Off The Record: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలో ఉన్నామని, బల్దియా పీఠం మాదేనని తొలుత ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌కు ఫైనల్‌గా నిరాశ తప్పలేదు. సరిపడా మెజార్టీ రాకపోవడం పక్క పార్టీలు లేదా స్వతంత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ బీజేపీ 21 వార్డుల్లో గెలవగా… ఎంపీ,ఎమ్మెల్యే ఓట్లతో కమలం బలం 23కు చేరింది. 26 సీట్లు గెల్చుకున్న పార్టీకే ఛైర్మన్ పీఠం దక్కుతుంది. ఈ పరిస్థితుల్లో కాషాయదళం ఊహించని రీతిలో మిగతా అన్ని పార్టీలు ఏకం అయ్యాయి. ఇక కావాల్సింది మూడు సీట్లే కదా సెట్ చేద్దాం, పీఠం మనదేనని బీజేపీ అనుకుంటుండగానే బీఆర్ఎస్ తెరవెనక చక్రం తిప్పిందట. మాజీ మంత్రి జోగురామన్న లైన్‌లోకి వచ్చి ఇండిపెండెంట్‌ను చైర్మన్ చేస్తే… మాతోపాటు ఎంఐఎం మద్దతు కూడా ఇప్పిస్తామని కాంగ్రెస్‌కు ప్రతిపాదించారట.
అందుకు హస్తం నేతలు ఓకే చెప్పడంతో….ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీకి షాకిస్తూ….ఇండిపెండెంట్‌గా గెలిచిన బండారి అనూష ఛైర్‌పర్సన్ అయ్యారు. ఎంఐఎం నాయకుడు మహ్మద్ రోహిత్ వైస్ చైర్మన్ అయ్యారు. అదంతా ఒక ఎత్తయితే…. ఇండిపెండెంట్‌గా గెలిచిన అనూష కాంగ్రెస్‌లో చేరారు. దీంతో… ఓనేత తన వల్లనే కాంగ్రెస్‌కు ఛైర్మన్ సీటు దక్కిందంటూ సంబరాలు చేసుకున్నారట. మున్సిపల్ కౌన్సిల్ హాల్ సమీపంలో సైతం ఆర్బాటం చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిని పీఠం ఎక్కించి ఓన్ చేసుకోవడంతో అసలు ఈ క్రెడిట్ ఎవరిదన్న చర్చ జరుగుతోంది. రూల్స్ ప్రకారం ఇండిపెండెంట్ చైర్మన్ కాగా….తమ సామాజికవర్గం కాబట్టి తామే పేరును ప్రతిపాదించి చక్రం తిప్పామని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటుండటం చర్చనీయాంశం అయింది. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇంకో వైపు కాంగ్రెస్… ఇలా మూడు ఉద్దండపార్టీలు ఉండగా ఇండిపెండెంట్ పీఠం ఎక్కడం అన్ని పార్టీల క్యాడర్‌కు మింగుడు పడని అంశమే. అయినా ముఖ్య నాయకులు మాత్రం… ఎవరికి వారు అది తమ రాజకీయ చతురతే అని చెప్పుకోవడం కొసమెరుపు.
