Site icon NTV Telugu

Off The Record: ఆ మాజీ డిప్యూటీ సీఎం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా..? వైసీపీలో పడరాని పాట్లు పడుతున్నారా..?

Narayana Swamy

Narayana Swamy

Off The Record: వైసీపీలో గ్రూప్‌ పాలిటిక్స్‌కు అడ్డాగా మారిపోయింది జీడీనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత… మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి రివర్స్‌లో ఉంటోందట. గడిచిన ఐదేళ్ళ నుంచి ఆయనకు మొత్తం అపసవ్య దిశలోనే తిరుగుతోందంటున్నారు. ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసినప్పుడు ఎటువంటి తలనొప్పులు పడని నారాయణ స్వామి….తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… ఇంకా చెప్పాలాంటే డిప్యూటీ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రం సంగతి తర్వాత…. సొంత నియోజకవర్గంలోనే ఐ మ్యాక్స్‌ రేంజ్‌లో సినిమా కనిపించిందట. 2019 ఎన్నికల గెలిచినప్పటి నుండి గ్రూపుల గోలతో సతమతం అవుతున్నారాయన. ఈ మాటను చాలాసార్లు స్వామే స్వయంగా చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం,కార్వేటినగరం మండలాల్లోని గ్రూపు రాజకీయాలు గత పంచాయతీ ఎన్నికల టైంకి పీక్స్‌కు చేరాయి. మీరు మారాలి, మరాలంటూ.. పదేపదే నారాయణ స్వామి విజ్ఞప్తి చేసినా… ఏ మాత్రం లెక్క చేయలేదు అక్కడి కార్యకర్తలు… ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ సలహాదారుగా పనిచేసిన మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, నారాయణ స్వామి వర్గాల మధ్య అంతర్గత విభేదాలు ఓరేంజ్‌లో సాగాయి.

అసెంబ్లీ ఎన్నికల టైంకి అవి పెరిగి పెద్దదవడంతో… ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణస్వామిని నియోజకవర్గ నుండి తప్పించి చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని కోరింది వైసీపీ అధిష్టానం. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నారాయణస్వామి నేను వెళ్ళనంటే వెళ్లనంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. పార్టీలో అంతా రెడ్లదే రాజ్యం అయిపోయిందంటూ విమర్శలు దాడి చేయడం అప్పట్లో సంచలనమైంది. అయితే రకరకాల కారణాలతో చివరికి తన కుమార్తె కృపా లక్ష్మికి జీడీ నెల్లూరు టిక్కెట్‌ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు నారాయణస్వామి. కానీ… 40 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారామె. ఇక ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న నారాయణస్వామి వ్యతిరేకవర్గం నేతలంతా…. ఇప్పుడు ఒక్కొక్కరుగా తిరిగి స్వరం సవరించుకుంటున్నారట. నియోజకవర్గంలో నారాయణస్వామి కుటుంబానికి అస్సలు అవకాశమే లేకుండా చేయాలని ఓ వర్గం బలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి జ్ఞానేందర్ రెడ్డి వర్గం వెనక నుంచి సహకరిస్తోందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఓ వైపు నారాయణస్వామి రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోగా… ఆయన కూతురు కృపా లక్ష్మి సైతం అందర్నీ కలుపుకొని పోవడం లేదంటూ గుర్రుగా ఉన్నారట వ్యతిరేక వర్గం నేతలు. ఆమెనే ఇన్చార్జిగా కొనసాగిస్తే… రేపు స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి కూడా ఎవరూ ఉండరని బహిరంగంగానే చెబుతున్నారు వ్యతిరేకవర్గం నాయకులు. దీంతో వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వం కోసం ఇప్పటినుంచే కొందరు లోకల్‌ లీడర్స్‌ ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం. కొందరు కీలక నేతలు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారట‌‌‌. అందులో భాగంగానే… వారం క్రితం పాలసముద్రం మండలంలో ఆరు మండలాల నాయకులతో గంగాధర నెల్లూరు మండల వైసీపీ సీనియర్ నాయకుడు సాంబశివారెడ్డి రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలిసింది.

కృపా లక్ష్మి గనుక ఇన్చార్జిగా కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని, ఆమె కనీసం లోకల్ ఎమ్మెల్యే థామస్ చేస్తున్న అవినీతి అక్రమాల మీద కూడా పోరాటం చేయకుండా సైలెంట్‌గా ఉండడంలో అర్థమేంటంటూ ప్రశ్నించారట. కనీసం స్థానిక నాయకులతోనూ ఇన్ఛార్జ్‌కు సంబంధాలు సరిగా లేవని, ఇంకా ఆమెనే గనుక కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అంతా అబిప్రాయపడ్డట్టు సమాచారం. కృపాలక్ష్మిని తప్పించి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలన్న క్రమంలో… మాజీమంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పేరు ప్రస్తావనకు వచ్చిందట. కొందరు నాయకులు ఆయన పేరు ప్రతిపాదిస్తే… మరికొందరు మాత్రం గత ఎన్నికల్లో నారాయణ స్వామిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన మేనల్లుడు రమేష్ తిరిగి వైసీపి వచ్చే అవకాశం ఉందని, అతనికే అవకాశం ఇస్తే పాత పరిచయాలతో మరింత దూకుడుగా వెళ్ళవచ్చని చెప్పారట. కొత్తగా వచ్చేది ఎవరైనా… ఇలా ఎవరికి వారు నారాయణ స్వామిని తప్పించే విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నారట. ఇలా వ్యతిరేక వర్గం మొత్తం ఒక్క మాట మీదికి రావడంతో స్వామి శిబిరంలో కలకలం రేగినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఐదేళ్లపాటు వ్యతిరేక వర్గం నుంచి సమస్యలు ఎదుర్కొన్న నారాయణ స్వామికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయట వ్యతిరేక గ్రూపులు.

Exit mobile version