Off The Record: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ మంత్రులు కొందర్ని టెన్షన్ పెడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది రాజకీయవర్గాల్లో. ఆయన విసురుతున్న గూగ్లీలను కాచుకోలేక మంత్రులు సతమతం అవుతున్నారన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ తరపున గట్టిగా మాట్లాడుతున్న కొద్దిమందిలో పేర్ని నాని ఒకరు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌నే ఎక్కువగా టార్గెట్ చేసిన పేర్ని.. అధికారం కోల్పోయాక మాత్రం.. అన్ని అంశాల మీద ప్రధాన స్పీకర్‌గా మారిపోయారు. ఈ క్రమంలోనే.. తాజాగా, కేబినెట్ మంత్రులను టార్గెట్ చేయడం పొలిటికల్ హాట్ అవుతోంది. తొలి నుంచి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న పేర్ని నాని…. తాజాగా తన ఫోకస్‌ను మంత్రుల మీదికి మళ్ళించడం చర్చనీయాంశమైంది. ఆ మధ్య తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేయగానే కౌంటర్ ఇస్తూ… పెద్ద బాంబే పేల్చారు పేర్ని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ గూటికి చేరేందుకు అనగాని ప్రయత్నించారని, అందుకోసం 25 కోట్ల రూపాయలు అడిగారని ఆరోపించారు. అందుకు జగన్ ఒప్పుకోకపోవడంతో… టీడీపీలోనే కొనసాగి ఇప్పుడు మంత్రి అయ్యారంటూ తీవ్ర ఆరోపణ చేశారు నాని.
ఆ దెబ్బకు మంత్రి శిబిరంలో కలకలం రేగిందని చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి ఆరోపణల్ని చట్ట పరంగా ఎదుర్కొంటానని మంత్రి అనగాని చెప్పినా….ఆయన కొంతవరకు ఇబ్బంది పడ్డారన్న అభిప్రాయం మాత్రం ఉంది రాజకీయవర్గాల్లో. ఇక తాజాగా నూజివీడు నియోజకవర్గంలో పర్యటించిన పేర్ని నాని…. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథిని విమర్శించారు. సారథి అనుచరుడు సతీష్ నియోజకవర్గంలోని ఒక మండలం మీద దృష్టి పెట్టి అక్కడి మట్టి తోలకంతోపాటు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, నియోజకవర్గంలో పేకాట క్యాసినో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వాటి మీద మంత్రి సారధి స్పందించక పోయినా…. ఆయన వర్గం నేతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారని, అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదనేది చెప్పుకుంటున్నారు. నాని ఇలా…. వరుసగా మంత్రులను టార్గెట్ చేయడం, తీవ్ర ఆరోపణలు గుప్పించడంపై అధికార పార్టీలో చర్చ జరుగుతోందట.
కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే నాని మీద పలు కేసులు బుక్ అయ్యాయి. తాజాగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మచిలీపట్నంలో కేసు నమోదైంది. అధికారం కోల్పోయిన తర్వాత తన ప్రత్యర్థి, బందరు ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర గురించే ఎక్కువగా మాట్లాడిన పేర్ని నాని.. ఇప్పుడు మిగతా మంత్రులను కూడా ఎందుకు టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. అందుకు సమాధానంగా ఓ కొత్త రీజన్ చర్చలోకి వస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద విపరీత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులపై పేర్ని ఫోకస్ పెట్టి ఉండవచ్చన్నది కొందరి డౌట్. అటు హోం మంత్రి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌పై కూడా పేర్ని నాని గతంలో విమర్శలు చేసినా…. ప్రస్తుతం అనగాని, సారధి మీద చేస్తున్న వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. మాజీ మంత్రి వ్యాఖ్యలతో మంత్రులు ప్రస్తుతానికి ఇబ్బందిపడ్డట్టు కనిపిస్తున్నా…. వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది.
