విమర్శించారు. అసలు సనాతన ధర్మాన్ని బీజేపీనే చెడగొడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ.

గతంలో ఆర్ఎస్ఎస్ వాదిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. .ఆ సిద్ధాంతాలు నచ్చకే తాను బయటికి వచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు ఏదో ఒక సందర్భం చూసుకుని, ఇంకేదో కారణం చెబుతూ… ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతాల గురించి చర్చ పెట్టడమంటే… పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతివ్వడమేనన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. గతంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న ఉండవల్లి… రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయినాసరే… పాత వాసనలు పోక… ఇప్పుడు ఏదో రకంగా బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంలపై చర్చ పేరుతో ఒక రచ్చ లేపి తన వ్యక్తిగత పబ్లిసిటీతో పాటు కాంగ్రెస్‌కు మేలు జరిగేలా తనవంతు సహకారం అందించాలనుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇలాంటి వ్యాఖ్యలతో ఉండవల్లి తిరిగి సొంత గూటికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారా అన్న డౌట్స్‌ సైతం వస్తున్నాయట కొందరికి. అదే సమయంలో మరోసారి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆయన చెప్పిన మాటల్ని సైతం గుర్తు చేసుకుంటున్నా…. ఏమో, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీ కంట్రోల్‌లో ఉన్నాయని ఉండవల్లి తరచూ చెబుతుంటారు.‌ ఆ మూడు పార్టీలు ఎలాగూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేవు కాబట్టి… ఆ రోల్‌ తాను తీసుకోవాలని మాజీ ఎంపీ అనుకుంటున్నారా అన్నది ఇంకొందరి అనుమానం.

మరోవైపు… కామ్‌గా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడితే కదా… ఉనికిలో ఉండేదన్న ఉద్దేశ్యంతోనే ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలంటూ కొత్త పల్లవి అందుకున్నారని అనే వాళ్ళు సైతం లేకపోలేదు. అటు ఉండవల్లి వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో బిజెపి శ్రేణులు ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఏపీ లీడర్స్‌ స్పందన ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు రాజమండ్రికే చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారాయన. అందుకు అరుణ్‌కుమార్‌ కూడా సై అనడంతో ఆసక్తి పెరిగింది. బహిరంగ చర్చకు వేదికను ఎక్కడ ఖరారు చేయాలన్న విషయమై సోము వీర్రాజు ట్రయల్స్‌ వేశారట కూడా. కానీ… ఇంకా చర్చ మాత్రం జరగలేదు. తాజాగా ఉండవల్లి మరోసారి తీవ్ర విమర్శలు చేయడంతో సోము కూడా రంగంలోకి దిగుతారా? లేక లైట్‌ తీసుకుంటారా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజమండ్రిలో. సై అంటే సైసై అనుకుంటూ ఒకవేళ వీళ్లిద్దరూ తొడలు కొట్టుకున్నా… మత పరంగా సున్నితమైన అంశం కావడంతో… అసలు పోలీసులు అనుమతిస్తారా అన్నది అన్నిటికంటే పెద్ద అనుమానం. మొత్తం మీద రాజమండ్రి ముదురు నాయకుల రగడకు ముగింపు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version