Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో లడ్డు ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న అంశం చుట్టూనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మొత్తం తిరుగుతోంది. సీఎం చంద్రబాబు ఏ ముహూర్తాన ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారోగానీ….. అప్పట్నుంచి పొలిటికల్ ఘీ సలసల మరుగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందన్న కల్తీపై సీబీఐ ఎంక్వైరీ, సిట్ ఏర్పాటు, సుప్రీంకోర్టు జోక్యం…ఒకటేమిటి ఇలా రకరకాలుగా సాగుతూనే ఉంది వ్యవహారం.ఇక తాజాగా దీనికి సంబంధించి వన్ మ్యాన్ కమిటీని నియమించింది ఏపీ సర్కార్. అటు ప్రతిపక్షానికి బలం ఉన్న శాసనమండలిలో ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ మధ్య సంబంధాల వ్యవహారం మంటలు పుట్టిస్తోంది. ఈ దశలో టీడీపీ వర్గాల్లో కొత్తగా అంతర్మథనం మొదలైందట. దానికి సంబంధించిన రకరకాల చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మనం ఏదో చేద్దామనుకుంటే… అది ఇంకేదో అయి.. ఎటెటో పోతోంది. మరీ సాగదీస్తే మనకే నష్టం…. తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఇక ఇక్కడితో వదిలేస్తే బెటరంటూ టీడీపీ లీడర్స్ తమలో తాము మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో దీనికి సంబంధించి కూటమిలోని మిగతా భాగస్వాముల నుంచి సరైన మద్దతు ఉండటంలేదని కూడా తెలుగుదేశం నేతలు అనుకుంటున్నట్టు సమాచారం.
ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ వేసే వరకు ఒక లెక్క…. ఆ తర్వాత మరో లెక్క అనే పరిస్థితి ఉందట. వచ్చిన రిపోర్ట్స్ లో జంతువుల కొవ్వు అవశేషాలు లేవని చెప్పడం,వెరీ లెస్ అని ఉండడంతో జనసేన, బీజేపీ కొంత వెనక్కి తగ్గినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదే విధంగా కేంద్ర పెద్దలు కూడా తిరుమల లడ్డు అంశంలో ఇంతకు మించి ఎక్కువగా ముందుకు వెళ్లద్దని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోందట. దేవుడి వ్యవహారం, చాలా సున్నితమైన అంశం కాబట్టి…. అనవసరంగా ఎక్కువ లాగి ముందుకు వెళ్తే ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం టీడీపీ సర్కిల్స్‌లో బలపడుతోందట. తిరుమల లడ్డు అంశంలో తాము ముందుకు వెళ్లే కొద్దీ… అటు వైసీపీ కూడా పాత విషయాలను తవ్వి తీస్తోందని, దీంతో ఇప్పటిదాకా వచ్చిన మైలేజ్ పోయే ముప్పు ఉందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం..వైఎస్.రాజశేఖర రెడ్డి…ఏడు కొండల్ని రెండు కొండలు చేశారంటూ టీడీపీ నేతలు, మంత్రులు పదే పదే విమర్శిస్తున్నారు. అయితే… తాజాగా మొన్నటి ప్రెస్ మీట్ లో జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అది రెండు కొండలు చేయడం కాదని, మొత్తం ఏడు కొండల పరిధిని గుర్తిస్తూ…. అప్పట్లో జీఓ ఇచ్చారని, అన్యమత ప్రార్ధనలు తిరుమలలో జరగకుండా చెయ్యాలని కూడా రెండు జీవోలు ఇచ్చారంటూ గుర్తు చేశారు.
ఇవే జీవోలను రద్దు చేస్తానని చంద్రబాబు 2009 ఎన్నికల్లో ప్రచారం చేసి, ఇప్పుడు మాత్రం రెండు కొండలు చేస్తానని వైఎస్ అంటే తాను అడ్డుకున్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు జగన్. దీంతో ప్రస్తుతం టీడీపీలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోందట. పాత విషయాలు అనవసరంగా బయటకు వస్తే… లేనిపోని తలనొప్పులు పెరుగుతాయని భావిస్తున్నారు టీడీపీ లీడర్స్. లడ్డు వ్యవహారాన్ని ఇలాగే కొనసాగిస్తే…. దేవుడి మీద రాజకీయలని విమర్శల పాలవడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదని కూడా మాట్లాడుకుంటున్నారట టీడీపీ లీడర్స్. ఇంకా సాగదీస్తే…..అటు జనసేన, బీజేపీ నుంచి భవిష్యత్తులో ఎలాంటి మద్దతు వస్తుందో..అసలు హిందుత్వ అజెండాతో ఉన్న బీజేపీ..పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందో.. లేదోనన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో లడ్డూ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేస్తేనే బెటర్ అంటూ అధికార పార్టీ నాయకులు అంతర్గతంగా డిస్కస్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
