Site icon NTV Telugu

Off The Record: ఆ 3 మున్సిపాలిటీలే ఎందుకంత ప్రత్యేకం.. బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ ఎందుకు ఫోకస్‌ పెట్టాయి..?

Gajwel Toopran And Sircilla

Gajwel Toopran And Sircilla

Off The Record: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్‌ మెల్లిగా పెరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు నామినేషన్లు పూర్తిచేసుకుని ప్రచార పర్వంలోకి అడుగుపెడుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహరచన చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడేనని అధికార పార్టీ చెప్పుకుంటుంటే…. ప్రతిపక్షం కూడా గట్టిగానే పోరాడామని, అనుకున్నదానికంటే మంచి ఫలితాలే వచ్చాయని ఫీలవుతోంది.ఈసారి మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో కూడా ఎక్కువ సీట్లు కొడతామన్నది గులాబీ నేతల విశ్వాసం. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గాలపై ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ నియోజకవర్గం పరిధిలో గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉండగా,.. కేటీఆర్‌కు సిరిసిల్ల మునిసిపాలిటీ ఉంది. దీంతో… ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో సమీకరణలు ఎలా మారబోతున్నాయన్న చర్చలు నడుస్తున్నాయి. మిగతా మున్సిపాలిటీలు ఒక ఎత్తయితే…. ఈ మూడింటిని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగానే చూస్తున్నాయి. గజ్వేల్, తూప్రాన్‌లో పట్టు జారకుండా బీఆర్‌ఎస్‌ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. స్వయంగా పార్టీ ముఖ్యనేత హరీష్‌రావు ఈ మున్సిపాలిటీలకు ప్రత్యేక ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. ఇక రెండిటికీ విడివిడిగా ఇద్దరు పార్టీ సీనియర్స్‌ని ఇన్ఛార్జ్‌లుగా నియమించింది అధిష్టానం.

మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. అవి పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాదు కాబట్టి అప్పుడు పెద్దగా దృష్టి సారించలేదని సర్ది చెప్పుకున్నారు గులాబీ నేతలు. కానీ….ఈసారి అలా కాదు. మున్సిపల్‌ ఎలక్షన్స్‌ పార్టీ సింబల్స్‌తో జరుగుతాయి. పైగా… అధినేత కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలు కాబట్టి అందరి చూపు ఇటువైపు ఉంది. ఇక్కడ బీజేపీ అనుకున్న స్థాయిలో లేనప్పటికీ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. స్వయంగా కేసీఆర్‌ ప్రాతినిధ్యం నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలను గెలుచుకోవడం ద్వారా…. బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేయవచ్చన్నది అధికార పార్టీ ప్లాన్‌గా తెలుస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో…గజ్వేల్‌, తూప్రాన్‌లను చేజిక్కించుకోవాల్సిందేనని పావులు కదుపుతున్నట్టు సమాచారం. కానీ… మా అడ్డాలో కాంగ్రెస్ ఎత్తుల్ని చిత్తు చేస్తామన్నది బీఆర్‌ఎస్‌ నేతల ధీమా. అందుకోసం పూర్తి స్థాయి గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నారట గులాబీ లీడర్స్‌. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీ పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ మున్సిపాలిటీ మీద బీజేపీ సీనియర్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ ప్రభావం తక్కువే అయినా….ప్రధాన పోరు బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య జరగవచ్చంటున్నారు. పార్టీ సీనియర్ నాయకురాలు తుల ఉమను ఇక్కడ ఇన్చార్జ్‌గా పెట్టి కేటీఆర్ అంతా తానై నడిపిస్తున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి నామినేషన్స్‌ దాఖలు వరకు అన్నిటినీ స్వయంగా కేటీఆర్‌ పర్యవేక్షించారు. మొత్తం 39 డివిజన్స్‌ ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీని ఎలాగైనా గెల్చుకుంటామన్నది బీఆర్ఎస్‌ ధీమా. మేజిక్‌ మార్క్‌కంటే ఎక్కువ సీట్లే కొడతామంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా సై అంటే సై అన్నట్టు ఉండటం ఉత్కంఠ రేపుతోంది. వేరే మున్సిపాలిటీల సంగతి ఎలా ఉన్నా…. అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం మున్సిపాలిటీలు చేజారకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్‌, బీజేపీ కూడా ఈ మూడు మున్సిపాలిటీల మీద ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకోవడంతో…. పుర పోరు రసవత్తరంగా మారుతోంది.

Exit mobile version