Off The Record: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. చింతపల్లి అటవీ ప్రాంతంలో తాజాగా సర్వే బృందాలు శాంపిల్ కలెక్షన్ చేయడం తీవ్ర దుమారం రేపింది. సుదీర్ఘకాలంగా ఆదివాసీలు తమ అస్తిత్వం, ఫిఫ్త్ షెడ్యూల్ హక్కుల రక్షణ కోసం చేస్తున్న పోరు తిరిగి తెరపైకి వచ్చింది. దీంతో రాజకీయ అలజడి కూడా మొదలైపోయింది. అయితే… గతానికి భిన్నంగా ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుత ప్రయత్నాల వెనక ఒక ప్రజా ప్రతినిధి ఉన్నారని, ఆ బ్లాక్‌షీప్ ఎవరో తేల్చాలన్న డిమాండ్స్ కూడా వస్తున్నాయి. మన్యం ప్రాంతం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. అయితే కాంగ్రెస్, లేదంటే టీడీపీ అనే పరిస్థితి ఉండేది. కానీ…2014 తర్వాత ఇక్కడ పొలిటికల్ పిక్చర్ మొత్తం మారిపోయింది. ఆదివాసీలు వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ గా మారారు. అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు ఎంపీ సీటును కూడా సుస్థిరం చేసుకోగలిగింది ఫ్యాన్ పార్టీ. వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీదే ఆధిపత్యం.
కాగా… టీడీపీ కూటమిగా జట్టు కట్టినా ఏజెన్సీ వరకు ఏ పార్టీకి పట్టు చిక్కలేదు. గత ఎన్నికలకు ముందు గిరిజనం బలంగా డిమాండ్ చేస్తున్న బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక తీర్మానం వంటి హామీలు కూడా కూటమికి ఫలితాలను ఇవ్వలేదు. అదే సమయంలో వైసీపీ మొదటి నుంచి గిరిజన పక్షమేనని ప్రకటించుకోవడంతో పాటు వైఖరిలో ఎటువంటి మార్పు లేదని విస్పష్టంగా చెప్పేస్తోంది. ఇలాంటి రాజకీయ వాతావరణం ఉన్నచోట ఒకప్పుడు ప్రయత్నాలు జరిగి, ఆ తర్వాత అంతా కామ్‌గా ఉండి, ఇప్పుడు తిరిగి బాక్సైట్ తవ్వకాల దిశగా అడుగులు పడటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. అన్నల ప్రభావం తీవ్రంగా ఉన్న తూర్పు కనుమలపై కన్నేయడమంటే పులి మీద సవారీ చేయడమేనని మైనింగ్ కంపెనీలు భావించాయి. కానీ… గడిచిన రెండు దశాబ్దాల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ళుగా అనూహ్య పరిణామాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టిమరీ…అడవుల్లో ఉన్న మావోయిస్టులను ఏరేసింది. ఈ క్రమంలోనే….మన్యంలోని బాక్సైట్ నిక్షేపాలను వెలికి తీసేందుకు తిరిగి వేగంగా అడుగులు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి తరపున ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలను డిమాండ్ చేసి మరీ సాధించుకుంది బీజేపీ. ఇది కేవలం పోటీ కోసం చేసిన ప్రయత్నంగా కంటే ఇక్కడ అభివృద్ధి చేసి చూపించి పర్మినెంట్‌గా పాగా వేయాలనే బలమైన ఆలోచనే ప్రధానమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ… ఏజెన్సీలో బలమైన శక్తిగా ఎదగాలని కూటమి పార్టీలు ప్రయత్నం చేస్తున్న తరుణంలో బాక్సైట్ ఇష్యూ మరోసారి తెర మీదకు రావడం అధికార పక్షానికి ఇబ్బందికర పరిణామం అనే చర్చ జరుగుతోంది. ఆపరేషన్ కగార్ తర్వాత AOBలో మావోయిస్టు పార్టీ ఉనికిని కోల్పోయింది. ఇప్పటిదాకా… మైనింగ్ అనుమతులు ఉన్నా స్థానిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఇటువైపు చూడ్డానికి సాహసం చేసేవి కాదు.
కానీ…మారిన పరిస్థితుల్లో అత్యంత విలువైన ఖనిజ సంపద మీద ముఖ్య నేతలు దృష్టి సారించడమే కాదు…. వాళ్ళ కనుసన్నల్లోనే విచ్చల విడి తవ్వకాలకు రంగం సిద్ధమవుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రంగురాళ్లు, లేటరైట్ వంటి సంపదను వెలికితీయడంలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై వామ పక్షాలు నెత్తీ నోరు కొట్టుకుంటున్నాయి. ఇక బాక్సైట్ తవ్వకాలు మొదలైతే… ఎలాంటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన సైతం మన్యంలో వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యందా బాక్సైట్ కోసం ఒక ఎంపీ, కొందరు ఎమ్మెల్యేలు సిండికేట్ అయి…. రోడ్ మ్యాప్ రెడీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో అసలు విశాఖ మన్యంలో ఉన్న బాక్సైట్ నిల్వలు ఎంత? అందరి దృష్టి అటువైపే ఎందుకు మళ్ళుతోందన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. వాటికి సమాధానాలు తెలుసుకున్న వాళ్ళకు మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతోందట. ఒకవేళ నిజంగానే తవ్వితే… అంత సంపదను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తారా అంటూ నోళ్లు వెళ్ళబెట్టేవాళ్ళు సైతం పెరిగిపోతున్నారు. మైనింగ్‌లో చెయ్యి తిరిగిన, పేరున్న బడా కార్పొరేట్ కంపెనీలు ఒక జీవిత కాలం తవ్వుకున్నా కూడా తరిగిపోనంత ఎక్కువగా ఇక్కడ బాక్సైట్ నిక్షేపాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అరకు-చింతపల్లి అటవీ ప్రాంతంలో ఆరు బ్లాకులు.. చింతపల్లి, సప్పర్ల, అనంతగిరి, గుర్తేడు, గూడెం, కాటంరాజ్ కొండల్లో సుమారుగా 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి 1980లోనే జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు ఇచ్చింది.
బాక్సైట్ మైనింగ్ కోసం ఉమ్మడి ఏపీ హయాం నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక్కడ తవ్వాలంటే ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల పేరిటే మైనింగ్ లీజులు ఇవ్వాలి. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. కానీ… ఇక్కడే అసలైన మెలిక ఉంది. ఏపీఎండీసీ నేరుగా మైనింగ్ బాధ్యతలు నిర్వహించదు కాబట్టి… తవ్వకాల కోసం ప్రైవేటు కంపెనీలతో జతకట్టింది. అందులో భాగంగా అరకు, సప్పర్ల ఏరియాల్లో మైనింగ్‌తోపాటు అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. మరోవైపు, తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పోరాటాలు చేశాయి. దాంతో…బాక్సైట్ ఒప్పందానికి సంబంధించిన 222, 289 జీవోలను 2016లో ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో 44 ఇచ్చింది. అలాగే.. ఏపీఎండీసీకి బాక్సైట్ బ్లాక్ లీజుల కేటాయింపును కూడా 2019లో రద్దు చేసింది. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగిందని భావిస్తున్న టైంలో…ఇప్పుడు మారిన పరిస్థితుల్ని ఆసరా చేసుకుని ముఖ్యమైన రాజకీయ నేతలు కొందరు ఇక్కడ లూటీకి సిద్ధమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఆవిషయంలో కూటమి పార్టీల విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి వైసీపీ, వామపక్ష పార్టీలు. దీంతో బాక్సైట్ కొండలపై ఎప్పుడు గునపం పడ్డా పొలిటికల్ మంటలు పీక్స్‌కు చేరడం ఖాయమన్న చర్చలు నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా… కార్పొరేట్ కంపెనీలకు దాసోహం అంటూనో, లేక వాళ్ళతో కలిసి అంతులేని సంపదను దోచుకుందామనో ఎత్తులు వేస్తున్న ఆ ఎంపీ ఎవరంటూ తెగ ఎంక్వైరీ చేసేస్తున్నాయి రాజకీయ వర్గాలు.

