Off The Record: ఏడాదిన్నరక్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో కూటమి నేతల్లో జోష్ నెలకొంది. ఐదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతలు, కార్యకర్తలందరూ సంతోషంలో మునిగిపోయారు. మొదటి ఆరునెలలు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కూటమి నేతల్లో ఆధిపత్య పోరు మొదలయ్యింది. అందులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో టీడీపీలో నెలకొన్న విబేధాలు, ఆధిపత్యపోరు చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ ఆవిర్భావం తర్వాత నర్సరావుపేట టీడీపీకి కంచుకోటగా మారింది. వరుసగా ఐదుసార్లు నర్సరావుపేటనుంచి కోడెల శివప్రసాదరావు విజయం సాధించారు. అయితే 2004 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ వరుస విజయాలకు బ్రేక్ పడింది. అది 2009, 2014, 2019లోనూ టీడీపీ గెలవలేకపోయింది. అయితే, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అరవిందబాబు వైసీపీ అభ్యర్ది గోపిరెడ్డిపై ఘనవిజయం సాధించారు. దీంతో నర్సరావుపేటపై రెండు దశాబ్దాల తర్వాత మరోసారి టీడీపీ జెండా ఎగిరింది. అయితే టీడీపీ గెలిచిందన్న ఆనందం ఎన్నో నెలలు నిలవలేదు. బీసీ సామాజివకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అరవిందబాబుకు స్థానిక టీడీపీ నేతలకు మధ్య సఖ్యత లేకపోవడం ఇబ్బందిగా మారింది. నర్సరావుపేట టికెట్ ఆశించిన కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యే అరవిందబాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సదరు నేతలు పెద్దగా సహకరించడంలేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు నేతలు, ఎమ్మెల్యేలు సహకరించినా పెత్తనం తమకే ఇవ్వాలని చెప్పడమే కాకుండా అన్ని వ్యవహారాలు వాళ్లే చూస్తూ ఎమ్మెల్యేను డమ్మీ చెయ్యాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది.
ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా నర్సరావుపేట నియోజకవర్గంలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ బీసీ సామాజికవర్గానికి చెందిన గళ్లా మాధవి అనుహ్యంగా సీటు దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాజీ మంత్రి విడదల రజినిపై 50వేలకుపైగా రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. మాధవి భర్త కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అయితే గుంటూరు పశ్చిమలోకూడా మొదటి ఆరునెలలు అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా తర్వాత ఆధిపత్యపోరుతే నేతల మధ్య విబేధాలు మొదలయ్యాయి. జిల్లాకేంద్రంతో పాటు కీలకమైన నియోజకవర్గం కావడంతో జిల్లాకు చెందిన కీలక నేతలంతా ఈ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఏ పని చెయ్యాలన్నా ఆయా నేతల రికమండేషన్లు వస్తూ ఉంటాయి. నియోజకవర్గంలో ఇతర నేతల పెత్తనాన్ని ఎమ్మెల్యే మాధవి ఒప్పుకోకపోవడంతో విబేధాలు మొదలయ్యాయి. ప్రతి పనిలోనూ ఎమ్మెల్యే ఒకటి అంటే టీడీపీ నేతలు మరొకటంటూ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల వ్యవహారంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ లతో ఎమ్మెల్యే మాధవికి జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికలు కూడా నిలిపివెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందంటే టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు ఏస్థాయికి చేరిందో అర్దమవుతుంది.
కొంతమంది టీడీపీ నేతల మద్దతు ఉండటంతో కీలకమైన అధికారులు కూడా ఎమ్మెల్యే మాధవిని లెక్క చెయ్యడంలేదట. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు చేస్తుండటంపై ఎమ్మెల్యే మాధవి మండిపడ్డారు కూడా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తనకు తెలియకుండా మేయర్, గుంటూరు కార్పోరేషన్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది అధికారుల తీరుపై కూడా మండిపడ్డారు. కొందరు టీడీపీ కీలక నేతలు కూడా మాధవిని టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో రాజకీయాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా రెండు నియోజకవర్గాల్లో బీసీ ఎమ్మెల్యేలతో సొంతపార్టీ నేతలకు విబేధాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.
