Site icon NTV Telugu

చంద్రబాబును, లోకేష్‌ను తిట్టిపోస్తున్న మంత్రి కొడాలి!

మంత్రి కొడాలి నాని మైక్‌ ముందుకు వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. నాని విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు లేవు. మాజీలు, సీనియర్లు సైలెంట్‌. తెలుగుదేశంలో ఉన్న అదే సామాజికవర్గం నేతలూ పెదవి విప్పడం లేదు. మనకెందుకులే అని అనుకుంటున్నారా? నానితో పెట్టుకుంటే కష్టమని డిసైడ్ అయ్యారా? కొడాలికి కౌంటర్ ఇవ్వడంపై పార్టీలో ఏమనుకుంటున్నారు?

టీడీపీ నుంచి మంత్రి కొడాలికి కౌంటర్‌ లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని ఎప్పుడూ ఘాటు వ్యాఖ్యలే చేస్తుంటారు. మాజీ సీఎం పేరు ఎత్తితే చాలు.. కొడాలి కస్సుమంటారు. ఇక లోకేష్ గురించి అయితే చెప్పేదే లేదు. సాధారణ రాజకీయ విమర్శలు కాకుండా.. కొన్ని సందర్భాల్లో కంట్రోల్‌ తప్పారా? అన్నట్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. రానురాను వాటి మోతాదు కూడా మించి పోతుంది. కర్నూలు జిల్లాలో హత్యకుగురైన టీడీపీ నేతల కుటుంబాల పరామర్శకు వెళ్లిన లోకేష్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా లోకేష్‌ అనడం.. మంత్రి నాని రంగంలోకి దిగడం.. తనదైన స్టయిల్లో దుమ్ముదులిపేశారు. లోకేష్‌లాగే.. నానీ కూడా డోస్‌ పెంచేశారు. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ నుంచి మాత్రం మంత్రికి కౌంటర్ దొరకడం లేదు.

ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధే టీడీపీ కేడర్‌లో ఎక్కువగా ఉందా?
దేవినేని ఉమా మాట్లాడినా.. జనాల్లోకి వెళ్లడం లేదు

నాని వ్యాఖ్యలను టీడీపీ నాయకులు లైట్ తీసుకోవడంపై కార్యకర్తలు బాగా ఫీల్ అవుతున్నారట. మంత్రి వ్యాఖ్యలకు రియాక్ట్ అవ్వాల్సిన స్థాయిలో టీడీపీ నేతలు నోరెత్తడం లేదు. నాని తిట్టిన వాటికంటే.. పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు అనే లెక్కే వారిని ఎక్కవ బాధిస్తుందట. ముఖ్యంగా టీడీపీలో ఉండే సీనియర్ నేతలు, అదే సామాజికవర్గానికి చెందిన నాయకులు పూర్తిగా మౌనం దాల్చుతున్నారు. తిట్టింది మనల్ని కాదు.. అధినేతనే కదా.. అంటూ వారు తప్పించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మంత్రి కొడాలి ఏస్థాయి కామెంట్స్‌ చేసినా సీనియర్ నేతలు కిక్కిరుమనడం లేదు. అప్పుడప్పుడు దేవినేని ఉమా మాట్లాడినా అవి పెద్దగా జనంలోకి పోవడం లేదు. పార్టీలోను రాజకీయంగానూ ప్రాధాన్యమూ లభించడం లేదు. అసలు కొడాలికి కౌంటర్ ఇచ్చే నేతలే పార్టీలో దొరకడం లేదట. యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటివాళ్లు నానీపై ప్రతివిమర్శలు చేయడానికి సీనియారిటీని సాకుగా చెబుతుంటారు. అందుకే వాళ్లు కొడాలిపై మాట్లాడలేరు. సీనియర్ల సంగతి అలా ఉంటే.. ఇతర మాజీ మంత్రులు, నాయకులు తమకెందుకులే అని సైలెంట్‌గా ఉంటున్నారు.

read also : గుడ్ న్యూస్ : భారత్‌లోకి త్వరలో ఫైజర్‌ టీకా

నాని జోలికి వెళ్లితే చాకిరేవు తప్పదని భయపడుతున్నారా?

పక్క జిల్లాలో ఉన్న పుల్లారావు, యరపతినేని వంటి వారు అస్సలు పట్టించుకోవడం లేదు. మొదట్లో కొద్దిరోజులు మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆ ప్రయత్నం చేసినా ఇప్పుడు వదిలేశారు. ఇక ఇతర జిల్లాల్లో ఉన్న అదే సామాజికవర్గ నేతలు కూడా పట్టి పట్టనట్టు ఉంటున్నారు. మనకెందుకులే అనే భావన ఒకటైతే.. నానికి కౌంటర్ అనగానే నేతలు భయపడుతున్నారు. నాని జోలికి వెళ్తే తమకు ఎక్కడ చాకిరేవు పడుతుందోనని .. లేదా మనదికాని విషయంలో వేలు పెట్టడం అవసరమా? అని నోరెత్తడం లేదట.

నానితో పోటీపడలేమంటున్న అదే సామాజికవర్గం నేతలు!

కొందరేమో నాని ఉపయోగించే రేంజ్‌లో పదాలు మనం మాట్లాడలేం కదా అని ఆ బాధ్యత వేరే వారికి ఇచ్చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎవరు మాట్లాడినా టీడీపీ నుంచి రియాక్షన్ ఉంటుంది. కానీ, కొడాలి మాట్లాడితే మాత్రం కౌంటర్ ఉండదు. ఈ పరిణామం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తికి కారణం అవుతోంది. ఎవరు ఏం అనుకున్నా మేం మాత్రం నానిపై మాట్లాడలేమంటున్నారు టీడీపీలోని అదేవర్గానికి చెందిన నేతలు. తాము భయపడ్డాం అనుకున్నా పర్వాలేదు కానీ.. నాని లాంటి వ్యాఖ్యలతో, నాని చేసిన కామెంట్స్‌తో తాము పోటీ పడలేమని కామైపోతున్నారు.

టీడీపీ ద్వితీయశ్రేణి నేతల్లో పెద్ద చర్చే జరుగుతోందా?

ఒకవేళ ఎవరైనా కొడాలి విమర్శలపై మాట్లాడినా చిన్నాచితకా నేతలతో సరిపెడుతున్నారు. పదవులు కోసమే తామున్నాం.. పార్టీ లైన్‌లో మాట్లాడటానికి కాదన్నట్టుగా మారిపోయింది టీడీపీలోని ఆ సామాజికవర్గ నేతల పరిస్థితి. ఈ పరిణామాలపై పార్టీ ద్వితీయశ్రేణి నేతల్లో పెద్ద చర్చే జరుగుతోంది. తమకు మంత్రిని తిట్టే స్థాయిలేదని.. స్థాయి ఉన్న మాజీ మంత్రులు, సీనియర్లు పలాయనం చెయ్యడంపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా.. కొడాలికి కౌంటర్‌ ఇచ్చేవాళ్లు టీడీపీలో లేరన్నది సుప్పష్టం.

Exit mobile version