Site icon NTV Telugu

Off The Record: ఆడుదాం ఆంధ్ర కేసు అటకెక్కినట్టేనా..?

Aadudam Andhra Scam Case

Aadudam Andhra Scam Case

Off The Record: అదిగో కేస్‌ అన్నారు… ఇదిగో అరెస్ట్‌ అని ప్రచారం చేశారు. ఇంకేముంది, అంతా అయిపోయింది. ఆడుదాం ఆంధ్రాలో బీభత్సాలు జరిగిపోయాయి. కోట్లు కొల్లగొట్టేశారు. ఆ కేసులో మాజీ మంత్రి రోజాను అరెస్ట్‌ చేసేస్తున్నారంటూ ఒక దశలో తెగ హడావిడి చేశారు టీడీపీ లీడర్స్‌. కట్‌ చేస్తే…. ముఖచిత్రం వేరుగా ఉంది. ఇప్పుడసలు ఆ ఊసేలేదు. అక్రమాలు, అరెస్ట్‌లంటూ… అప్పట్లో నానా హంగామా చేసిన నాయకుల గొంతులన్నీ మూగబోయాయి. పైగా… అదే టైంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రోజా వాయిస్‌ పెరుగుతోంది. ఇక్కడే సగటు తెలుగుదేశం కార్యకర్తలకు పే….ద్ద…. డౌట్‌ వస్తోందట. నిజంగానే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగలేదా? లేక వీళ్ళు కాంప్రమైజ్‌ అయిపోయి మనం మనం బరంపురం అని మాట్లాడేసుకున్నారా? అని ఆరాలు తీయడం మొదలైపోయింది. ఇంకొందరు చిత్తూరు తమ్ముళ్ళు అయితే…. ఇంకో అడుగు ముందుకేసి ఆమెతో గట్టిగా తిట్టించుకోవాలని అసలోళ్ళే ఆశపడుతుంటే… మనం మాత్రం ఏం చేస్తాం. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకనుకుంటూ నిష్టూరంగా మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది.

వైసీపీలోని మిగతా నాయకుల సంగతి ఎలా ఉన్నా… రోజా విషయంలో మాత్రం బాగా పొలిటికల్‌ కసితో ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆమె… నోటితోనే నరకయాతన పెట్టారన్నది వాళ్ళ ఆరోపణ. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్‌ చేసి… అస్సలు లెక్కలేనితనంగా, పరువు తక్కువగా మాట్లాడారన్నది టీడీపీ కేడర్‌ ఆవేదన. దాంతో… అధికారంలోకి వచ్చాక ఆమె విషయంలో స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇక మంత్రిగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమ నిర్వహణలో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రోజాను రేపో మాపో అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం కూడా జరిగిపోయింది. కానీ… ఇప్పుడు అసలా కేసు ఊసే లేకపోవడం ఏంటన్న అనుమానాలు టీడీపీ వర్గాల్లోనే పెరుగుతున్నాయట. ఏదో…. ప్రతీకారం కోసం రోజా మీద చర్యలు తీసుకోవాలన్నది తమ అభిమతం కాదని, దర్యాప్తు చేసి, తప్పు జరిగిందని తేల్చి కూడా… ఆ కేసుకు సంబంధించి ఏ ఒక్కరి మీదా చర్య తీసుకోకుండా… ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్టుగా ఎందుకు మారిపోయిందని ఎంక్వైరీ మొదలు పెట్టేసిన కొందరు ఉమ్మడి చిత్తూరు టీడీపీ నాయకులకు కొత్త విషయాలు తెలిసి అవాక్కయ్యారట. ఈ మేటర్స్‌ ఏవీ బయటికి రాకుండా, అడుగు ముందుకు పడకుండా…. రాయలసీమకు చెందిన ఒక మంత్రి, సీమలోని ఓ జిల్లాకు ఇన్ఛార్జ్‌గా ఉన్న కోస్తా మినిస్టర్‌, మరో ఐఎఎస్‌ ఏకంగా కాంక్రీట్‌ గోడే కట్టేసినట్టు తెలిసిందట. మేటర్‌ ఆ నోట ఈ నోట పాకుతూ… అమ్మనీ…. వాళ్ళ స్థాయిలో వాళ్ళు అలా చేసేసుకుంటున్నారన్న మాట అంటూ… కేడర్‌ ముక్కున వేలేసుకుంటున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో… ఆడుదాం ఆంధ్రా అవినీతి కథేంటో… 30 రోజుల్లో తేల్చేస్తామంటూ బహిరంగ సభలోనే ప్రకటించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కానీ… ఇప్పుడు ఆ 30 రోజులు కాస్తా 365 రోజులైనా ఎందుకు సౌండ్‌ చేయడం లేదంటూ…. సోషల్ మీడియాలో సొంత కార్యకర్తలే సెటైర్స్‌ వేస్తున్నారు.

పైగా… తాజా పరిణామాలు చూసి నగరి టీడీపీ కార్యకర్తలు మరింత మండిపడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దలు ఇచ్చిన హామీలు, అమలులో నాన్చివేత ధోరణితో రోజా తిరిగి చెలరేగుతున్నారని, ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాము తలెత్తుకోలేకపోతున్నామని బాధ పడుతున్నారట. చేనేత కార్మికులకు 500 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీని నిలబెట్టుకుంటూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. హామీ అమలయిపోయిందంటూ స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించేశారు. అది చూసి లోకల్‌ తమ్ముళ్లు పాలాభిషేకాలు, సంబరాలు చేసేశారు కూడా. కట్‌చేస్తే… క్షేత్ర స్థాయిలో సినిమా మాత్రం మరోలా కనిపిస్తోంది. అన్నీ నోటి మాటలకే పరిమితం అయ్యాయి తప్ప… ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికుడికీ ఆ లబ్ది చేకూరలేదు. ఇక తాజాగా తీసుకున్న జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ నిర్ణయం కూడా నగరి టీడీపీ నాయకులకు మింగుడు పడ్డంలేదట. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని గతంలో చెప్పి ఇప్పుడు ఆ ప్రస్తావనే లేకపోవడంతో స్థానిక కూటమి నేతలు గిలగిలా కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోతే ఎలాగంటూ తీవ్ర నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. పైగా… ఎవరూ అడగని వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాల్ని తిరుపతి జిల్లాలో కలిపేసి అంతా డిమాండ్‌ చేస్తున్న నగరిని వదిలేయడం ఎందుకో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారట.

నగరి విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోల్ని ఇప్పుడు వైసీపీ లీడర్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారని, తాము ఏం మాట్లాడాలో అర్ధంగాక డిఫెన్స్‌లో పడ్డామని ఫీలవుతున్నారు టీడీపీ లీడర్స్‌. ఎలాంటి భారం, ఇబ్బంది లేకుండా చాలా తేలిగ్గా జరిగిపోయే పనిని కూడా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో… తాము ఆత్మరక్షణలో పడటమేగాక… ప్రత్యర్థి రోజాకు బలం పెరుగుతోందని, రేపు ఆమె నోటికి ఎలా సమాధానం చెప్పాలని కంగారు పడుతున్నట్టు సమాచారం. కొందరు హార్డ్‌కోర్‌ టీడీపీ నాయకులకైతే… ఇంకా పెద్ద పెద్ద డౌట్స్‌ వస్తున్నాయట. ఇలాంటి మేటర్స్‌ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లకుండా… ఆ ఇద్దరు మంత్రులే మేనేజ్‌ చేస్తూ… రోజాకు మేలు చేస్తున్నారా అన్నది వాళ్ళ డౌటనుమానం. ఇలా… కారణం ఏదైనాసరే… మాజీ మంత్రి రోజా మాత్రం మరోసారి తన ప్రమేయం లేకుండానే పొలిటికల్‌ హాట్‌ డిస్కషన్స్‌లోకి వచ్చారు. వోవరాల్‌గా నగరి తమ్ముళ్ళ ఆవేదనను టీడీపీ పెద్దలు ఎలా అర్ధం చేసుకుంటారో చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version