Off The Record: జయశాంతి…. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్. తన పరిధి కానప్పటికీ… సామర్లకోటలోఈ నెల 17న చంటి బిడ్డని ఎత్తుకుని మరీ…. ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాగా పాపులర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధతను కొనియాడుతూ అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఏపీ హోం మంత్రి అనిత అయితే… స్వయంగా మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి సూపర్ పోలీస్ అంటూ ప్రశంసించారు. అక్కడితో ఆగకుండా… కానిస్టేబుల్ కుటుంబాన్ని తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కి పిలిచి మరీ సత్కరించారు. అంతవరకు బాగానే ఉంది. కానిస్టేబుల్‌గా జయశాంతి చేసిన పని, అందుకు హోం మంత్రి రియాక్షన్, అభినందనలు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలోని కథ కీలకమైన మలుపు తిరిగింది. విషయం తెలిసి అంతకు ముందు ఆహా ఓహో అన్నవాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టారట. ఈ జయశాంతి ఎవరా… అని సొంత డిపార్ట్‌మెంట్‌లోని వాళ్ళే ఉత్సాహంగా ఆరాతీస్తే…. కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వచ్చి చివరికి హోం మంత్రి కూడా ఇరకాటంలో పడ్డట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నిర్వహించిన డీఎస్సీ ఎగ్జామ్‌లో దొంగ సర్టిఫికెట్స్‌పెట్టి జయశాంతి టీచర్ ఉద్యోగం పొందారామె. జయశాంతి భర్త తాతారావు కూడా కానిస్టేబుల్. డీఎస్సీ అప్లికేషన్‌లో అతని సంపాదనను దాచి… తన తండ్రిని సంరక్షకుడిగా చూపిస్తూ…. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు విద్యాశాఖ అధికారుల వెరిఫికేషన్‌లో నిర్ధారణ అయింది. ఆ కోటాలోనే టీచర్ ఉద్యోగం పొందగా…. విచారణ జరిపి ఆ టీచర్ ఉద్యోగాన్ని రద్దు చేశారు డీఈవో. ప్రభుత్వాన్ని మోసం చేసినందుకుగాను చర్యలు తీసుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు కూడా. ఇక గతంలో రైల్వే కానిస్టేబుల్‌గా పనిచేసేవారు జయశాంతి. ఆ సమయంలో కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్… ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి, తన పేరుతో ఎస్సైగా ఐడీ కార్డ్ చేయించుకుని దందాలు మొదలుపెట్టాడు. దానికి సంబంధించి కామేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. అతనికి జయశాంతి సపోర్ట్ ఉందని డిపార్ట్‌మెంట్ విచారణలో తేలడంతో…ఆమెను లా అండ్ ఆర్డర్ కు బదిలీ చేశారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న జయశాంతి భర్త తాతారావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పల్నాడు ఎస్పీఎఫ్‌కు బదిలీ చేశారు. లేడీ కానిస్టేబుల్ వ్యవహారం ఈ స్థాయిలో ఉంటే… అవేమీ ఎంక్వైరీ చేసుకోకుండా హోం మంత్రి అనిత కేవలం ఒక్క వీడియో చూసి ఆ ఫ్యామిలీని ఇంటికి పిలిచి విందు ఇచ్చి అభాసుపాలయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో పబ్లిసిటీ వచ్చే ఏ చిన్న అవకాశాన్ని మేడమ్ వదులుకోరని, అదే ఇప్పుడు బూమరాంగ్ అయిందని కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. ఇంకొందరైతే…. అసలు ఇదంతా…. కానిస్టేబుల్ జయశాంతి ప్లాన్డ్‌గా చేసిన వ్యవహారమని కూడా విశ్లేషిస్తున్నారు. ఆమె చాలా తెలివిగా వ్యవహరించారని, ఒక్క వీడియో వైరల్ అయితే అన్నీ సెట్ అయిపోతాయన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు చెప్పుకుంటున్నారు. అది కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అయితే… కథ వేరేలా ఉండేదేమోగానీ…. ఎపిసోడ్‌లోకి డైరెక్ట్‌గా హోం మంత్రి ఎంట్రీతో సీరియస్‌నెస్ పెరిగి మొత్తం అడ్డం తిరిగినట్టు తెలుస్తోంది. పొలిటికల్ టర్న్ తీసుకుని రచ్చ మొత్తం హోం మినిస్టర్ చుట్టూ తిరుగుతోంది. మేడం ట్రెండింగ్‌లోకి వెళ్దామని అడ్వాన్స్ అయిపోయి అభాసుపాలయ్యారన్న విమర్శలు పెరుగుతున్నాయి. మిగతా ప్రభుత్వ విభాగాలకన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో మరింత క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుందని, ఒక కానిస్టేబుల్‌ని ఇంటికి పిలిచేటప్పుడు హోం మినిస్టర్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేకపోయారా? పబ్లిసిటీ యావలో ప్రాధమికమైన విషయాలను విస్మరించారా అన్నది ఎక్కువ మంది ప్రశ్న. ఇంటెలిజెన్స్ వింగ్ ఆ మాత్రం హోంమంత్రికి బ్రీఫ్ చేయలేకపోయిందా? లేక అనితే వాళ్ళకు ఆ అవకాశం, గ్యాప్ ఇవ్వలేదా అన్నది ఇంకొందరి డౌట్. హోం మినిస్టర్ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే చూశారని, సొంత శాఖలో కనీసం ఆరా తీయలేదన్న అభిప్రాయం ఉంది డిపార్ట్‌మెంట్‌లో. ఆ ఇష్యూలో అనిత మరీ అంత స్పీడ్ అవ్వకుండా… కాస్త సంయమనం పాటిస్తే బాగుండేదని, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటన్న మాటలు అటు రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. కేవలం ప్రచారాలే కాదు, వాటి వెనక ఉద్దేశాల్ని కూడా అబ్జర్వ్ చేస్తే బాగుంటుందన్న సలహాలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి కానిస్టేబుల్ వ్యవహారంలో హోం మంత్రి అనిత అడ్వాన్స్ అయి డిఫెన్స్‌లో పడ్డారన్నది విస్తృతాభిప్రాయం.
