Site icon NTV Telugu

Off The Record: ఆ మాజీ మంత్రి పొలిటికల్ కెరీర్కు ఇక ఎండ్ కార్డు పడినట్టేనా..?

Otr Uma

Otr Uma

Off The Record: దేవినేని ఉమామహేశ్వరరావు. టీడీపీ సీనియర్‌ లీడర్‌, మాజీ మంత్రి. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు. ఇప్పుడా చక్రం జంగుపట్టి జామైపోయి… గ్రీస్‌తో రిపేర్‌ చేసి తిప్పుదామన్నా తిరగడం లేదట. ప్రస్తుతం ఉమా గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నట్టు చెప్పుకుంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళు జిల్లాలో ఏక ఛత్రాధిపత్యం నెరిపిన నాయకుడి గురించి ప్రస్తుతం మాట్లాడుకునేవాళ్ళే లేకుండా పోయారు. ఒకరకంగా పొలిటికల్‌ శంకరగిరి మాన్యాలు పట్టారన్నది జిల్లా టాక్‌. గతంలో నందిగామ నుంచి రెండుసార్లు, మైలవరం నుంచి మరో రెండు విడతలు వరుసగా గెలిచిన ఉమా మహేశ్వరరావును 2019 ఎన్నికల్లో తొలిసారి పరాజయం పలకరించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయంగా కోలుకోలేదన్నది పొలిటికల్ వర్గాల మాట. 2014 నుంచి 19 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమా కీలక పాత్ర పోషించారు. కానీ…ఈసారి పార్టీ అధికారంలోకి ఆయన పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దన్నట్టుగా మారిపోయింది. అధికారం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా మాజీ మంత్రికి ఇంతవరకు ఏ పదవి దక్కకపోవడం చర్చనీయాంశం అయింది.

దీన్నిబట్టి చూస్తుంటే… అసలు ఎన్నికలకు ముందు నుంచే ఆయనకు బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయనేలేదు. అప్పుడే పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందన్న చర్చలు నడిచాయి. ఉమాకు బదులుగా 2019లో వైసీపీ తరపున ఆయన మీదే గెలిచిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి మరీ టిక్కెట్‌ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. వసంతకు టికెట్ ఇవ్వటాన్ని మొదట్లో వ్యతిరేకించిన ఉమామహేశ్వరరావు ఆ తర్వాత పెద్దల ఆదేశాలతో ఇక చేసేదేం లేక కామైపోయారు. ఇక అదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ భారీ మెజారిటీతో గెలవడంతో…. ఉమా పొలిటికల్ కెరీర్ మీద పెద్ద బండరాయి పడ్డట్టు అయిందన్న విశ్లేషణలున్నాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన ఉమాకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే పెద్ద విషయంకాగా….. అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవి ఇప్పటికీ ఇవ్వకపోవడంపై రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి.

ఇక ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎండ్‌ కార్డ్‌ వేసేసినట్టేనా అన్నది ఎక్కువ మంది డౌట్‌. తనకు ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇస్తారని ఇన్నాళ్లు గట్టిగానే ఆశపడ్డారట దేవినేని. కానీ… ఆ ఆశ నెరవేరలేదు. అది పోతేపోనీ… కనీసం ప్రాధాన్యం ఉన్న నామినేటెడ్ పోస్ట్‌ అయినా ఇస్తారనుకున్నా….అదీ జరగలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మందికి నామినేటెడ్ పదవులను ఇచ్చిన టీడీపీ అధిష్టానం…. ఉమాకు మాత్రం మొండి చేయి చూపించింది. దీంతో… ఇక మీదట ఆయన పొలిటికల్‌ కెరీర్‌ ఎలా ఉండబోతోందన్న చర్చలు మొదలయ్యాయి. అలా ఎందుకు జరుగుతోందని అంటే… రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నమ్మి 2014 నుంచి 19 మధ్య ప్రాధాన్యం ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తే… ఆయన వ్యవహరించిన తీరుతో…ఉమ్మడి జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న భావన అధిష్టానంలో ఉందట. ఆ ఫీలింగ్‌ ఇప్పటికీ పోలేదని, అందుకే ఉమాకు ఏ పదవీ ఇవ్వకుండా పక్కకు నెట్టేసినట్టు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లాలో మాజీ మంత్రి వ్యతిరేక వర్గం గట్టిగా ప్రచారం చేస్తోంది. అయితే ఆయన మాత్రం తన ఉనికి చాటుకునేందుకు ఇంకా ప్రెస్ మీట్స్‌ పెట్టడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నది కొందరి అభిప్రాయం. ఈ సీనియర్‌ లీడర్‌ పొలిటికల్‌ కెరీర్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి మరి.

Exit mobile version