Off The Record: పెన్మత్స విష్ణుకుమార్ రాజు….. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే. మేటర్ ఏదైనాసరే కుండ బద్ధలు కొట్టేయడం ఆయనకు అలవాటు అన్న అభిప్రాయం ఉంది. అదే అసవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే…. తెర వెనక వ్యవహారం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో… ఈసారి కూటమి ప్రభుత్వం కొలువు దీరాక విష్ణుకు ప్రాధాన్యం దక్కుతుందని భావించారు చాలామంది. ముఖ్యమంత్రితో వుండే సాన్నిహిత్యం కారణంగా ఈక్వేషన్లు చూడకుండానే సముచిత స్ధానం కల్పిస్తారనే ప్రచారాలు సైతం నడిచాయి. కానీ… అంతిమంగా ఆయన అసెంబ్లీలో తన పార్టీ ఎల్పీ లీడర్ పోస్ట్‌తోనే సరిపెట్టుకోకతప్ప లేదు. ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు మెల్లిగా గొంతు సవరించుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంశాల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు డిఫరెంట్‌గా వుంటోంది. కూటమి ప్రభుత్వం క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం గాలితీసేస్తున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో విష్ణుకుమార్ రాజు మూడు కీలక ప్రాజెక్ట్ ల మీద చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడుల ప్రస్తావన నుంచి ప్రచారం పీక్స్ లోకి వెళ్లీంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఏపీ అభివృద్ధికి ఇది గేమ్ ఛేంజర్ భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ వైబ్ కొనసాగుతుండగానే విష్ణుకు మార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. డేటా సెంటర్ల వల్ల లక్షల్లో ఉద్యోగాల కల్పన వుండదని….ఎకో సిస్టం ద్వారానే అది సాధ్యం అవుతుందని తేల్చేశారు. దీంతో డేటా సెంటర్ల ద్వారా అంటే… అనుబంధ విభాగాలతో కలుపుకునే చూడాలని టీడీపీ పెద్దలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే… కొద్దిరోజుల క్రితం రుషికొండ మీద కూడా బాంబ్ పేల్చారు విష్ణు. సప్త రుషుల తపోకేంద్రమైన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక అవసరాలకు కేటాయించాలని, గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ చేయవద్దని సూచించారాయన. హోటల్స్, ఇతర అవసరాలకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పిన కేబినెట్ సబ్ కమిటీ… స్ధానిక ప్రజాప్రతినిధులను సంప్రదించ కుండానే నిర్ణయం తీసేసుకుంటుందా….? అని ప్రశ్నించడం ద్వారా విస్త్రుతమైన చర్చకు తెరతీశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈ ప్రస్తావన తెచ్చాక మిగతా శాసనసభ్యులు సైతం అంతేగా….అంతేగా… అనడం ఇక్కడ కొసమెరుపు. ఇక ఈ రెండిటికంటే పెద్ద వ్యవహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ట్రయిల్ రన్ ముగిశాక అధికార, విపక్షాలు క్రెడిట్ వార్ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కట్టిన ఘనత తమదంటే తమదని వాదులాడుతున్న టీడీపీ, వైసీపీ అసలు 2014-19 మధ్య ఈ అనుమతులు లభించడానికి కారణమైన NDA ప్రభుత్వాన్ని, బీజేపీని పక్కనబెట్టేయడం విచిత్రం. కమలం పార్టీ పాత్రను కరివేపాకులా తీసేయడం నచ్చలేదో…..లేక అంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు రోడ్డు ఎందుకు వేయలేదని వాస్తవంగా నిలదీయాలనుకున్నారోగానీ… డీఆర్సీ వేదికగా విష్ణు సంధించిన వ్యంగ్రాస్త్రాలు చర్చనీయాంశం అయ్యాయి. విశాఖ నుంచి భోగాపురం వెళ్ళడానికి రెండు గంటలు పడుతుందని, అదే వందే భారత్ రైల్లో అయితే నాలుగు గంటల్లో విజయవాడ వెళ్ళిపోవచ్చని అన్నారాయన. రోడ్డు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీ శ్రీ భరత్ ను కోట్ చేసి మరీ కోరడం ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమని సింబల్ చూపించి మరీ మాట్లాడేశారు ఈ సీనియర్ ఎమ్మెల్యే. దీంతో విష్ణు వ్యవహారశైలి ఏదో తేడాగా వుందని, నిజాలే అయినా… అలా నిష్టూరంగా మాట్లాడటం ద్వారా ఇరుకునపడేస్తున్నారని కూటమి నేతలు కలవరపడుతున్నారట. అయితే… అదే సమయంలో ఆయన సమస్యల్ని లేవనెత్తుతున్నారా లేక మనసులో ఏదో ఉంచుకుని కావాలనే ఇరికిస్తున్నారా అన్న అనుమానం కూడా కూటమి వర్గాల్లో ఉందంటున్నారు. ప్రత్యేకించి టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఇంకా ఉత్కంఠ రేపుతున్నాయి. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వెనక ప్రజా ప్రయోజనాలపై స్పందించడమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా తీరని వేదన ఒకటి ఆయన్ని అలా మాట్లాడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు నుంచి విష్ణుకుమార్ రాజు ఫ్యామిలీ కాంట్రాక్ట్స్ చేసేది. ఆ క్రమంలోనే… 2014-19మధ్య టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణ కాంట్రాక్ట్ విష్ణు కంపెనీకి దక్కింది. దీనికి సంబంధించి దాదాపు 120కోట్ల రూపాయల బకాయిలు వున్నట్టు తెలుస్తోంది. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్స్ అంతా నలిగిపోతున్నారని, ప్రభుత్వ మాట నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు అప్పుల పాలైపోతున్నారని సందర్భం వచ్చిన ప్రతీసారీ ప్రస్తావిస్తుంటారు ఎమ్మెల్యే. ఆ అసంతృప్తితోనే… విష్ణు ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అన్న డౌట్స్ టీడీపీ నాయకులకు కూడా ఉన్నాయట. కారణం ఏదైనా… బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం కూటమికి పంటికింద రాయిలా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్.
