Off The Record: విశాఖలో ‘పొత్తు’ తిరుగుడు పాలిటిక్స్ ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన సర్దుబాట్లు కొత్త పంచాయితీలకు కారణమవుతున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా గ్లాస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ తరహా సమస్యలు పెరుగుతుండగా విశాఖ దక్షిణంలో మాత్రం కొత్త రకం మంట అంటుకుంటోందట. కీలకమైన నియోజక వర్గంలో అంతర్గత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేనకు చెందిన వంశీకృష్ణ కాగా టీడీపీ ఇన్చార్జ్‌గా సీతంరాజు సుధాకర్ ఉన్నారు. అధి కారంలోకి వచ్చిన మొదట్లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచినప్పటికీ తర్వాత కాలంలో పరిస్థితులు చక్కబడ్డట్టు కనిపించాయి. కానీ… ఇప్పుడీ సెగ్మెంట్ టీడీపీ కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి చర్చనీయాంశంగా మారుతోంది. ఇక్కడ పట్టు బిగించేందుకు జనసేన తాపత్రయపడుతుంటే….ఆల్రెడీ సంస్ధాగతంగా పటిష్టమైన చోట మరింతగా పుంజుకునే ప్లాన్‌లో ఉంది తెలుగుదేశం. దీంతో రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నేతల మధ్య పోటీ పెరిగిపోతూ… నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే వంశీ దక్షిణ నియోజకవర్గానికి నాన్ లోకల్. ఆఖరి నిముషంలో వైసీపీ నుంచి గ్లాస్ పార్టీలోకి జంప్ కొట్టి…రికార్డు మెజార్టీతో ఎమ్మెల్యే అయిపోయారు. ఎటువంటి అంచనాలు లేకుండా ఇక్కడ పోటీకి దిగిన జనసేన భారీ విజయం వెనక పవన్ కల్యాణ్ చరిష్మా,టీడీపీ సంస్ధాగత బలం ఉన్నాయన్నది విశ్లేషకుల మాట.
నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఫోకస్డ్‌గా పనిచేస్తున్నారనే ఫీడ్ బ్యాక్ వుంది. కానీ, రాజకీయంగా తాను నిలదొక్కుకోవడం కోసం టీడీపీ కేడర్, లీడర్స్ విషయంలో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. 2014, 2019లో రాజకీయ అనుకూల, ప్రతికూలతల మధ్య ఈ స్ధానాన్ని తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంది. జగన్ వేవ్‌లోనూ…. టీడీపీ అభ్యర్ధిగా వాసుపల్లి గణేష్ కుమార్ దాదాపు 18వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తర్వాత వాసుపల్లి వైసీపీ తీర్ధంపుచ్చుకున్నప్పటికీ టీడీపీ కేడర్ మాత్రం చెక్కుచెదర లేదు. ఐతే, ప్రస్తుతం ఎమ్మెల్యే కూటమిలోని మిగతా పార్టీలకు న్యాయం చేయడం లేదని, ప్రత్యేకించి తన గెలుపునకు సహకరించిన టీడీపీ క్యాడర్‌కు అస్సలు అందుబాటులో ఉండడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. అలాగే…. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సైకిల్ పార్టీ నాయకుల్లో అసంత్రుప్తి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో…. దక్షిణం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ మీద ఒత్తిడి బాగా పెరిగిపోతోందట. ఎంపీ శ్రీభరత్‌కు సన్నిహితుడన్న పేరున్నా, పార్టీ పవర్లో వుండి కూడా ఎమ్మెల్యే స్ధాయిలో పనులు చేయించలేకపోతున్నారంటూ మండిపడుతున్నారు స్థానిక నాయకులు. దీంతో వ్యవహారం హైకమాండ్ వరకు వెళ్ళినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇటీవల అధినాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గంలో దూకుడు పెంచాలని, సంస్ధాగతంగా మరింత బలోపేతం అవ్వడంపై ద్రుష్టిసారించాలని నిర్ధేశించినట్టు సమాచారం. ఆ ఆదేశాల కారణంగానే…. సంక్రాంతి వేడుకలను టీడీపీ, జనసేన పోటాపోటీగా నిర్వహించినట్టు చెప్పుకుంటున్నారు. పైకి చూడ్డానికి పండగ వాతావరణమే కనిపించినా…. కలిసిమెలిసి కాన్సెప్ట్ మిస్ అవ్వడం చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ దక్షిణం నుంచి టీడీపీనే పోటీ చేస్తుందని ఇప్పటికే తమ్ముళ్ళకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు వైసీపీ కూడా ఇక్కడ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తూ జనం మధ్యన ఉండే ప్రయత్నం చేస్తున్నారాయన. ఈ పరిస్ధితుల్లో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో టీడీపీ, జనసేన కలిసి పని చేయకపోయినా….ఒకరి ప్రయోజనాలను మరొకరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఇద్దరికీ జాయింట్ నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కూటమి కేడర్‌లో.
